విశాలాంధ్ర-హైదరాబాద్: క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ… ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో భేటీ అయింది. కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తెలంగాణలో వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 11, 2024న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ మంగళవారం ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించనుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణనే అంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.