ముంబై: టీ20 ప్రపంచ కప్ లో ఇటలీ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా… ఈ లక్ష్యాన్ని ఇటలీ వికెట్లేమీ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 66 పరుగులు, ఆంథోనీ మోస్కా 32 బంతుల్లో 62 పరుగులతో చెలరేగారు. కాగా ఈ టోర్నీలో నేపాల్‌కు వరుసగా ఇది రెండో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆరిఫ్ షేక్ (27) టాప్ స్కోరర్. రోహిత్ పౌడెల్ (23), ఆసిఫ్ షేక్ (20), కరణ్ కేసీ (18లి), దీపేంద్ర సింగ్ (17) పరుగులు చేశారు. ఒక దశలో 93/3తో ఉన్న నేపాల్… 30 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఇటలీ బౌలర్లలో క్రిషన్ 3, బెన్ మన్నెంటి 2, అలీ హసన్, స్మట్స్, జస్ప్రీత్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


