విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : :విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లను తొలగించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం పెద్దకడబూరులోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సహాయ కార్యదర్శులు కుమ్మరి చంద్ర, తిక్కన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లను తొలగిస్తామని, పెంచివిద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం సిగ్గు చేటన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పిన టీడీపీ నాయకులు ఇప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక రైతులు నానా అవస్థలు పడుతుంటే, మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ చార్జీలు తగ్గించి, స్మార్ట్ మీటర్లను తొలగించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ శాఖ ఏఈ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో aiyf మండల అధ్యక్షులు జాఫర్ పటేల్, షేక్షావలి , నాయకులు డోల హనుమంతు, రెక్కల గిడ్డయ్య, గోపాల్, కడుబూరప్ప మహమ్మద్ ,బుడ్డన్న, నాగన్న ,ముక్కన్న తదితరులు పాల్గన్నారు.
విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలి
RELATED ARTICLES