Homeవిశ్లేషణఅమర ‘ప్రసాద్‌’

అమర ‘ప్రసాద్‌’

- Advertisement -

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల బూతుల్లా గుచ్చుకుంటున్నాయి సూర్యుడి కిరణాలు. ఎర్రగా మండాల్సిన మంట తెల్లగా వీపు మీద మండి పడుతుంటే నీడ కోసం వెదుక్కుంటూ వెళ్తున్నది డాగీ. వీధుల్లో చెట్లన్నవి మిగిలితే కదా అన్నీ ఇనుప చెట్లే, కంకర ఇసుకని కడుపు నిండా నింపుకుని వేడెక్కి సెగలూ పొగలూ కక్కుతున్నవి. ఎలాగో, అలాగ రోడ్డు ఎక్కబోతున్న డాగీకి బోలెడు జనం వెనకాల వాహనాలు కనిపించి ఆగిపోయింది. ఎందుకోగానీ, రోడ్డు ఎక్కి వాళ్లందరినీ తప్పించుకుని మాంసం కొట్టుకు వెళ్లాలని అనిపించలేదు. ఒక్కరోజు తినకుంటే ఏం అనుకుంటూ వెనుతిరిగింది. ఒంటికి అంటుకుంటున్న చురుక్కులను భరిస్తూనే మైదానం దాటి అరుగు మీదకి వచ్చింది. అరుగు ఈ చివర నుంచి ఆ చివర వరకూ గ్యాసు పొయ్యిలా మండుతున్నది. వీపు కాలుతుందని గోడకు ఆనుకోకుండా కూచుంటూ చూసింది. డాంకీ ఎప్పుడో వచ్చేసినట్టుంది. డాగీ చూపు తన కంటికి కనెక్టు కాగానే అడిగింది. ఏంటి బ్రో తోక వేలాడేశావు. మెక్కడానికి ముక్కేదీ చిక్కలేదా అని. ఎక్కడిది బ్రో అక్కడి దాకా వెళ్తేనే కదా. రోడ్డు మీద ఓ అంతిమయాత్ర అనేక మంది జనం చూశాక ఎందుకో ఏమో తినాలని అనిపించలేదు. వెనక్కి తిరిగి వచ్చేశా అంది డాగీ నీరసంగా. అవునా ఆ రోడ్డు మీదే కదా! నేనూ చూశాను. ఎర్రజండాలు కనపడ్డాయి. జనం నినాదాలు వినపడ్డాయి. ఎవరో గొప్ప వ్యక్తి కన్న మూశాడనుకుంటా అంది డాంకీ. కన్ను మూయడం అంటే మరణించడమే కదా! అసలు మరణం అంటే ఏమిటో చెబుదూ. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు డాగీ. జనన మరణాల మధ్య మనిషి గడిపే కాలాన్నే జీవితం అంటారు. అంటే మరణం ఎవరికీ తప్పదన్న మాట అమ్మో తల్చుకుంటే భయమేస్తుంది. భయమెందుకోయ్ ఒకసారి చచ్చి చూస్తే పోలా అంది డాంకీ. మనం చస్తే ఎంత బతికితే ఎంత. మనదీ ఒక బతుకేనా కుక్కలవలె నక్కల వలె, సందులలో పందుల వలె అన్నాడో కవి అని చెప్పేవు కదా. మనుషుల మరణానికీ మన చావులకీ సాపత్యమేమిటి అని డాగీ అంటుండంగానే అబ్బాయి అరుగు ఎక్కాడు కణతల మీది నుంచి కారుతున్న చెమటని జేబురుమాలుతో అద్దుకుంటూ. రావల్సిన టైముకే వచ్చావు. చెమట తుడుచుకుని, గాలి పీల్చుకుని అరుగు మీద కూచుని మా సందేహాలకు సమాధానం ఇస్తావు గదా అంది డాంకీ. పుట్టిన ప్రాణులన్నీ చావాల్సిన మాట నిజమే అయితే, మళ్లీ పుట్టుకంటూ ఉంటుందా అనడిగింది డాగీ. ఉంటుందే అనుకుందాం నువ్వు మరుజన్మలో ఏం కావాలనుకుంటున్నావు అన్నాడబ్బాయి. ఇలా పాత ఇళ్లల్లో ఉంటూ దుకాణాల ముందు దేబరిస్తూ వీధి కుక్కలా కాకుండా, పెద్ద పెద్ద బంగాళాల్లో పెద్ద మంచాల్లో మెత్తటి పరుపు మీద పండుకునే “జాతి డాగ” నవ్వాలనుకుంటాను అన్నది డాగీ. మరి నువ్వో అని డాంకీ వైపుకు చూశాడు అబ్బాయి, నేనా… నేను… మురికి బట్టలు మోసే “దోభీ కా గధా”ను, వీధుల్లో చెత్త కాగితాలు ఏరుకు తినే గాడిదను కాక, గుగ్గిళ్లుతుంటూ, ఒంటికి మాలిష్, చేయించుకునే జాతి గుర్రాన్ని అవ్వాలనుకుంటాను అంది డాంకీ. అసలు ఈ చావుపుట్టుకల చర్చ ఎందుకు మీకు అన్నాడు అబ్బాయి. ఏం చెప్పను బ్రో వీధిలో ఓ శవయాత్ర చూసి వెనక్కు వచ్చేసింది డాగీ. నేనూ చూశాను అప్పట్నించీ మనసేం బాగోలేక చావు గురించీ పుట్టుక గురించీ మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? రాజకీయ నాయకుడా, సినిమా నటుడా లేక… అసలు ఈ రోజు దినపత్రికలో ఏ మంత్రీ దిగ్భ్రాంతి చెందానని, ఆయన లేని లోటు తీరేది కాదనీ కడువెడు కన్నీళ్లు కార్చినట్టు పత్రికల్లో లేదే అన్నది డాంకీ. ఆయన ఆ ఇద్దరికంటే గొప్పవాడు. ఆయన కలం సృష్టించిన అక్షరాలు కలకాలం నిలుస్తాయి. ఆయన గళం అందించిన గీతాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి అన్నాడు అబ్బాయి. అవునా అప్పుడే అనుకున్నా అనవసరపు హంగామా లేకుండా జనం మధ్య ఎర్రజండాలో కదిలిపోతుంటే. ఇంతకీ ఆ కవి, ఆ గాయకుడు, ఆ కామ్రేడ్ ఎవరో చెప్పనేలేదు అంది డాగీ. ఆ అక్షర తపస్వి, ఆ కార్యకర్త ఆ సంపాదకుడు. ఆ కార్యదర్శి పేరు ఏటుకూరి ప్రసాద్. హైదరాబాద్‌లో ఆయన అరసం ఏర్పాటుచేసినప్పుడు ఆయనతో పాటు గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి లాంటి వారు యువకులకు సాహిత్యం పట్ల కలిగించిన అవగాహనే ముందు తరాలకు ‘ట్రాన్స్‌ఫర్ అవుతున్నది. ఆర్‌వీ.రామారావు, చింతపట్ల సుదర్శన్, ఎస్వీ లాంటి వారెందర్నో తయారు చేసింది అరసం అన్నాడు అబ్బాయి. చింతపట్ల సుదర్శన్ అంటే అని డాంకీ అంటుంటే, ఆయనే మన గురించి ‘రంగస్థలం’లో రాస్తున్నాయన. ఒక సభలో ‘ఏటుకూరి ప్రసాద్ గారు ఆయనతో ‘రంగస్థలం’ చదువుతున్నానని అన్నాడట అన్నాడు అబ్బాయి. ఆ మహాను భావుడి అంతిమయాత్రనా మనం చూసింది అంది డాగీ. అవును కళ్లజోడులోంచి ఆయన చూసే చూపు, దాపరికం లేని నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె’ అనే పద్యం గుర్తుకు వస్తుంది అన్న మాటలు వినపడ్డాయి. కనపడక పోయినా, ఈ మాటలు అన్నదెవరో అర్థమైంది కదా అంటూ అరుగు దిగాడు అబ్బాయి.
(రెండు సంవత్సరాల క్రితం తెలుగు యూనివర్సిటీలో ఎస్వీ జన్మదిన సభకు ఆర్వీ రామారావుతో కలిసి వెళ్లినప్పుడు ఏటుకూరి ప్రసాద్ గారిని చివరిసారిగా చూశాను. రంగస్థలం చదువుతున్నాను. బాగా సాగదీస్తున్నావుగా అన్నారు నవ్వుతూ. అలుపెరగని ఆ సాహితీమూర్తికి నివాళులు !!!)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు