Homeఆంధ్రప్రదేశ్బ్రిడ్జి ఇవ్వండి.. లేదంటే ఓటు లేదు..!

బ్రిడ్జి ఇవ్వండి.. లేదంటే ఓటు లేదు..!

- Advertisement -

79 ఏళ్ల నిర్లక్ష్యంపై గిరిజనుల ఎదురుదాడి.. శిరగం తోకవలసలో ఎన్నికల బహిష్కరణ శంఖారావం

అరకులోయ, విశాలాంధ్ర :- స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా ఇంకా వాగు దాటలేని బతుకులు మావి, ఇదేనా మీ అభివృద్ధి, ఇదేనా మీ ప్రజాస్వామ్యం అంటూ అరకు వ్యాలీ మండలం శిరగం పంచాయతీ పరిధిలోని శిరగం తోకవలస గ్రామస్తులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న బ్రిడ్జి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తామని, బ్రిడ్జి పని మొదలుపెట్టే వరకు బ్యాలెట్ ను ముట్టమని, ఓటు వేయమని, ఓట్ల కోసం వచ్చే నాయకుడిని ఊర్లోకి రానివ్వమని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా, ఏకగొంతుకతో తేల్చిచెప్పారు. ఇది బెదిరింపు కాదు, మా ప్రాణాల కోసం మేం చేస్తున్న తిరుగుబాటు, మా బతుకుల కోసం మేం చేస్తున్న తెగింపు అంటూ శపథం చేశారు.
సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామానికి ఇప్పటికీ సరైన రవాణా మార్గం లేదు, బ్రిడ్జి లేదు. వానొస్తే చాలు ఊరంతా జైలుగా మారిపోతుంది, వాగు పొంగి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది, అంబులెన్స్ రాదు, బడి బస్సు రాదు, ఆస్పత్రికి వెళ్లే దారి ఉండదు. గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకెళ్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రతి వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఒకవేళ ఆ రాత్రి ఎవరికైనా ఏమైనా అయితే దానికి బాధ్యులు ఎవరు, ప్రభుత్వమా, నాయకులా, మా ప్రాణాలకు విలువ లేదా అంటూ తల్లుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకులకు మా ఊరు గుర్తుంది, గెలిచాక మా గోడు ఎవరికీ వినపడదు, మా ప్రాణాల మీద లేని శ్రద్ధ మా ఓట్ల మీద ఎందుకు అంటూ గ్రామస్తులు సూటిగా నిలదీశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం ఇచ్చామని, ప్రజా పరిష్కార వేదికలో మొత్తుకున్నామని, స్థానిక కూటమి నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగామని, అయినా ఒక్క ఇటుక కూడా పడలేదని, హామీలకే పరిమితమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మాటలు వద్దు, చేతలు కావాలి, బ్రిడ్జి కట్టే వరకు ఓటు లేదు అంటూ తేల్చిచెప్పారు. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది, బ్రిడ్జి కడతారా లేక గిరిజనుల ఆగ్రహానికి బలైపోతారా అనేది అరకు మొత్తం ఎదురుచూస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు