విశాలాంధ్ర-అనంతపురం : ప్రభుత్వ వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రిలోని పరికరాలను ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాప్తాడు పి.హెచ్. సి. సిబ్బంది డిమాండ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై రాప్తాడు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి ఎదుట ఏపీ ఎన్జీవో నగర కార్యదర్శి, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి.శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలోకి చొచ్చుకొని వచ్చి రెండు వర్గాలుగా కొట్టుకుని ఆసుపత్రి ఆవరణలో అడ్డొచ్చిన వైద్య సిబ్బందిపై దాడి, ఒక స్టాఫ్ నర్స్ ను చెయ్యి విరిగేలా కొట్టడం , ఎంఎన్ఓ, మహిళా వైద్యురాలను తోసేయడంతో గాయపడ్డారన్నారు. దుండగులు ఎవరైనా కూడా ఇలా ప్రభుత్వ భవనాల్లోకి రావడం దురదృష్టకరమని, అందుకు గల కారణాలపై విచారించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నరసింహారావు, ఫార్మసిస్ట్ మూర్తి, స్టాఫ్ నర్స్ లక్ష్మి సీనియర్ అసిస్టెంట్ అరుణ, ఎఫ్ఎన్ఓ దేవయాని, రాజేశ్వరమ్మ, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


