పి.పి.శాస్త్రి
ప్రజాస్వామ్యం అనేది గ్రీకు పదాలైన “డెమోస్” (ప్రజలు), “క్రాటోస్” (పాలన) నుండి ఉద్భవించింది అంటే ప్రజల చేత నడిపించబడే పరిపాలన అని అర్థం. సమాజంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించే పాలనా వ్యవస్థనే ప్రజాస్వామ్యం అంటారు. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం.’ అని అబ్రహాం లింకన్ చెప్పారు. “అనేక మంది ధనవంతుల చేతుల్లో కాకుండా, పేదల చేతుల్లో అత్యున్నత పాలనాధికారం ఉండే వ్యవస్థే ప్రజాస్వామ్యం.” అన్నారు. అరిస్టాటిల్ ‘ప్రజల సహజ సిద్ధమైన హక్కులను (జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి) రక్షించడానికి పౌరుల అంగీకారంతో ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.” అని నిర్వచించారు. జాన్ లాక్ ‘సమాజంలోని ప్రతి పౌరుడికి పరిపాలనలో భాగస్వామ్యం, స్వేచ్ఛా అభిప్రాయ వ్యక్తీకరణ అవకాశం లభించే ఉత్తమ పాలనా రూపం.’ అని అర్థం చెప్పారు జాన్ స్టువర్ట్ మిల్.“రక్తపాతం లేకుండా ప్రజల సామాజిక, ఆర్థిక జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే పాలనా విధానమే ప్రజాస్వామ్యం.” అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాథమిక పునాది కేవలం ఓటింగ్ వ్యవస్థ మాత్రమే కాదు, పౌరులందరికీ సమానత్వం, స్వేచ్చ, న్యాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పైన చెప్పిన నిర్వచనాలలో మనం, మన దేశానికి, ఎక్కువగా అన్వయించుకునే నిర్వచనం, అబ్రహం లింకన్ చెప్పిన, ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఇవి మన దేశంలో ఎంతవరకూ అమలవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.
ప్రజల యొక్క ప్రభుత్వం : ప్రజలలో గానీ, ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న పార్టీ గానీ, ఇది ప్రజల యొక్క ప్రభుత్వం అనే ఆలోచన గానీ, అభిప్రాయం గానీ ఉండడం లేదు. ప్రజలు ఓట్లేసి ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరువాత వారికి ఇంకేమీ బాధ్యత లేదన్నట్లుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇక ప్రజలు తాము ఏమి చెప్పినా పడుండాలి అన్నట్లు నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యం ఉండడం లేదు.
ప్రజల చేత ప్రభుత్వం : ప్రజలు ఒకసారి ఓటేసి ఏదో ఒక పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన తరువాత ఆ ప్రభుత్వం ఎలా పాలన చేస్తున్నదో పట్టించుకోవడం లేదు. సదరు ప్రభుత్వం కూడా తమకి అధికారం ఇచ్చింది ప్రజలు కనుక ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలని అనుకోవడం లేదు. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వం అనుకోవడం లేదు.
ప్రజల కొరకు నడిచే వ్యవస్థ : ఇప్పటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా ప్రజల కొరకు నడిచే వ్యవస్థను ఏర్పాటుచేయడం లేదు, ఏర్పాటుచేయాలని అనుకోవడం లేదు. ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యానికి మిగిలిన త్తవవేత్తలు ఇచ్చిన పైన పేర్కొన్న నిర్వచనాలు అబ్రహం లింకన్ చెప్పిన నిర్వచనం కన్నా ఇంకా ఎక్కువగా అభ్యుదయ భావాలతో కూడిన అభిప్రాయాలు. అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రాథమిక భావనలు అయిన ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం అనేది కూడా అమలుకావడం లేదు. అటువంటి ప్రాథమిక అవగాహనకు మించి ప్రజల హక్కులు, ఆర్థిక అసమానతలు, సమానత్వం గురించిన భావనలను మన ప్రభుత్వాలు అమలు చేయాలని కనీసం ఆలోచన చేయడం లేదు. మన భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలకు ప్రమేయం లేకుండా, ప్రజలకు జవాబుదారీ కాకుండా, ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అన్ని రకాల నిర్వచనాలకు వ్యతిరేకంగా ఏక పార్టీ లేక ఏక వ్యక్తి నియంతృత్వంగా పనిచేస్తూ, పైకి మాత్రం తాము ప్రజాస్వామ్యయుతంగా పాలిస్తున్నామని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా తూట్లు పొడిచే ప్రక్రియలు చేయడం గత పన్నెండేళ్ల కాలం నుండి జరుగుతూ ఉంది. దానికి దేశభక్తి ముసుగు కప్పి, ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రించి కేసులు పెట్టడం, విచారణ లేకుండా జైళ్లలో ఉంచడం సాధారణం అయిపోయింది. సీఏఏ, ఎన్ఆర్సీల ప్రయత్నాలు చేసి వాటిపై వస్తున్న వ్యతిరేకత వలన తాత్కాలికంగా పక్కన పెట్టి, ప్రస్తుతం ‘సర్‘ పేరుతో ఓట్లు తొలగిస్తూ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారు. లోపభూయిష్టమైన ‘సర్‘ ప్రక్రియతో అర్హులైన వారి ఓట్లు తీసేయడం ఒక దుర్మార్గ చర్య అయితే, రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు తీసేసిన ఓట్ల స్థానంలో తమకు అనుకూలంగా ఉండే వారిని చేర్చి లెక్కలు సరిచేసే ప్రయత్నం జరిగే అవకాశం లేకపోలేదు. ఆ తరువాత జరిగే ఎన్నికలు అన్నీ మ్యాచ్ ఫికిస్ంగ్ ఎన్నికలే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించామని చెప్పి ఏక పార్టీ నియంతృత్వానికి దారి సుగమం చేస్తారు. ఇటువంటి ఏక పార్టీ లేదా ఏక వ్యక్తి నియంతృత్వాన్ని పూర్తి నియంతృత్వం నిర్వచనంలోకి రాదు. ఇప్పటివరకూ ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణం అయిన ఎన్నికల వ్యవస్థ అమలు జరగడం వలన కొంతవరకు మన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ ఓట్ల నమోదు నుండి చివరికి ప్రభుత్వ ఏర్పాటు వరకు అక్రమాలకు, ముందస్తు నియంత్రణకు, గురవుతుండడం వలన ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో ఓడిపోతూ ఉంది. ఇప్పుడు మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య ముసుగులో కుట్రలతో అమలవుతున్న నియంతృత్వం మాత్రమే. ఏలూరు. ఫోన్ : 9885286643


