. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం
. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు
. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం
. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్
బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్ కాలుమోపిన క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమాసియా, ఉక్రెయిన్, కొరియా ద్వీపకల్పం తదితర అనేక అంశాలపై ఇద్దరు అధినేతలు సుదీర్ఘకంగా చర్చించారు. తమ దేశాల మధ్య సంబంధాల సుస్థిరతను ఆకాంక్షించారు. పరస్పరం గౌరవించుకుంటేనే ఇది సాధ్యమని జిన్‌పింగ్ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితి అస్థవ్యస్తంగా మారిందని చెప్పారు. తమ మధ్య సుస్థిర బంధాన్ని మరింత పటిష్ఠపర్చుకోవాలని, సహకారాన్ని పెంచుకోవాలని ఇద్దరు అధినేతలు నిర్ణయించారు. ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా హోర్మూజ్ జల సంధిని తెరవడంపై వీరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఫెంటనైల్ ప్రీకర్సర్ కెమికల్స్‌ను అమెరికాలోకి రానివ్వకుండా ఆపడంతో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా పెంచడం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ కీలక సమావేశంలో భాగంగా ట్రంప్‌కు కొన్ని ప్రశ్నలను జిన్‌పింగ్ సంధించారు. ‘చైనా, అమెరికా ఈ ఉచ్చులో నుంచి బయటకు వచ్చి ప్రధాన దేశాల సంబంధాల్లో విప్లవాత్మక మార్పును తేగలవా? అంతర్జాతీయ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందామా? ప్రపంచానికి సుస్థిరతను అందించగలమా? మన ద్వైపాక్షిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు, మానవాళి కోసం ఉజ్వల భవిష్యత్ నిర్మించగలమా?’ అని జిన్‌పింగ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రపంచంలోని కీలక దేశాల అధినేతల ఉమ్మడి సమాధానం అవసరమని చెప్పారు. కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. తమ రెండు దేశాల మద్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైన 2026 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలుస్తుందని జిన్‌పింగ్ అన్నారు. చైనా, అమెరికా వ్యూహాత్మక సుస్థిర సంబంధాల నిర్మాణానికి సంబందించిన నూతన విజన్‌పై ట్రంప్‌తో ఏకీభవించినట్లు తెలిపారు. తమ మధ్య ఆర్థిక సంబందాలు పరస్పరం ప్రయోజనకారిగా పరిణమించినట్లు చెప్పారు. చైనా సంస్కరణలలో అమెరికా కంపెనీలకు గణనీయమైన పాత్ర ఉన్నట్లు వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలు కల్పించే దిశగా సహకారాన్ని పెంచుకోవడం కోసం అమెరికా వారికి చైనా సాదర స్వాగతం పలుకుతోందని జిన్‌పింగ్ అన్నారు. రాజకీయంగా, దౌత్యపరంగా, సైనికపరంగా తమ దేశాలు మరింతగా సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆర్థిక, వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, శాంతి భద్రతల రంగాల్లో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో తైవాన్ గురించి ప్రస్తావిస్తూ అమెరికాకు హెచ్చరిక చేశారు. ద్వైపాక్షిక`సుస్థిర బంధాన్ని రెండు దేశాలు అనుభవిస్తున్నాయి కానీ తైవాన్ విషయంలో తేడా వస్తే మాత్రం అన్నింటిని మర్చి ఘర్షణకు దిగుతామని జిన్‌పింగ్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ట్రంప్‌కు తేల్చిచెప్పారు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడమే తమకు అతిపెద్ద విషయంగా జిన్‌పింగ్ వెల్లడించారు. అమెరికా, చైనా భాగస్వామ్య దేశాలుగా ఉండాలేగానీ ప్రత్యర్థులుగా కాదని, ప్రగతిపథంలో కలిసి ముందుకెళదామని అన్నారు.
ట్రంప్-జిన్‌పింగ్ మధ్య సమావేశం రెండు గంటల పాటు జరిగింది. అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ జిన్‌పింగ్‌తో తన భేటీని అతిపెద్ద శిఖరాగ్ర సమావేశంగా అభివర్ణించారు. చైనా అధ్యక్షు&ని గొప్ప నాయకుడిగా అనేకమార్లు మెచ్చుకున్నారు. జిన్‌పింగ్‌తో స్నేహం తనకు గర్వకారణమన్నారు. తమ సంబంధాలు గణనీయంగా మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. జిన్‌పింగ్‌తో సమావేశంలో ట్రంప్‌తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు జెన్సన్ హుయాంగ్ (ఎన్విడా), టిమ్ కుక్ (యాపిల్), ఎలన్ మస్క్ (టెస్లా, స్పేస్ ఎక్స్), లారీ ఫింక్ (బ్లాక్ రాక్) తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్ చైనా స్వర్ణ దేవాలయం సందర్శన
బీజింగ్‌లోని స్వర్గ దేవాలయాన్ని ట్రంప్ సందర్శించారు. 600 ఏళ్ల కట్టడం అద్భుతమంటూ అక్కడి సంప్రదాయ శిల్పకళ వైభవాన్ని మెచ్చుకున్నారు. పూర్వం రాజులు దేశ శాంతి, ప్రజల శ్రేయస్సు కోసం అక్కడ యాగాలు చేసేవారని ట్రంప్‌కు జిన్‌పింగ్ వివరించారు. ‘ప్రజలే దేశానికి పునాది.. పునాది బలంగా ఉంటే దేశం స్థిరంగా ఉంటుంది’ అన్నది చైనా ఆలోచనకు ప్రతీకగా తెలిపారు. 2017లో తాను ఫోర్బిడెన్ సిటీని సందర్శించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు.
పేరు మార్చుకొని చైనాకు రూబియో
ట్రంప్ మంత్రుల బృందం చైనా పర్యటనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన పేరును ‘మార్కో లూ’గా మార్చుకొని బీజింగ్ వెళ్లారు. ఇందుకు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం. చైనాలోని ఉయ్గుర్ ముస్లింల హక్కులను కాలరాస్తూ వారితో కఠినంగా చైనా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు రూబియో గతంలో సెనేటర్‌గా విమర్శలు చేశారు. చైనా కమÖ్యనిస్టు పార్టీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశ యంత్రాంగానికి కోపం తెప్పించింది. దీంతో రూబియోపై 2020 నుంచి చైనా పర్యటనపరంగా నిషేధం విధించింది. ఆ నిషేధం ఇప్పటికీ కొనసాగుతుండటంతో తాజా పర్యటన కోసం దౌత్యపరంగా ఉన్న వెసులుబాట్లు ఉపయోగించుకుంటూ తన పేరు మార్చుకొని రూబియో చైనాలో అడుగుపెట్టారు. చైనా కూడా అభ్యంతరం చెప్పలేదు.


