విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు ఉద్యమబాట పడుతుందని ఎస్టీయు రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉదయం విరామ సమయంలో ఎస్టీయు ఉద్యమబాట కరపత్రాలను పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేయాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురవుతున్నదని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలలో ఉన్న ఆందోళనను, అసంతృప్తిని తెలిపేందుకు ఎస్టీయు ఆధ్వర్యంలో దశలవారీ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 30న మండల తహసీల్దార్లకు వినతిపత్రం అందజేయడం, ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం, 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని ఎస్టీయు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు ఈరన్న, దామోదర్, గుంటప్ప, దరగయ్య, బీరప్ప, రాజేంద్ర, సుధాకర్, రామాంజనేయులు, సునీత, హేమ, నబీ సాహెబ్, శ్రీధర్, నాగజ్యోతి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


