. పునరుద్ధరణ మార్పు ప్రారంభమైంది
. శరవేగంగా అభివద్ధి, సంక్షేమం
. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
. 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
. రాజధాని గడ్డపై త్రివర్ణ పతాక రెపరెపలు
విశాలాంధ్ర-సచివాలయం:2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని, కలిసి కట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని గవర్నర్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర స్థాయి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజధాని అమరావతి నేలపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభ క్షణాలను పంచుకోవడం గర్వకారణమని అన్నారు. ఏపీ ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులని, ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, సంస్థలు తిరిగి బలపడుతున్నాయని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని తెలిపారు. నేటి గణతంత్ర వేడుక చరిత్రాత్మకమని అభివర్ణించారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోవడంతో రాజధాని నిర్మాణం సైతం ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. ప్రభుత్వ ప్రతి చర్య, ప్రతి సంస్కరణ, ప్రతి సమీక్ష ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ వృద్ధిని పునరుద్ధరించడానికేనని స్పష్టం చేశారు. ఈ ప్రయాణం సులభం కాదు.. దీనికి క్రమశిక్షణ, సహనశక్తి, సామూహిక లక్ష్యంపై అపారమైన విశ్వాసం అవసరమయ్యాయని…ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పునరుద్ధరణ మార్పు ప్రయాణం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఈ దిశను మరింత స్పష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణను ఒక స్పష్టమైన దృష్టిలో స్థిరపరిచిందని చెప్పారు. భారత స్వాతంత్య్ర శతాబ్ది నాటికి, బలమైన, సమగ్ర, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ అందించి పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నెలా 63 లక్షల మందికిపైగా ప్రజలకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఎల్పీజీ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. మహిళలు, ట్రాన్్సజెండర్ల కోసం ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అందిస్తోందని చెప్పారు.
సుపరిపాలనకు పది సూత్రాలు
పేదరికం లేని సమాజం, యువగళం, జనాభా నిర్వహణ మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఆగ్రిటెక్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్్ట గవర్నెన్్స లక్ష్యాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. ఈ పది మార్గదర్శక సూత్రాల ఆధారంగా సాధించిన పురోగతిని, రాష్ట్ర దిశను, గమ్యాన్ని నిర్వచిస్తున్న విజయాలను ప్రజల ముందుంచడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత పాలన కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సేవలను వేగవంతంగా, జీవనాన్ని సులభంగా, పరిపాలనను మరింత తెలివైనదిగా మార్చుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే భారతదేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ను అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో స్పేస్ సిటీ ఏర్పాటు ద్వారా అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌లు, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణల అగ్రగామి కేంద్రంగా నిలబెడుతున్నామన్నారు. ఆరోగ్య రంగంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం ఏఐ ఆధారిత వైద్య నిర్ధారణ సేవలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. సర్టిఫికెట్లు పొందడం, సంక్షేమ పథకాల స్థితిని తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయటం తదితర అంశాలు ఇప్పుడు క్షణాల్లో సాధ్యమవుతున్నాయన్నారు. ఇప్పుడు పాలన ఒక మెసేజ్ దూరంలోనే ఉందని చమత్కరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్్టలు పూర్తి చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్్టపై ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సవాలు నుంచి మరింత బలంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం వేడుకగా జరుపుకుంటున్నామని గవర్నర్ చెప్పారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ దంపతులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జే శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా,ఎస్పీ వకుల్ జిందాల్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న అలంకృత శకటాలు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధానిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక అవగాహన అంశాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు కనువిందు చేశాయి. శకటాల్లో వందేమాతరం-150 సంవత్సరాల ఇతివృత్తంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రధమ, మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం తో రూపొందిన సెర్‌్ప శకటానికి ద్వితీయ, పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇతివృత్తంగా రూపొందిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ స్థానాల్లో నిలిచాయి. వీటితోపాటు జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాధి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ, పర్యాటక శాఖ, జలవనరుల అభివృద్ది శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖ లు, రైతు-వ్యవసాయ సాంకేతికత తో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ లు, మౌలిక వసతులు & పెట్టుబడులు, సముద్ర మరియు వైమానిక రంగాలు, సీఆర్డీఏ లు, వ్యయ అత్యుత్తమీకరణ (ఖర్చుతగ్గింపు) — శక్తి, ఇంధనం నెడ్‌క్యాప్ (ఇంధనం), ఉత్పత్తి పరిపూర్ణత, చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ, స్వచ్ఛ ఆంధ్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ (స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, ఆర్టీజిఎస్ శాఖల శకటాలు ప్రభుత్వ సంకల్పం, ప్రజా సంక్షేమ లక్ష్యాలను స్పష్టంగా ఆవిష్కరించాయి. ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ కళారూపాల మేళవింపుతో రూపొందిన శకటాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


