భాగ్యనగరం వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
– ఇంద్ర ఏసీ బస్సుపై ప్రత్యేక రాయితీ
– తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం నుండి భాగ్యనగరం(హైదరాబాద్) వెళ్ళే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ కల్పించింది. ఇందుకు సంబంధించి పత్రిక ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యా లు దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ వెళ్ళే ఇంద్ర ఏసి బస్సుకు 15 శాతం రాయితీ కల్పించామన్నారు. రాయితీ ఉన్న సమయంలో సూపర్ లగ్జరీ నాన్ ఏసి బస్సు టిక్కెట్టు ధరతో ఇంద్ర ఏసి బస్సులో ప్రయాణం చేయవచ్చనీ స్పష్టం చేశారు. ఈ అవకాశం డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు.ప్రస్తుతం సాధారణ టికెట్ ధర రూ:1060 ఉండగా రాయితీ టికెట్ ధర రూ:920 అవుతుందని, ఒక్కక్క ప్రయాణికుడుకు 140 అదా అవుతుందన్నారు. దీంతో ఆర్టీసీ కి అదనపు భారం పడుతున్నప్పటికీ, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితమని,అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ సువర్ణ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీకి కాసుల వర్షం.. కార్తీక మాసంలో వివిధ ప్రసిద్ధ దైవ క్షేత్రాలకు తమ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసిందని తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి అన్నారు.దీనిలో భాగంగా శబరిమలకు 8 బస్సులు, పంచారామాలు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్ గా 15 బస్సులు, మొత్తము 36 బస్సులు 50 వేల కిలోమీటర్లు నడపడం జరిగిందన్నారు.వీటి ద్వారా ఆర్టీసీకి సుమారుగా 32 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు.రానున్న ధనుర్మాసంలో ప్రత్యేక యాత్రా బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.


