పెన్నహోబిలం ఆలయ నూతన రథం నిర్మాణా పనులు వేగవంతం
గవి మఠాన్ని సందర్శించిన ఆర్ జె సి చంద్రశేఖర్ ఆజాద్
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పురాతన ఆలయాలను కాపాడడమే కాకుండా వాటిని అభివృద్ధి కూడా చేస్తామని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండ లోని గవి మఠం ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవి మఠం స్థలాన్ని కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు 4.0ఎకరాలు ఇవ్వాలని ప్రతిపాదనలు రావడం జరిగిందని దీనిపై అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఏర్పాటుకు కావాలన్నా ప్రదేశంలో ఆరు ఎకరాలు భూమి ఉండగా ఇందులో రెండు ఎకరాల భూమి అన్యక్రాంతం అయినట్లు తెలుస్తోందని. అన్యక్రాంతమైన స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. బేసిక్ విలువను ఆధారంగా చేసుకుని కూరుగాల మార్కెట్ కు గవి మఠం ఆలయ భూమిని అద్దెకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గవి మఠం కి చెందిన కర్ణాటక రాష్ట్రం తుంకూర్ లో ఉన్న వ్యాపార సముదాయానికి సంబంధించిన అద్దెల వసూళ్లు లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి వేగవంతంగా అద్దె వసూళ్లకు చర్యలు చేపడుతున్నామన్నారు. పెన్నా హోబిలం ఆలయానికి రెగ్యులర్ ఈవోను త్వరలోనే నియమిస్తామన్నారు. పెన్నొహోబిలం ఆలయం గర్భగుడిలో స్వామి వారి దర్శనానికి భక్తులకు కొంత ఇబ్బందికరంగా ఉందని భక్తులకు సౌకర్యకరంగా ఉండేందుకు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఆలయంలో టోన్ వాష్ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. పెన్నహోబిలం ఆలయం రథం నిర్మాణానికి వేగవంతంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున, ఏఈ హరిత, గవి మఠం ఏసీ రాణి, ఇన్స్పెక్టర్ వన్నూరు స్వామి స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
మైసూర్ మహల్ శిథిలావస్థకు చేరుకోవడం పట్ల ఆర్ జెసి ఆగ్రహం
గవి మఠం ఆలయంలో ఎంతో చరిత్ర కలిగిన మైసూర్ మహల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడం పట్ల దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ స్థానిక అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గవి మఠం దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించారు. ఎంతో చరిత్ర కలిగిన ఇలాంటి భవనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక అధికారులకు సూచించారు.


