పి.చంద్రనాయక్
సహజంగా దేహానికి పట్టిన జబ్బు వదిలించడానికి వైద్యులు శ్రమిస్తుంటారు కానీ సమాజానికి పట్టిన వివిధ రకాల జబ్బులను (సమస్యలు) వదిలించడానికి కళారంగాన్ని ఆయుధంగా మలుచు కొని సామాజిక వైద్యుడయ్యారు డాక్టర్ గరికిపాటి రాజారావు. గరికపాటి రాజారావు సమాజ చైతన్యానికి కళలే మార్గమని భావించారు. అభ్యుదయ భావజాలం కలిగిన ప్రజానాట్య మండలి సంస్థ నిర్మాతల్లో రాజారావు ప్రధములు. డాక్టర్ గరికపాటి రాజారావు 1915 ఫిబ్రవరి 5న తల్లి సోమలింగమ్మ తండ్రి కోటయ్య దేవరకు ఐదుగురు సంతానంలో రాజా రావు పెద్దవారు. రాజమండ్రి, విజయనగరం, కాకినాడ ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి వైద్య విద్యను అభ్యసించడానికి మద్రాస్ చేరారు. ఆజానుబాహుడు, నిండైన విగ్రహం. హరికథ భాగవతార్ వేషధారణతో అద్భుతమైన కంచు కంఠంతో శివతాండవం నృత్యం ద్వారా ఎదుటివారిని ఆకట్టుకునే స్వభావం బాల్యదశలోనే రాజారావుకు అబ్బింది. పదహారేళ్లు నిండక మునుపే సత్య హరిశ్చంద్ర నాటకంలో మాతంగి కన్య వేషంతో ప్రారంభమైంది నటనా జీవితం. చిన్న వయసులోనే రాజారావుకు వివాహమైంది. కుటుంబ బాధ్యతలు పెరగడంతో కొంతకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వృత్తిని పక్కనపెట్టి వైద్య విద్యను అభ్యసించడానికి మద్రాస్ వెళ్లారు. మద్రాసులో ఉంటూ వైద్య కళాశాలలో యువకులను చేరదీసి నాటకాలు రూపొందించేవారు. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మనసు నిండా దేశభక్తి నింపుకున్న రాజారావు కళారంగం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. చారిత్రక నాటకం షాజహాన్, సామాజిక సమస్య విడాకులు నాటకాలకు తొలి రోజుల్లో కళాకారులను తయారు చేసుకొని నాటకాన్ని ప్రదర్శించారు. షాజహాన్గా ఎస్‌విఆర్.సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. సామాజిక అవగాహనను దేశభక్తిని నింపుకున్న రాజారావుకు ఆనాడు కమ్యూనిస్టు నాయకులతో పరిచయం ఏర్పడడంతో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై సమాజానికి మరింతగా అంకితమయ్యారు. బలిదానం, అపోహ, బాగు బాగు వంటి నాటకాలను పెద్ద, చిన్న పాత్రలు అనే వ్యత్యాసం లేకుండా నటించారు. హిట్లర్ నాజీ ఫాసిజం ప్రపంచాన్ని భయపెడుతున్న ఆనాటి స్థితిగతులు అంచనా వేశారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో రాజారావు అనేక మంది కళాకారులను తయారుచేసి నాటకాలు ప్రదర్శించేశారు. పశ్చాత్తాపం నాటికతో నటుడు, దర్శకుడు, రచయితగా మూడు పాత్రలు పోషించాడు రాజారావు. వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పల్లెల్లో బాలల యువజన సంఘాలను ఏర్పాటు చేసి కళారూపాలు తయారుచేసి వారికి శిక్షణ ఇచ్చేవారు. ఈ క్రమంలో భారత రంగస్థలం చరిత్రలో 1943 మే 25, 26 తేదీల్లో బొంబాయి నగరంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) ఆవిర్భవించింది. ఈ మహాసభలకు ఆంధ్ర ప్రాంతం నుండి ముక్కామల నాగభూషణం నాయకత్వాన రాజారావుతో పాటు అనేకమంది వెళ్లారు. డాక్టర్ రాజారావు జాతీయ కార్యవర్గానికి ఎన్నికయ్యారు. బొంబాయిలో ముల్క్కరాజ్ ఆనంద్, పృథ్విరాజ్ కపూర్, బల్రాజ్ సహాని లాంటి హేమాహేమీలతో పరిచయం ఏర్పడింది. 1944లో విజయవాడలో అభ్యుదయ రచయితల సంఘం రెండవ రాష్ట్ర మహాసభల సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనలో రాజారావు గిరీశం పాత్ర పోషించారు. హిట్లర్ బాగోతం, సిమ్లా బాగోతం, దున్నేవానికి భూమి, సుత్తి కొడవలి నృత్యం, ప్రెస్ వర్కర్, రిక్ష±వాలా మొదలైన కళారూపాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాలకులను గడగడలాడించిన మా భూమి నాటకాన్ని రాజారావు దర్శకత్వం వహించగా మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, మాచినేని, నాజర్ తదితరులు ఆ దళంలో కొనసాగారు. రాష్ట్ర దళంతో పాటు కృష్ణాజిల్లా దళం ప్రముఖంగా నాటకాలు ప్రదర్శించేవారు. వీరందరూ ఒకే కుటుంబ సభ్యులుగా మెలిగేవారు. డాక్టర్ రాజారావు నేతృత్వంలో అహ్మదాబాద్, ముంబై, పూణే, షోలాపూర్, మద్రాస్ లాంటి అనేక నగరాల్లో నాటక ప్రదర్శనలు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 దళాలతో మాభూమి నాటకం ఆంధ్రదేశమంతటా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు కేఏ.అబ్బాస్ దీనిని ప్రపంచ రికార్డుగా ఆనాడు అభివర్ణించారు. 1948లో మద్రాసులో ఈ నాటిక ప్రదర్శన అనంతరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ప్రజానాట్యమండలి కళాకారులు ముఖ్యంగా రాజారావు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆనాటి స్థితిగతులపై ప్రజలను చైతన్యపరచడానికి పనిచేస్తున్న ప్రజానాట్యమండలిని నిషేధం విధించడం పట్ల కళాకారులే కాకుండా సామాన్య ప్రజానీకం ఈ విషయాన్ని ఖండిస్తూ సభలు, సమావేశాలు జరిపారు. మద్రాస్‌లో అల్లూరి సీతారామరాజు బుర్రకథను కొండేపూడి రాధా, తాపీ రాజమ్మ వీరమాచినేని సరోజినీల మహిళా దళం ప్రదర్శించింది. నిషేధానికి గురైన ఈ కథను విని కాంగ్రెస్ మంత్రులు ఉత్తేజితులయ్యారు. నాటి కాంగ్రెస్ నాయకులైన బెజవాడ గోపాల్‌రెడ్డి, కళా వెంకట్రావు తదితరులను కళాకారులు ప్రశ్నించగా ఏమీ అనలేక ప్రశంసిస్తూ ప్రజానాట్యమండలి పై నిషేధాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం రాజారావును రాజమండ్రిలో అరెస్ట్ చేశారు. ఎన్ని చిత్రహింసలు పోలీసులు పెట్టిన ప్రజానాట్యమండలి ఆశయాలు నమ్మిన రాజారావు లొంగలేదు. అనేక చిత్రహింసలు పెట్టారు. చివరికి మృత్యువు దాక వెళ్లి జైలు నుండి విడుదలయ్యారు. ఈ నిర్బంధాలు, నిషేధాలు, ఆంక్షల తీవ్రత కారణంగా ప్రజానాట్యమండలి తాత్కాలికంగా రద్దయింది. కళాకారులందరూ చెల్లాచెదరయ్యారు. కొంతమంది ప్రజానాట్యమండలి కళాకారులు నాటక సమాజాలను ఏర్పర్చి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. రాజారావు సినిమా రంగంలో ప్రవేశించి పుట్టిల్లు సినిమా ఆధునిక స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో సాహసంతో నిర్మించారు. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమకు అనేకమంది ప్రజానాట్యమండలి కళాకారులను పరిచయం చేసిన వారిలో ప్రముఖ నటి జమున, అల్లు రామలింగయ్య, కాకరాల, రాజబాబు లాంటి అనేక మంది ఉన్నారు. రాఘవ కళాసమితి నాటకసంస్థ ద్వారా నాటకాలు వేయటం మొదలు పెట్టినప్పుడు, ఆ కార్యక్రమాల్లో రాజారావుకు శిష్యుడుగా చాలా దగ్గరైన కళాకారుడు కాకరాల. ఆ నాటక కార్యక్రమాలు 1954 నుంచి 1959 వరకు కొనసాగాయి. నాటకానికి విపరీతంగా అంకితమైపోయారు రాజారావు. 1956-1957 ప్రాంతంలో నేరెళ్ల వేణుమాధవ్ను పిలిపించి అనేక ప్రదర్శనలు ఇప్పించారు. 1957లో దిల్లీలో జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోషియేషన్ ఉత్సవాలకు విజయనగరం నుంచి జాలరి నృత్యం చేసే సంపత్ కుమార్‌ను, భరతనాట్య ప్రవీణుడు కోరాడ నరసింహారావును తనతోపాటు తీసుకెళ్లి, వాళ్ల ఖ్యాతిని దేశమంతా వ్యాపించేలా చేశారు. విజయవాడ మొగల్రాజపురం, పోరంకి, పెనమలూరు ప్రాంతాల్లో వైద్యవృత్తిని కొనసాగిస్తూ కళారంగానికి ఎనలేని సేవలు అందించారు.1954లో రాజమండ్రిలో ఏర్పడిన ఆంధ్ర థియేటర్స్ ఫెడరేషన్‌కు డాక్టర్ రాజారావు తిరిగి కార్యదర్శి అయ్యారు. బొంబాయి నుండి బలరాజ్ సహాని ప్రత్యేకంగా హాజరయ్యారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు పది రోజులు పాటు శిక్షణ శిబిరాలు సాగాయి. నాటక ప్రదర్శనకు కావలసిన అన్ని రకాల కళాకారులను తయారుచేసుకున్నారు. 1957లో దిల్లీలో జరిగిన ఇప్టా ఉత్సవాలకు రాజారావు నాయకత్వంలో అనేక కళారూపాలు ప్రదర్శనకు వెళ్లాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్, ఇతర రాష్ట్ర ఇతర కళా సంస్థల వేదికలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. 1959లో రాజమండ్రి నుండి మద్రాస్ వెళ్లారు. దున్నేవానిదే భూమి ఇతివృÔ్తáంగా చేసుకొని చిత్రాన్ని నిర్మించిన రాజారావు చివరికి ఆ చిత్రాన్ని దేవుడు చేసిన మేలుగా మార్చాల్సి వచ్చింది. అయినా అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అనేక ఒడిదుడుకులు కష్టనష్టాలు చవిచూశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు మరణాన్ని తన ప్రతిభతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఈ క్రమంలో జై భవాని నాటకానికి రాజారావు శ్రీకారం చుట్టారు. దిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రాజారావు నాటకాలను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అనేక దేశభక్తి ప్రేరేపితమైన కళారూపాలను రాజారావు నాయకత్వంలో ప్రదర్శించారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావుతో రాజారావు బృందం భేటీ అయ్యారు. రాజారావు ఆరోగ్యం రోజురోజుకు క్ష్మీణించడం ప్రారంభమైంది. ఒకటికి రెండు మూడు సార్లు రాజారావుకు ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చింది. అనేకమంది వైద్యులు, కళాకారులు ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. 1963 సెప్టెంబర్ 8వ తేదీన ఓ మహా ప్రజా కళాకారుడు శకం ముగిసింది. నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, వైద్యుడిగా ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో అద్వితీయమైన పాత్రను పోషించి ఆనాటికి ఈనాటికి ప్రజా కళారంగంలో కళా తపస్విగా ఆదర్శనీయులుగా నిలిచిపోయారు. రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ వారు ఆయన జ్ఞాపకార్థం దేవి చౌక్ నుంచి వెళ్లే ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఆ వీధిలోనే ఆయన అభిమానులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు


