పోలీసుల హింస వల్లే మరణించాడని బంధువుల ఆరోపణ
మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

విశాలాంధ్ర శింగనమల… మండల పరిధిలోని నాగలగుడ్డం తాండ గ్రామంలో ఆదివారం సాయంకాలం పేకాట ఆడుతున్నాడన్న నెపంతో రామకృష్ణ నాయక్ ని పట్టుకొని పోలీసులు కొట్టి హింసించారని రామకృష్ణా బంధువులు ఆరోపించారు. మరుసటి రోజు ఉదయాన్నే స్టేషన్ కు రమ్మని భయభ్రాంతులకు గురి చేశారన్నారు, పోలీసులు కొట్టిన దెబ్బలకు అస్వస్తత గురైన రామకృష్ణా సోమవారం శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని వారు తెలిపారు, పోలీసుల దురాగతం వల్లే రామకృష్ణ నాయక్ చనిపోయాడన్నారు, అతనికి భార్య (బాలింత) ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, భార్య పిల్లలను తల్లిని ఎవరు చూసుకుంటారని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్ వరకు స్ట్రక్చర్ మీద మృతదేహాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలుధర్నా నిర్వహించారు, పోలీసుల కర్కశత్వానికి బలైన రామకృష్ణ నాయక్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, భార్యకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు,
సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య వివరణ
శింగనమల మండలం నాగలగుడ్డం తాండా లో పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం దాడులు చేసి నలుగురిని పట్టుకున్న మాట వాస్తవమేనని, ఆదివారం చీకటి పడడంతో సోమవారం ఉదయం స్టేషన్ వద్ద హాజరు కావాలని, నలుగురికి చెప్పి పోలీసులు వెనక్కి వచ్చారన్నారు. రామకృష్ణా నాయక్ గుండెపోటుతో మరణింఛినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారన్నారు. రామకృష్ణా ను పోలీసులు బెదిరింపులకు గురి చేశారన్నది అవాస్తవమన్నారు


