–ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు
విశాలాంధ్ర – నిడదవోలు : యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనవాల్సిందే అంటూ పెరవలి మండలంలోని సొసైటీల వద్ద ఏర్పాటుచేసిన ప్రకటన చిన్న,సన్న కారు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. మండలంలో వరి నాట్లు వేసేందుకు పొలాల్లో దమ్ము పనులుచేస్తుండగా, మరి కొన్ని చోట్ల ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. దాంతో రైతులకు యూరియా అవసరమై దాన్ని కొనేందుకు సొసైటీలు వద్దకు చేరుకుంటున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఎరువులు ఇచ్చేదంటూ సొసైటీలు వద్ద వెలసిన ప్రకటనను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు కాంప్లెక్స్ ఎరువుల వద్దు యూరియా ఇస్తే చాలంటూ సొసైటీ అధికారులను రైతులు వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది దాంతో అవసరం లేకున్నా కొంతమంది రైతులు యూరియా కోసం కాంప్లెక్స్ ఎరువును కూడా కొనవలసి వస్తుంది దాంతో చిన్న, సన్న కారు రైతులపై ఆర్థిక భారం పడడంతో రైతులు లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పలు రైతుల నుండి వచ్చిన వినతులు మేరకు స్పందించిన సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు స్పందిస్తూ రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందంటూ ప్రభుత్వం ఓ పక్క చెబుతూ మరోపక్క కాంప్లెక్స్ బస్తా కొంటేనే యూరియా అంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతులకు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటే వారిపై అధికంగా ఆర్థిక భారం పడుతుందని ఎటువంటి షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ అవసరమైన మేరకు యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలను సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


