-అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల పరిధిలో ఉన్న 44వ జాతీయ రహదారి పరిసరాలలో రహదారి ప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ రాప్తాడు సి.వెంకటేశులును ఆదేశించారు. బుధవారం రాప్తాడు పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణతో పాటు చుట్టుపక్కల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. మండల పరిధిలో వరుసగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో సంప్రదించి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో నిరంతరం పర్యటిస్తూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలని సూచించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వాహన యజమానులను పిలిపించి పరిశీలన అనంతరం నిలిచిపోయిన వాహనాలను వేగంగా అప్పగించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ జారీ చేసిన సూచనల మేరకు ప్రత్యేక దృష్టి సారించి శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల నివారణకు ముందుకెళ్తామని రాప్తాడు సీఐ వెంకటేశులు తెలిపారు. సిఐ వెంట పోలీస్ స్టేషన్ ఎస్సై షేక్షావలి సిబ్బంది ఉన్నారు.


