ఆగస్టు 9 నుంచి 14 వరకు నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి
విశాలాంధ్ర` హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏన్డీయే నాయకత్వాన 10 సంవత్సరాల కాలంలో కార్మిక సంఘాలు సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను పూర్తిగా రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మోదీ స్నేహితులైన ఆదానీ, అంబానీ, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం, సత్యనారాయణ రెడ్డి భవన్లో మంగళవారం జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో మాట్లాడుతూ 47 కోట్ల కార్మికుల కనీస కార్మిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను నిర్ధాక్షిణ్యంగా రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రైతుసంఘాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు మరియు సమ్మెలు చేసినా ఏన్డీయే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదని ఆయన విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాలు నూతన కార్మిక శాఖ మంత్రికి మెమోరాండం సమర్పించి కార్మిక సంఘాల డిమాండ్లను ఆమోదించాలని కోరినా కేంద్ర కార్మిక శాఖా మంత్రి కనీసం చర్చలకు పిలవకపోవటం ఏన్డీయే ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలకటం తప్ప కార్మికుల హక్కులను కాపాడే ఉద్దేశం లేదని ఆయన విమర్శించారు. ఆగస్టు నెల 9 నుంచి 14 వరకు దేశవ్యాపితంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతుల వ్యతిరేక విధానాలపై 6 రోజుల పాటు నిర్వీరామంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నేడు అన్ని కార్మిక సంఘాల సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 9న నారాయణగూడ ఫ్లైఓర్ క్రింద వందలాది మంది కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల కార్యకర్తలు నిరసన కార్యక్రమా చేయాలని సమావేశం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. క్విట్ ఇండియా ఉద్యమంతో ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును అన్ని కార్మిక సంఘాలు అన్ని జిల్లాల్లో క్రొవ్వత్తుల ప్రదర్శన రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని ఇందులో అన్ని సంఘాల సభ్యులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కళాకారుల ఆట, పాట, మాట కార్యక్రమం ఉంటుందని స్వఛరేదంగా కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల వారు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, హెచ్ఎంఎస్ నాయకులు రెబ్బా రామారావు, సిఐటియు నాయకులు జె.వెంకటేశ్, ఎఐటియుసి నాయకులు ఎస్.విలాస్, టిఎన్టియుసి స్టేట్ ప్రెసిడెంట్ యం.కె.బోస్, టిఎన్టియు రాష్ట్ర కార్యదర్శి పి.శ్యాంకుమార్, హెచ్ఎంఎస్ నాయకులు లక్ష్మణ్, యం.డి.అంజద్ పాల్గొని ప్రసంగించారు.