Homeసంపాదకీయంస్వామి భక్తి తెచ్చిన తంటా

స్వామి భక్తి తెచ్చిన తంటా

- Advertisement -

రాజును మించిన రాజభక్తి ఎల్లకాలం ఎవరినీ కాపాడలేదు. రాజ్యాంగం ప్రకారం అర్హులైన వారందరికీ న్యాయం చేకూరేట్టు చూడడం ఏ న్యాయవాది అయినా పాటించవలసిన ధరˆమే. న్యాయవాదులు సైతం అధికార పీఠంపై ఉన్న వారికి అనుకూలంగా మెసులుకోవడం తప్పని ఆలోచించడం మానేస్తే అది కేవలం నియమోల్లంఘనే కాదు రాజ్యాంగ ఉల్లంఘన కూడా. కానీ భారత బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మన్న మిశ్రా తన హద్దులు మీరి ప్రవర్తించడమే కాక తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. తనకు లేని అధికారాలను వినియోగించుకోవాలన్న అహంకార పూరిత ధోరణి ఆయన బార్ కౌన్సిల్ అధ్యక్ష స్థానానికే ముప్పు తెచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవల ఆయన ప్రవర్తనను నిర్ద్వంద్వంగా ఆక్షేపించింది. ఆయనకు మిగిలిన మార్గమల్లా బార్ కౌన్సిల్ అధ్యక్ష స్థానాన్నుంచి మర్యాదగా తప్పుకోవడమే. తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించే దాకా ఆగితే ఆయనకు మిగిలిన గౌరవం కూడా పోతుంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సమయంలో కొందరు న్యాయవాదులకు పని లేదని, అలాంటి వారు, సామాజిక కార్యకర్తలు, మేధావులు “బొద్దింక” లాంటి వారు, “పరాన్న జీవులు” అని వ్యాఖ్యానించడం దేశమంతటా అగ్గి రాజేసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ జులై 20న చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం పెద్ద ప్రజాందోళనగా మారింది.
ఆ సందర్భంలోనే నల్సార్ న్యాయశాస్త్ర విద్యాలయ స్నాతకోత్సవం జరగాల్సింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి హాజరై న్యాయవిద్య పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయాల్సింది. కానీ హైదరబాద్‌లోని నల్సార్ విద్యార్థులు న్యాయవాదులతో పాటు మరికొందరిని “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అని ప్రధాన న్యాయమూర్తి అవమానించారు కనక ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోబోమని చెప్పారు. ఆ దశలోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మన్న మిశ్రా నల్సార్ నుంచి పట్టభద్రులయ్యే ప్రస్తుత విద్యార్థులను ఏ బార్ కౌన్సిల్లో నమోదు చేయించుకోనివ్వకూడదని నల్సార్ విశ్వవిద్యాలయానికి ఒక తాకీదు జారీ చేశారు. ఈ అధికారం ఆయనకు ఏ దృష్టితో చేసినా లేదు. విద్యార్థులు తప్పు చేసినా, ఒప్పు చేసినా వారి మీద చర్య తీసుకునే అధికారం ఆ విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు విజయ్ మాల్యబాగ్చి, ఎ.మోహనతో కూడిన బెంచి గట్టిగానే చెప్పింది. పైగా ప్రధాన న్యాయమూర్తి అయితే నల్సార్ విద్యార్థులకు, తనకు మధ్య వివాదం ఉంటే మరెవరూ అందులో కల్పించుకోవాల్సిన అగత్యం లేదని ఘాటుగానే చెప్పారు. ఆ తరవాత మన్న మిశ్రా తాను జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. అయినా ఆయన మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారిస్తున్న క్రమంలోనే ముగ్గురు న్యాయమూర్తులు మన్న మిశ్రాను తప్పు పట్టారు. ఆయన రాజ్యాంగ నైతికత పాటించలేదని కూడా అన్నారు. ఇక ఆయనకు మిగిలిందల్లా బార్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసి నాలుగు రోజులైనా మన్న మిశ్రా నుంచి ఉలుకూ పలుకూ లేదు. నల్సార్ విద్యార్థులకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించి భంగపడ్డ మన్న మిశ్రా నడవడిక ఏమైనా సవ్యంగా ఉందంటే అదీ లేదు. ఆయన 2014 నుంచి బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనందు వల్ల బార్ కొన్సిల్ ఆయన పదవీ కాలాన్ని 2030 దాకా పొడిగించింది. ఇదీ అన్యాయమే. తప్పని పరిస్థితుల్లో పొడిగింపు ఒకటో రెండో ఏళ్లు ఉంటుంది కానీ ఏకంగా 2030 దాకా పొడిగించారంటే బార్ కౌన్సిల్ మొత్తాన్ని మిశ్రా గుప్పెట్‌లో పెట్టుకున్నారనుకోవాల్సి వస్తుంది. 1961 నాటి న్యాయవాదుల చట్టాన్ని, రాజ్యాంగాన్ని మిశ్రా బహిరంగంగా ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని అక్షరాలా, సరైన స్ఫూర్తితో అమలు చేయాలని రాజ్యాంగ రచనలో ప్రధాన బాధ్యుడైన డా.బి.ఆర్.అంబేద్కర్ 1948లో రాజ్యాంగ నిర్ణాయక సభలోనే స్పష్టంగా చెప్పారు. కానీ స్వామి భక్తి పరాయణులైన మిశ్రా లాంటి వారికి ఇవన్నీ గుర్తుండడం అత్యాశే. గుర్తున్నా స్వామి భక్తి వారిని సరైన దారిలో నడవనివ్వదు. కొద్ది కాలంగా రాజ్యాంగ పరిరక్షణోద్యమం దేశమంతటా జరుగుతున్న స్థితిలో మిశ్రా రాజ్యాంగాన్ని బొత్తిగా ఖాతరు చేయకుండా ప్రవర్తించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిసింది కనక ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ లేక తాత్కాలిక అధ్యక్షుడు మాత్రమే. ఆయన చేయవలసిందల్లా రోజు వారి కార్యక్రమాలు కొనసాగేట్టు చూడడమే. అందులో బార్ కౌన్సిల్ ఎన్నికలు సమయానికి నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. నల్సార్ విద్యార్థులను ఏ బార్ కౌన్సిల్లోనూ నమోదు చేయించుకోనివ్వకూడదని, వారు న్యాయవాదులుగా వ్యవహరించడానికి వీలు లేదని మిశ్రా ఉత్తర్వు జారీ చేయడం నియమోల్లంఘన మాత్రమే కాదు, వాక్ స్వాతంత్రాయూన్ని, సంఘాలు పెట్టుకునే హక్కును కూడా కాలరాయడమే. బార్ కౌన్సిల్ స్వామి భక్తి ప్రదర్శించే క్రమంలో సాగిలపడ్తోంది. దీన్ని అన్ని వర్గాల వారు ఖండించారు. మన్న మిశ్రా అనుచిత వ్యాఖ్యలు ఆయన పరువు తీయడంతో పాటు తాను అధ్యక్షుడిగా ఉన్న చట్టబద్ధమైన బార్ కౌన్సిల్ పరువును కూడా బజారుకీడ్చారు. బార్ కౌన్సిల్ పరిధి ఏమిటో నిర్ణయించాలని కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిందే. న్యాయశాస్త్ర విద్యార్థులకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఉన్న హక్కును పరిరక్షించి తీరాల్సిందే. అసమ్మతి తెలియజేసే అధికారం విద్యార్థులకు ఉండాల్సిందే. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా నివారించాలి అని సుప్రీంకోర్టు సవ్యమైన ఉత్తర్వే జారీ చేసింది. సుప్రింకోర్ట్ ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం వల్ల విద్యార్థులకు రాజ్యాంగం ప్రదర్శించిన హక్కులను కాపాడవచ్చు. వ్యవస్థలపై ఉండవలసిన విశ్వసనీయతను మిశ్రా ప్రవర్తన మంటగలిపింది. చట్టబద్ధమైన సంస్థలకు నాయకత్వం వహించవలసిన బాధ్యత నిర్వర్తించే వారు ఎలా నడుచుకోవాలి అన్న అంశాన్ని మిశ్రా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆయన జారీ చేసిన తప్పుడు ఉత్తర్వును విమర్శలు వెల్లువెత్తిన తరవాత ఉపసంహరించుకుని ఉండవచ్చు. అయినా ఇది ఆయన చేసిన పొరపాటుకి ఎంత మాత్రం పరిష్కారం కాదు. తన తప్పు ఏమిటో మిశ్రా ఇప్పటికైనా గ్రహించి బార్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించుకోవాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు