గతేడాదితో పోలిస్తే రూ.28.69 లక్షల అదనపు ఆదాయం
విశాలాంధ్ర, ఉరవకొండ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి టెంకాయలు, కొబ్బరి చిప్పల విక్రయ హక్కుల బహిరంగ వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. గురువారం ఆలయ ఆవరణలో నిర్వహించిన వేలం పాటల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు హక్కులకు గణనీయంగా అధిక ధరలు పలికాయి. టెంకాయల విక్రయ హక్కుకు గతేడాది రూ.24.80 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.45.24 లక్షలకు చేరింది. ప్రొద్దుటూరుకు చెందిన చెన్నకేశవులు అత్యధికంగా రూ.45.24 లక్షలకు వేలం పాడి ఈ హక్కును దక్కించుకున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే దేవస్థానానికి రూ.20.44 లక్షల అదనపు ఆదాయం లభించింది. అదేవిధంగా కొబ్బరి చిప్పల విక్రయ హక్కుకు గతేడాది రూ.6.85 లక్షలు పలకగా, ఈ ఏడాది ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్ రూ.15.10 లక్షలకు వేలం దక్కించుకున్నారు. ఈ హక్కు 2026 ఆగస్టు 13 నుంచి 2027 ఆగస్టు 12 వరకు అమల్లో ఉండనుంది. ఈ హక్కు ద్వారా గతేడాదితో పోలిస్తే రూ.8.25 లక్షల అదనపు ఆదాయం దేవస్థానానికి సమకూరింది.ఈ రెండు వేలం పాటల ద్వారా గతేడాదితో పోలిస్తే దేవస్థానానికి మొత్తం రూ.28.69 లక్షల అదనపు ఆదాయం లభించింది. దీంతో ఆలయ ఆదాయ వనరులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.గతేడాదితో పోలిస్తే అత్యధిక ధరలకు వేలం హక్కులు దక్కించుకున్న వేలంపాటదారులను ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు, ఈవో సాకే రమేష్‌బాబు, టీడీపీ నాయకులు గోవిందు, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఆలయ పరిరక్షణ అధికారి అక్కిరెడ్డి, పాలకమండలి సభ్యులు, దేవదాయశాఖ అధికారులు, వేలంపాటదారులు తదితరులు పాల్గొన్నారు.


