దేశంలో ప్రెటో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. మనం ఒకసారి గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. 2014లో యమూపీఏ ప్రభుత్వం ముగిసే సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.71.41, డీజిల్ ధర 55.49 గా ఉండేవి. కానీ, ఈ రోజు 2026 నాటికి అదే పెట్రోల్ ధర దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.94 నుండి 105 మధ్య ఊగిసలాడుతోంది. 2014లో పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు కేవలం రూ.9.48 మాత్రమే. 2020లో కరోనా సమయంలో కేంద్రం ఆ పన్నును ఏకంగా రూ.32.90కి పెంచేసింది! సరిగ్‌గా అదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయాయి. అప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, చౌక చమురు లాభాన్ని ప్రజలకు అందించకుండా, పన్నుల రూపంలో ఆ నిధులన్నింటినీ తన ఖజానాలోకి మళ్లించుకుంది. 2021లో స్వల్పంగానే తగ్గించి ఇప్పటికీ అదే కొనసాగిస్తూ వస్తోంది. వినియోగదారుడు చెల్లించే మొత్తంలో కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్పై లీటరుకు రూ.19.90, డీజిల్పై రూ.15.80 , అదనంగా రోడ్ అండ్ ఇన్రాÎÛస్ట్రకÌర్ సెస్ పేరిట రూ.4.00 వసూలు చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.15 నుండి 26 వరకు ఉంటోంది.
ఎల్పిజీ గ్యాస్ సబ్సిడీ మాయమైన కన్నీటి కథ : మరోవైపు వంటింట్‌లో గ్యాస్ సిలిండర్ల మంట మామూలుగా లేదు. ఒకప్పుడు 410 నుండి 450 మధ్య లభించే సిలిండర్‌కు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. నేడు 14.2 కేజీల ఎల్పిజీ సిలిండర్ ధర రూ.800 దాటి 910కి పైగా పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి దాదాపు అన్ని రకాల ఎల్పీజీ సబ్సిడీలను ఉపసంహరించుకుంది! ఉజ్వల పథకం కింద గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. కానీ, నేడు ఆ సిలిండర్ నింపించుకోవడానికి వెయ్యి రూపాయలు తెచ్చే స్థోమత లేక పేదలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మళ్లారని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో వైరుధ్యం ఉంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో ఎల్పిజీ ధరల్లో దాదాపు 80 శాతం పైగా పెరిగింది.
కార్పొరేట్ కంపెనీలు కట్టే టాక్స్ రేటును 30% నుండి 22%కి తగ్గించారు. అంటే దేశాన్ని శాసించే ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తూ,పేదవాళ్ల మీద పన్నుల భారం మోపుతున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం డైలీ ఫ్రైస్ రివిజన్ లేదా డైనమిక్ ప్రైసింగ్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మారిన ప్రతిసారీ, దానికి అనుగుణంగా మన దేశంలో కూడా ప్రతిరోజూ ఉదయం ధరలు మారుతుంటాయి. మార్కెట్ శక్తులకు అనుగుణంగా పారదర్శకత వస్తుందని నమ్మబలికారు. కానీ ఆచరణలో జరిగింది వేరు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, ఇక్కడ మరుసటి రోజు ఉదయానికల్లా పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి. కానీ, అక్కడ ధరలు పాతాళానికి పడిపోయినప్పుడు ఇక్కడ పైసా కూడా తగ్గదు. 2020లో అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు రికార్డు స్థాయిలో 20 డాలర్ల కంటే కిందికి పడిపోయింది. ఆ సమయంలో లీటర్ పెట్రోల్ రూ.40 కే రావాలి. కానీ రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ డ్యూటీని పెంచి ఆ లాభాన్ని ప్రజలకు అందకుండా లాగేసుకుంది. ఆ ఒక్క సంవత్సరంలోనే కేంద్రం చమురు రంగం ద్వారా రూ.3.7 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంధన ధరల దోపిడీలో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుపడితే అది నాణేనికి ఒకవైపే చూసినట్లవుతుంది. ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర తక్కువ ఏమీ కాదు. కేంద్రం ఎక్సైజ్ పన్నులు వేస్తే, రాష్ట్రాలు దానికి ఆదనంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధిస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్పై వ్యాట్ పన్ను 35.2%, ఆంధ్రప్రదేశ్‌లో 31%, మహారాష్ట్రలో 26% గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ కంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.8 నుండి 10 వరకు ఎక్కువగా ఉండటానికి కారణం ఇక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నులే. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ జీఎస్టి పరిధిలోకి తీసుకురావాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల సొంత ఆదాయంలో 20 నుండి 30 శాతం కేవలం ఈ మద్యం, పెట్రోల్ పన్నుల ద్వారానే వస్తోంది. జీఎస్టి పరిధిలోకి వస్తే గరిష్ట పన్ను 28 శాతానికే పరిమితమవుతుంది, పైగా ఆ ఆదాయాన్ని కేంద్రంతో పంచుకోవాల్సి వస్తుంది.
మనం ఎక్కడ ఉన్నాం?
అమెరికాలో పెట్రోల్ ధర లీటరుకు మన కరెన్సీలో సుమారుగా రూ.77 పడుతుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకల్లో సైతం సబ్సిడీలు ఇతర కారణాల వల్ల ధరలు మనకంటే తక్కువగా ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా, కువైట్ వంటి చమురు దేశాల్లో లీటర్ పెట్రోల్ రూ.10 నుండి 20 లోపే దొరుకుతుంది. కానీ అమెరికా, ఐరోపా దేశాలతో పోల్చినప్పుడు అక్కడి ప్రజల తలసరి ఆదాయం మన భారతీయుల కంటే 10 నుండి 30 రెట్లు ఎక్కువ. ఆదాయం అంత ఎక్కువగా ఉన్న దేశాల్లో పెట్రోల్ ధర తక్కువగా ఉంటే, తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉండి, కష్టపడి బతికే భారతీయుడికి మాత్రం ఎందుకీ శిక్ష ? డీజిల్ ధర పెరిగితే నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోతాయి. ఆర్బీఐ సైతం తన నివేదికలలో ఇంధన ధరల పెరుగుదల దేశంలో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తోంది, ఇది సామాన్యుడి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తోంది అని హెచ్చరించింది.ఐనా పట్టించుకోవడం లేదు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇంధన ధరల సంక్షోభం నుండి సామాన్యుడికి విముక్తి కలిగించడం అసాధ్యమేమీ కాదు. పెట్రోల్, డీజిల్ను వెంటనే జీఎస్టి పరిధిలోకి తెచ్చి గరిష్టంగా 28% పన్ను స్లాuÙలో ఉంచాలి. దీనివల్ల లీటర్ ధర ఏకంగా 20 నుండి 30 వరకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం తన పట్టుదలను వీడి, ఎక్సైజ్ డ్యూటీని తిరిగి 2014 నాటి స్థాయికి తీసుకురావాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, మధ్యతరగతి ఇళ్లకు నేరుగా నగదు బదిలీ ద్వారా గ్యాస్ సబ్సిడీని తిరిగి అందించాలి. ఇంధన ధరల నిర్ణాయక ప్రక్రియలో కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు కాకుండా, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ పార్లమెంట్‌లో బహిరంగ చర్చ జరపాలి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి.మన నెత్తురు, చెమట చిందించి సంపాదించిన సొమ్మును, సహేతుకమైన ధరల రూపంలో ప్రభుత్వం మనకు తిరిగి ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
సెల్ : 9490754169
దెబ్బతింటున్న సామాన్యుడి కొనుగోలుశక్తి
- Advertisement -


