“గజా అంతా తీవ్రవాదులే. అక్కడ పుట్టిన ప్రతి పిల్లా పుట్టుకతోనే తీవ్రవాది.”ఇవి నిస్సిం వటూరీ మాటలు. “గజాలో ప్రతి పిల్లా, ప్రతివాడూ మనకు శత్రువే. మనం గజాను ఆక్రమించి వలసరాజ్యంగా మార్చాలి. అక్కడ బాలలు ఎవరూ మిగలకూడదు. అంతకంటే విజయం ఏమీ లేదు.” ఇది ఇస్రాయెల్ మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫెగ్లిన్ అభిప్రాయం. “నా చిన్నప్పుడు నేను మా పాఠశాలను పేల్చేయాలనుకునే వాడిని. ఈ రోజు ఓ పాఠశాలను పేల్చేస్తున్నాను” ఈ మాటలన్నది ఓ ఇస్రాయెలీ సైనికుడు. 2023 అక్టోబర్ ఏడున హమాస్ తీవ్రవాదులు తమ మీద దాడి చేశారన్న నెపంతో ఆ మర్నాటి నుంచి ఇస్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ నాయకత్వంలో గజా, పలస్తీనా మీద భీకర యుద్ధం ప్రారంభించింది. నెతన్యాహూ రక్తదాహానికి ఆజ్యం పోస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మధ్యలో ఎన్ని శాంతి వచనాలు పలికినా, శాంతి ఒప్పందాల ప్రసక్తి తెచ్చినా మూడేళ్ల కింద మొదలైన కిరాతక దాడి ఇప్పటికైనా సంపూర్ణంగా ఆగిందని చెప్పడానికి వీలు లేదు. ఈ అక్రమ యుద్ధంలో ఇప్పటివరకు 73,000 మంది బలయ్యారు. కనీసం లక్షా 80 వేల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో బాలలే 30శాతం మంది. గాయపడిన వారిలో 26శాతం మంది బాలలే. గజాలో ఉన్న మొత్తం బాలల్లో రెండు శాతం మంది అన్యాయమైన యుద్ధానికి బలై పోయారు. మరణించిన బాలల్లో అయిదేళ్లలోపు వారు 5,031మంది. ఏడాదిలోపు వారు 1,029మంది. అమెరికా దన్నుతో నెతన్యాహూ కొనసాగించిన ఈ మారణహోమం లక్ష్యం పలస్తీనియన్ల జాతినే నిర్మూలించడం. ఆ లక్ష్యం నెరవేరి ఉండక పోవచ్చు. కానీ ఆ కారు మేఘాలు ఇప్పటికీ గజా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. గజాలో సాగిన మారణహోమం వల్ల జననాల రేటు 41 శాతం తగ్గిపోయింది. ఈ యుద్ధంలో తమ మరణం ఖాయం అనుకున్న బాలలు 96 శాతం మంది ఉన్నారు. మిగిలిన బాలలందరికీ మానసిక చికిత్స అవసరం ఉంది. 6,37,475 మంది బాలలకు పాఠశాలలు అందుబాటులో లేకుండాపోయాయి. ఎందుకంటే నెతన్యాహూ పైశాచిక దాడిలో పాఠశాలలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 3,35,000మంది బాలల ఎదుగుదల కుంటుపడింది. తల్లి దండ్రులిద్దరినో, ఒకరినో కోల్పోయిన పిల్లలు 58,554 మంది ఉన్నారు. తల్లిదండ్రుల జాడ తెలియని వారు కనీసం 18,000 మంది ఉంటారు. ప్రతి నలుగురిలో పదహారేళ్లు దాటని బాలలు మిగిలిన తమ తోబుట్టువుల బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోంది. మరో 40 శాతం మంది తమకు రక్తసంబంధం లేని బాలల బాగోగులు చూసుకోక తప్పడం లేదు. ఏ యుద్ధంలోనైనా అనుకోకుండా బాలలు కూడా ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ బాలలను పనిగట్టుకుని నిర్మూలించడం మాత్రం గజా మీద ఇస్రాయెల్ దాడిలోనే కనిపిస్తుంది. మామూలు లెక్క ప్రకారం అయితే ఇవన్నీ యుద్ధ నేరాలే. కానీ నెతన్యాహూను శిక్షించే సాహసం అంతర్జాతీయ సమాజం చేయలేక పోతోంది. గజా మీద, పలస్తీనియన్ల భూభాగం మీద ఇస్రాయిల్ యుద్ధానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. అసలు రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పలస్తీనియన్ల భూభాగంలో అప్పటి సామ్రాజ్యవాద శక్తి అయిన ఇంగ్లాండ్ మొదలైన దేశాలు కలిసి ఇస్రాయెల్ అనే దేశాన్ని కృతకంగా ఏర్పాటుచేశాయి. అప్పటి నుంచి ఇస్రాయెల్ పలస్తీనియన్ల మీద దాడులు చేస్తూనే ఉంది. అనేక మంది పలస్తీనియన్లు ఇతర దేశాలలో తల దాచుకోవాల్సి వచ్చింది. పలస్తీనియన్ల సుదీర్ఘ పోరాటం వల్ల గజా నది తీరంలో వారికి ఇంత భూమి చెక్క దొరికినా ఆ ప్రజలు ప్రశాంతంగా జీవితం గడిపిన రోజులే లేవు.ఈ పరిస్థితిని పరిశీలించి, ప్రత్యేకంగా బాలల మీద జరిగిన దారుణాలను అధ్యయనం చేయడానికి ఐక్యరాజ్య సమితి దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీనివాసన్ మురళీధర్ నాయకత్వంలో ఓ కమిషన్ ఏర్పాటుచేసింది. తూర్పు జెరూసలేం, ఇస్రాయెల్తో సహా ఆక్రమిత పలస్తీనా భూభాగంలో క్షుణ్ణమైన అధ్యయనం చేసి మురళీధర్ కమిషన్ వంద పేజీల నివేదిక ఇటీవలే విడుదల చేసింది. బాలల మీద ఇస్రాయెల్ సాగించిన మారణ హోమం లక్ష్యం కేవలం వారిని అంతమొందించడమే కాదు. బాలల నిర్మూలనకు ఇస్రాయెల్ ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించింది. తమ శత్రువులను మట్టుబెటు ట్కోవాలనుకునే దేశాలు భవిష్యత్తులో ఈ విధానాన్ని అనుసరించినా ఆశ్చర్యపడక్కర్లేదు. బాల్లని అంతం చేయడానికి క్వాడ్ కాప్టర్ డ్రోన్లను ఉపయోగించి బాలలు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని మరీ హతమార్చింది ఇస్రాయెల్. ఇది చూడడానికి హెలీకాప్టర్లా కనిపించే డ్రోన్. ఇది బాలల ఉనికిని కనిపెడ్తుంది. క్వాడ్ కాప్టర్లో పరారుణ (ఇన్ఫ్రా రెడ్) కెమెరాలు ఉంటాయి. ఆ శరీరాలు బాలలవి అని గ్రహించిన సైనికుడు ఆ బాలలను అంతం చేస్తాడు. బాలలను వేటాడి చంపడం ఇస్రాయెలీ సైనికులకు ఓ ఆటగా మారింది. పిల్లలను పగటి పూటే హతమార్చేవారు. ఆడుకునే, పరుగులు పెట్టే అమాయక బాలలు ఇస్రాయెలీ సేనల తుపాకీ గుళ్లకు బలైపోయారు. రాజకీయ నాయకులు పిల్లల మీద బోలెడు ప్రేమ ఒలకపోస్తారు. వారితో ఫొటోలు దిగి పిల్లలంటే తమకెంత ప్రీతో చాటి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మురళీధర్ కమిషన్ నివేదిక విడుదలైన తరవాత ఈ “బాల ప్రేమికులు” ఒక్కరైనా నోరు తెరవలేదు. పనిగట్టుకుని బాలలను అంతం చేసిన నెతన్యాహూ రాజకీయ వికృత క్రీడను ఖండించిన పాపాన పోలేదు. పైకి మాత్రం బాలలే భవిష్యత్ నిర్మాతలు అని సుద్దులు చెప్తారు. బాలల దినోత్సవం రోజునో, పరీక్షా పే చర్చ సందర్భంగానో బాలలతో ముచ్చటించే ప్రధానమంత్రి మోదీని పలస్తీనా బాలల మారణ హోమం గురించి బాలలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇంతటి మారణోమానికి పాల్పడిన దేశాన్ని గత ఫిబ్రవరి ఆఖరున, అంటే సరిగ్గా ఇరాన్ మీద యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు మోదీ సందర్శించారు. అప్పుడు ఆయన నెతన్యాహూతో బాలల మారణకాండ గురించి ప్రస్తావించిన దాఖలానేలేదు. గజాలో 97శాతం పాఠశాలలు నాశనం అయిన వాస్తవాన్ని ఈ “బాల ప్రేమికులు” కనీసం ప్రస్తావించారు. పలస్తీనా భూభాగంలోని 95శాతం విశ్వ విద్యాలయాల మీద యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 38 విశ్వవిద్యాలయాలు ఉంటే 22 సర్వ నాశనం అయిపోయాయి. మురళీధర్ నివేదిక పరిశీలిస్తే పనిగట్టుకుని ఇస్రాయెల్ గజా బాలల మీద ఎంతటి క్రూరమైన దాడి చేసిందో అర్థం అవుతుంది. ఇది పలస్తీనియన్ల జాతినే అంతమొందించే పథకంలో భాగం. కానీ ఇస్రాయెల్ అకృత్యాలను సమర్థించే మోదీ ప్రభుత్వం ఉన్న చోట న్యాయమూర్తి మురళీధర్ నివేదిక చదివి కళ్లల్లో తడి ఆరిపోయే దాకా రోదిస్తూ ఉండిపోవాల్సిందే.


