Sunday, November 16, 2025
Homeజిల్లాలుకర్నూలుఘనంగా సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి

ఘనంగా సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి

- Advertisement -

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మతోన్మాద, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం మండల కార్యదర్శి బి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలను రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిపిఎం 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించిన సీతారాం ఏచూరి, తెలుగు రాష్ట్రాల్లో చదువుకుని, ఢిల్లీ జేఎన్‌యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పూర్తి చేశారని, జేఎన్‌యూ ఎన్నికల్లో అధ్యక్షుడిగా, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన ఏచూరి, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై గట్టిగా విమర్శించి మేధావులను ఆకర్షించారని, అనంతరం సిపిఎం పూర్తికాల కార్యకర్తగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని వివరించారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించిన ఏచూరి, దేశాభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి కాదు, సామాన్య ప్రజల అభివృద్ధి అని నొక్కి చెప్పారని బాలకృష్ణ తెలిపారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, లౌకికత్వాన్ని ప్రమాదంలోకి నెట్టిందని, దీనిని అడ్డుకోవాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యత అవసరమని ఏచూరి చూపిన మార్గమే పరిష్కారమని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు, రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, లేబర్ కోడ్స్, కనీస మద్దతు ధరలు లేకపోవడం, కార్పొరేట్లకు దాసోహం చేయడం వల్ల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి దిగజారిందని, ఆహార భద్రతలో భారత్ 100వ స్థానాన్ని దాటిందని విమర్శించారు. ప్రజల సుభిక్ష జీవనానికి కమ్యూనిజమే మార్గమని ఏచూరి నొక్కిచెప్పారని, అందరూ ఐక్యంగా మతోన్మాద శక్తులను ఓడించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు ఈరన్న, నవీన్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి తరుణ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గాదలింగ, ఆటో యూనియన్ నాయకుడు సీనప్ప లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు