దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మళ్లీ కోల్‌కతాలో అడుగుపెట్టారు. 2007లో తన “ద్విఖండితో” ఆత్మకథపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో నగరాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిన ఆమె, నేడు కోల్‌కతాలోని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు.ఒకప్పుడు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి కోల్‌కతానే తన నివాసంగా మార్చుకున్న తస్లీమాను, ఇక్కడి నుంచి వెళ్లగొట్టిన వివాదం తెలిసిందే. ఆమె రాసిన ద్విఖండితో పుస్తకం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందనే ఆరోపణలతో అప్పటి సీపీఎం ప్రభుత్వం 2003లో నిషేధించింది. ఆ తర్వాత 2007లో తీవ్ర నిరసనల కారణంగా ఆమె నగరాన్ని వీడారు. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో ఉంటున్నారు.
రేపు ఆమె రవీంద్ర సదన్‌లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రముఖ రచయిత శిర్షెందు ముఖోపాధ్యాయ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆమె తన కవితలను వినిపించడంతో పాటు ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తన రాకపై పీటీఐతో మాట్లాడుతూ.. నేను కోల్‌కతాను ఎప్పుడూ ఇష్టపూర్వకంగా విడిచిపెట్టలేదు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నన్ను బలవంతంగా రాష్ట్రం విడిచి వెళ్లేలా చేసింది. అయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తానని ఆశతోనే ఉన్నాను. ఏళ్లు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, అయినా నాకు తలుపులు మూసే ఉన్నాయిఁ అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ దుమారం
తస్లీమా నస్రీన్ రాక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. తృణమూల్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ స్పందిస్తూ, ఆమె తరచూ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆమెకు స్వాగతం పలుకుతోందని ఆరోపించారు.
మరోవైపు బెంగాల్ మంత్రి అగ్నిమిత్రా పాల్ ఆమె రాకను గట్టిగా సమర్థించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆమెకు తిరిగి వచ్చే అవకాశం ఇవ్వలేదు. లౌకికవాదం గురించి మాట్లాడే ప్రతిపక్షాలు, ఆమె తన పుస్తకంలో నిజం రాసినప్పుడు భద్రత కల్పించలేకపోయాయి. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వంలో తస్లీమా రావడం మాకు గర్వకారణం, ఆనందకరం అని అన్నారు. మొత్తానికి తస్లీమా వ్యక్తిగత పునరాగమనం బెంగాల్‌లో మరో రాజకీయ చర్చకు తెరలేపింది.


