90 రోజులు మాత్రమే నీరు.. అయోమయంలో రైతాంగం
విశాలాంధ్ర, బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. కాలువలకు కేవలం 90 రోజులపాటు మాత్రమే నీటిని అందిస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించడంతో బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల రైతుల్లో అయోమయం నెలకొంది. పంటల సాగుకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందుతుందా? లేదా? అన్న సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి.బుధవారం తుంగభద్ర జలాశయం నీటిమట్టం 1,627.61 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 85.36 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 34,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా, వివిధ కాలువలకు 1,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు మరింత కాలం నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. కేవలం 90 రోజులపాటు నీటి సరఫరా చేస్తే పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆయకట్టు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


