రాఘవ
రాజ్యాంగంలో రాసుకున్నవన్నీ చెదిరిపోతున్నాయి. ప్రజాస్వామ్యం కనుమరుగైపోతోంది. సామ్యవాదం సుదూర స్వప్నంగా మిగిలిపోతోంది. నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. మత ఫాసిజం ఉప్పెనలా ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో పురోగామి శక్తుల ఐక్యతను కోరుతూ మే 23, 24న తిరుపతిలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు రచయితల సంఘాల ఐక్యతను కోరుతూ జరిగాయి.
భిన్న ఆలోచనలకు, భిన్న తాత్విక చింతనలకు కేంద్రమైన తిరుపతి నగరం అరసం మహాసభలకు వేదికైంది. నిజానికి తిరుపతి ఒక సాంస్కృతిక పునరుజ్జీవన కేంద్రం. తిరుపతిలో 1985లో జరిగిన అరసం రాష్ట్ర మహాసభలు నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జరిగాయి. అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ మహాసభల ప్రారంభ సమావేశానికి అధ్యక్షోపన్యాసం చేస్తూ, కొన్ని కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. ‘నూరేళ్ల క్రితం విదేశీ పాలకులతో పోరాటం చేశాం. నూరేళ్ల తర్వాత మళ్లీ మన దేశ పాలకులపై పోరాటం చేస్తున్న పరిస్థితులు వచ్చాయి’ అన్న మాటల వెనుక ఎంతో ఆవేదన కనిపిస్తుంది.
చీలికలు పేలికల మధ్య ఐక్యత ఎక్కడ?
పురోగామి చింతనాపరుల్లో ఏర్పడిన అభిప్రాయ భేదాలు చీలికలకు దారితీశాయని రాచపాళెం అన్నారు. నిజమే, అభ్యుదయ రచయితల సంఘం నుంచి 1970లో చీలిన వారితో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడిన అర్ద దశాబ్దానికే, దాని నుంచి చీలిన వారితో జనసాహితి ఏర్పడింది. తర్వాత ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం, లౌకికవాద రచయితల సంఘం ఏర్పడటం వంటి పరిణామాలన్నీ జరిగిపోయాయి. “ఇలా చీలడం వల్ల కొన్ని సామాజిక వర్గాల (స్త్రీలు, మైనారిటీల)కు ప్రయోజనాలు చేకూరి ఉండవచ్చు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుని ఐక్య కార్యాచరణతో పని చేయాలి” అంటూ అరసం రాష్ట్ర అధ్యక్షులుగా, ఈ మహాసభల ప్రారంభ సభకు అధ్యక్షోపన్యాసం చేస్తూ, రాచపాళెం ఇచ్చిన పిలుపు గురించి పురోగామి శక్తులైన రచయితలు ఆలోచించాలి. “నాలుగు దశాబ్దాల పరిణామాలను అవలోకనం చేసుకుంటే, అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.” అనడం ఈ సభల్లో ఒక కీలకమైన పిలుపుగా భావించవచ్చు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కె.కాత్యాయని విద్మహే అరసం సభలకు ప్రారంభోపన్యాసం చేయడం ఒక విశేషం. భిన్నాభిప్రాయాలున్న పురోగామి రచయితల మధ్య ఒక సామరస్య పూర్వక వాతావరణానికి ఇది దోహదం చేస్తుంది. అంతే కాకుండా, విరసం సభ్యులు, విరసం పూర్వ కార్యదర్శి వి.చెంచయ్య కూడా ఈ సభల్లో రెండవ రోజు ఆదివారం ‘మతం-వర్తమాన సమాజం’ అన్న అంశంపైన ప్రసంగించడం ఈ ఐక్యతా వాతావరణానికి బలాన్ని చేకూరుస్తోంది.
ఫాసిస్టులు ఐక్యంగా.. మనం అనైక్యంగా…
ఈ సభల్లో కాత్యాయని విద్మహే ప్రారంభోపన్యాసం కూడా పురోగామి రచయితల ఐక్యతను ఆకాంక్షిస్తూనే, వారి ఉపన్యాసం చాలా కీలకాంశాలతో సాగింది. ఫాసిజాన్ని వ్యతిరేకించడం, కమ్యూనిజాన్ని సమర్థించడమే ధ్యేయంగా అరసం ఏర్పడిందని గుర్తుచేశారు. అరసం తాత్విక భావనలను కొడవటిగంటి కుటుంబరావు చెప్పేవారన్నారు. అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఆలోచించాలని కోరారు. ‘ప్రగతిశీలురు ఐక్యత దిశగా మన ఆచరణ సాగాలి’ అన్న రాచపాళెం మాటలను కాత్యాయని విద్మహే గుర్తు చేస్తూ, “ఫాసిస్టులు ఐక్యంగా ఉన్నారు. మనం చాలా అనైక్యంగా ఉన్నాం.” అన్న చేదు నిజాన్ని కుండబద్దలు కొట్టారు. సెక్యులర్ రైటర్స్ అసోసియేషన్‌లో ఒకరు ఇదే విషయాన్ని చెపుతూ, “ఒక్క విషయంలో ఏకీభావం ఉన్నా వాళ్లు (ఫాసిస్టులు) కలుపుకొచ్చారు. ఒక్క విషయంలో తేడాలున్నా మనం కలుపుకు పోలేకపోతున్నాం.” అని గుర్తుచేశారు.
సకల ‘అస్తిత్వాల’ను నిలుపుకోలేకపోయాం !
“మత మూఢత్వం, అసమానతలున్న సమాజం వల్ల లాభపడే వారు దాన్ని అలాగే కొనసాగించాలనుకొంటున్నారు. మనం మారాలనుకుంటున్నాం. ఈ రెంటి మధ్య సంఘర్షణే నేటి స్థితి” అంటూ వివరించారు. “అరసం ఏర్పడినప్పుడు ఒక చలనం ఉండేది. స్త్రీలు ప్రశ్న వేసినప్పుడు వారు దాన్ని చలనంగా భావించారు. దళితులు ప్రశ్నించినప్పుడు వారు కూడా దాన్ని చలనంగా భావించారు. ఈ అస్తిత్వ సమూహాలన్నిటినీ నిలుపుకోగలిగినప్పుడు ఫ్యాసిజాన్ని నిలువరించగలిగే వాళ్లం కదా” అని ప్రశ్నించడం ద్వారా, అస్తిత్వ ఉద్యమాలను అర్థం చేసుకోకపోవడం, వాటిని ఇముడ్చుకోలేకపోవడం వల్లనే పురోగామి శక్తుల్లో అనైక్యత ఏర్పడిందని స్పష్టం చేశారు. ఈ సమూహాలన్నిటినీ నిలుపుకోగలిగినప్పుడు ఫాసిజాన్ని ఎదుర్కోగలం కదా అని చీలికలకు దారి తీసిన లోపాల్ని కూడా ఎత్తి చూపారు. అస్తిత్వ ఉద్యమాలను కలుపుకోలేకపోవడం వల్లనే బలహీనపడ్డామని స్పష్టం చేశారు.
బుర్ర ఉన్న ప్రతివాడూ అర్బన్ నక్సలైటే..!
“అస్తిత్వ ఉద్యమాలున్నప్పటికీ, చివరి విముక్తి మాత్రం మార్క్సిజమే” అని నిర్మొహమాటంగా చెప్పేశారు. పెద్ద సమూహంగా ఉన్నప్పుడు బలంగా ఉన్న మనం చీలడం వల్ల బలహీన పడ్డామనడం చేదు నిజం. “మనం అందరినీ కలుపుకునిపోయే కార్యక్రమం ఏమిచ్చాం” అంటూ ఆత్మ పరిశీలన చేసుకోమన్నట్టు కాత్యాయని విద్మహే ప్రశ్నను సంధించారు. పురోగామి శక్తుల అనైక్యత వల్ల ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని వివరిస్తూ, “ఇప్పుడు కాస్త బుర్ర ఉన్న వారెవరైనా అర్బన్ నక్సలైట్ అయిపోతున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యానం వెనుక ప్రభుత్వ దుర్మార్గపు చర్యను బహిర్గతం చేశారు. మావోయిస్టులను వరుసపెట్టి కాల్చి చంపడంతో పాటు, పట్టణాల్లో ఉన్న ఆలోచనాపరులను కూడా ‘అర్బన్ నక్సలైట్లు’ అని ముద్ర వేసి వెంటాడే ప్రస్తుత స్థితిని గుర్తుచేశారు.
అందరినీ కలుపుకుపోయే కార్యక్రమం ఎక్కడ?
“అందరినీ కలుపుకుపోయే కార్యక్రమం మనం ఏమిచ్చాం” అంటూ ఆమె ప్రశ్నించారు. పంథాల వైరుధ్యాలను పక్కన పెట్టి, లౌకికవాద శాస్త్రీయ దృష్టితో ఏకం కావాలని పిలుపునిచ్చారు. లౌకిక పురోగామి శక్తులను ఐక్యం చేసే కామన్ ఎజెండా ఏర్పాటు చేయాలన్నారు. స్త్రీలకైనా, దళితులకైనా మార్క్సిస్టు ఉద్యమంతోనే వారి ఆకాంక్షలను నెరవేర్చగలమనే ధీమాను కాత్యాయని విద్మహే వ్యక్తం చేశారు. రెండు రోజుల అరసం సభల సారాంశమంతా ప్రారంభ సమావేశంలో ఇలా వ్యక్తమైంది.
(తిరుపతిలో అరసం 20వ మహాసభల సందర్భంగా)
సెల్ : 9493226180


