సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ ట్వీట్లు
రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను కొంతమంది దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. అత్యాశకు పోతే బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారని, మీ అత్యాశే మోసగాళ్ల పెట్టుబడి అని అన్నారు. చిన్న పొరపాటుతో చాలా మంది ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు. అనవసరమైన లింకులను క్లిక్ చేయవద్దని, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మీ ఫోన్ కు వచ్చే సందేశాలను నమ్మవద్దని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష అని గుర్తుచేశారు. ఈమేరకు ఆన్ లైన్ మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ జనాలను అప్రమత్తం చేస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని, అనవసర లింక్స్ పై క్లిక్ చేసి సమస్యలు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. ఆన్ లైన్ లో పరిచయమైన వారికి, ఆన్ లైన్ స్నేహితులకు వ్యక్తిగత వివరాలు అస్సలు చెప్పొద్దని హెచ్చరించారు. ఆశపడితే అంతే సంగతులని, బంపర్ ఆఫర్, లక్కీ డ్రాల పేరుతో ఉచితంగా బహుమతులిస్తామంటే ఆశపడవద్దన్నారు. ఈ ఉచిత బహుమతుల వెనక ‘రూపాయి ఎరవేసి.. లక్షలు కొల్లగొట్టే ప్లాన్ ఉంటుంది’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు.