జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : రీసర్వే పనులు వేగవంతంగా, పారదర్శకంగా, నిర్ణీత సమయంలో చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం రీసర్వే కార్యక్రమంలో భాగంగా అనంతపురం మండలం మనీలా గ్రామంలో గ్రామ సరిహద్దు రాయిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఇందులోభాగంగా మనీలా గ్రామ సరిహద్దు ఏ విధంగా నిర్ణయిస్తున్నారని అక్కడున్న రీసర్వే డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకుని, సర్వే ఏ విధంగా జరుగుతుందో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేకి సంబంధించి గ్రామ సర్వే టీమ్ లు ప్రతిరోజు సర్వే సంబంధిత పనులకు హాజరు కావాలని, లేనిచో సంబంధిత అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ మోహన్ రావు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


