Homeజాతీయంయూపీఐ ఛార్జీలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అక్టోబర్ 15 నుంచి అమలు

యూపీఐ ఛార్జీలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అక్టోబర్ 15 నుంచి అమలు

- Advertisement -

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిపే నిర్దిష్ఠ‌ లావాదేవీలపై 0.4% ఛార్జీలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిని నిలిపివేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టింది. ఈ నిర్ణయంతో షెడ్యూల్ ప్రకారమే కొత్త ఛార్జీల అమలుకు మార్గం సుగమమైంది.ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఛార్జీల విధింపుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ కొత్త ఛార్జీల విధింపునకు గల ప్రాతిపదికను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోరింది.

కొత్త నిబంధనల ప్రకారం ఛార్జీల స్వరూపం
సెప్టెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, వ్యక్తుల నుంచి వ్యాపారులకు (పీ2పీ) చేసే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4% ఃమర్చంట్ డిస్కౌంట్ రేట్ః (ఎండీఆర్‌) వర్తిస్తుంది. రూ.75,000, ఆపైబడిన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 ఛార్జీ ఉంటుంది. అయితే, ఈ ఛార్జీల ప్రభావం సాధారణ వినియోగదారులపై ఎక్కువగా ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎవరికి మినహాయింపు?
వ్యక్తుల మధ్య (పీ2పీ) జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.వ్యాపారులకు చేసే రూ.2,000 లోపు చెల్లింపులు పూర్తిగా ఉచితం.
యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు సున్నా-ఎండీఆర్‌ నిబంధన వర్తిస్తుంది.
అత్యావసర సేవలకు ఫ్లాట్‌గా రూ.5, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02% చొప్పున తక్కువ ఛార్జీలు వర్తిస్తాయి.

ఇది పన్ను కాదు, సెటిల్‌మెంట్ ఫీజు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఈ కొత్త ఛార్జీల వల్ల దాదాపు 96% మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని కోర్టుకు తెలిపారు. ఇది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పన్ను కాదని, కేవలం పేమెంట్ సిస్టమ్‌లో భాగమైన ఒక సెటిల్‌మెంట్ ఫీజు మాత్రమేనని స్పష్టం చేశారు.ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరని ఆయన వివరించారు. ప్రస్తుతం స్టే ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ, కేంద్రం ఇచ్చే వివరణ అనంతరం సుప్రీంకోర్టు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు