వందేళ్ల గుర్తింపు రెట్టింపు చేస్తూ ‘పది’లో ర్యాంకులు సాధిస్తాం
మొదటి బ్యాచ్ విద్యార్థుల సన్నద్ధంపై భైరవపట్నం జడ్‌పీహెచ్ ఉపాధ్యాయుల మనోగతం
విశాలాంధ్ర-విజయవాడ: అమ్మ ఒడి తొలి బడి అయితే… బంగారు భవిష్యత్‌నిచ్చే మలిబడి సరస్వతీ నిలయం. అమ్మ నేర్పిన అక్షరాలకు… అర్థం, పరమార్థం బోధించేది గురువులు. తల్లి వేలు విడిచి పలకా బలపం చేతబట్టి బుడిబుడి అడుగులతో బడిబాట పట్టే చిన్నారుల్లో అక్షర కాంతులు వెలిగించి తల్లిదండ్రుల ఆకాంక్ష, ఉపాధ్యాయుల కాంక్ష నెరవేర్చేదే గురుకులం. “విద్యే జీవిత వెలుగుకు మÖలం. అక్షరం ఆయుధం కంటే శక్తిమంతమైంది. చదువు … సంపాదన, సంస్కారం, గౌరవం ఇస్తుంది. అవి లభించేవి ఒక్క ఉపాధ్యాయుడి వద్దే. ఆదర్శవంతుడిగా, మార్గదర్శకుడిగా ఉంటూ పిల్లల్లో అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి అక్షర జ్యోతిని వెలిగించేవాడే నిజమైన గురువు” అంటున్నారు ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీబీ సుబ్రహ్మణ్యం. వందేళ్లుగా ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు చేసి జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లాలో కలుపబడి విద్యా సుగంధాలు వెదజల్లుతోంది మండవల్లి మండలం భైరవపట్నం పాఠశాల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అంచెలంచెలుగా ఎదిగి మొట్టమొదటి 10వ తరగతి బ్యాచ్‌ను పరీక్షలకు సన్నద్ధం చేయడం చాలా సంతోషంగాను, ఛాలెంజింగ్‌గాను ఉందంటున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం. 1926లో బోర్డు ఎలిమెంటరీ పాఠశాలగా స్థాపించబడి శత వసంతాలుగా ఎందరినో విద్యావంతులు, మేధావులుగా తీర్చిదిద్దుతున్న సరస్వతీ నిలయానికి తాను హెచఎంగా రావడం… పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నాహం చేయడం అదృష్టంగా భావిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు హెచఎం. వందేళ్లలో ఎందరో గురుబ్రహ్మలకు దక్కని భాగ్యం తనకు దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతం అంటున్నారు. “తమ పాఠశాలలో అన్ని సబ్జెక్టులను బోధించగల ఉన్నత విద్యార్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బృందం ఉంది. చక్కటి పాఠ్య ప్రణాళికతో బాలబాలికలకు పాఠ్యాంశాలవారీ విద్యాబోధన చేస్తూ… చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ‘షైనింగ్ స్టార్స’గా తీర్చిదిద్ది పదో తరగతిలో ర్యాంకులు సాధించి జిల్లాలోనే గణితికెక్కాలన్నదే తమ బృందం లక్ష్యం” అంటున్నారు ప్రధానోపాధ్యాయులు. “గ్రామ పెద్దల సహాయ సహకారాలతో పాఠశాలను ఉన్నతీకరిస్తూ విద్యా సదుపాయాలు సమకూర్చుకుంటూ మండలంలోనే ఆదర్శ పాఠశాలగా వెలుగొందుతున్న భైరవపట్నం జడ్‌పీ హైస్కూల్‌కు విద్యాపటంలో చోటు కల్పిస్తూ వందేళ్ల గుర్తింపును రెట్టింపు చేస్తూ ప్రభుత్వ విద్యారంగానికి పేరు ప్రతిష్టలు తెస్తాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు ఉపాధ్యాయ బృందం. అమ్మ నేర్పే తొలి పలుకులను అక్షరమాలగా పేర్చి బాలల బంగారు భవిష్యత్‌కు పునాది వేయడమే తమ కర్తవ్యమంటున్నారు ఈ గురుబ్రహ్మలు. “చదువుల తల్లి నీడలో పెరిగి… విద్యాబుద్ధులు నేర్చుకుని ఉద్యోగాల రీత్యా వివిధ రాష్ట్రాలు… ప్రాంతాలు తిరిగి పుట్టిన గడ్డ తిరిగొచ్చాం… అక్షర జ్ఞానాన్ని అందించిన సరస్వతీ నిలయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం” అని అంటున్న విద్యావంతుల మనోభావాలు భైరవపట్నం పాఠశాల గొప్పదనాన్ని తేటతెల్లం చేస్తోంది.
పాఠశాల పేరు నిలబెడతాం
- Advertisement -
RELATED ARTICLES


