Homeఅరాచక శక్తులపై ఉక్కుపాదం

అరాచక శక్తులపై ఉక్కుపాదం

- Advertisement -
  • రెండు నిమిషాల్లో వైసీపీ ఆగడాలకు చెక్ – పరామర్శల పేరిట వికృత క్రీడ
  • అసూయతోనే డీఎస్‌సీపై కుట్రలు – అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం
  • 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు – మంత్రులతో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర- సచివాలయం: రాష్ట్రంలో అరాచకాలను, శాంతిభద్రతల సమస్యలను అదుపు చేయడానికి తనకు కేవలం రెండు నిమిషాలు చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు, వారి శ్రేణులు రాజకీయ ముసుగు వేసుకుని విచక్షణారహితం గా నేరపూరిత చర్యలకు తెగబడుతు న్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్న అరా చక శక్తులపై ఉక్కుపాదం మోపుతా మని స్పష్టంచేశారు. అమరావతి సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం ముగిసిన అనం తరం చంద్రబాబు మంత్రులతో క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ భేటీలో వైసీపీ తీరుపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి… ఆ పార్టీ నేతలు రాజకీయాల ముసుగులో జిల్లాల్లో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమావేశాల పేరిట మద్యం తాగించి, గంజాయి బ్యాచ్లను జిల్లాలకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘దేవరపల్లిలో పరామర్శ ముసుగులో వైసీపీ శ్రేణులు అడవి పందుల మాదిరిగా పొలాలపై పడ్డారు. ఒక పేద మహిళ చిరు వ్యాపారి షాపును పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, హిందూ దేవుళ్ల చిత్రపటాలను రోడ్డుపై పగలగొట్టారు. రైతులు ఎంతో కష్టపడి తెచ్చిన పొగాకు బేళ్లను కాలితో తొక్కి నాశనం చేశారు. చివరకు జగన్ పరామర్శకు వస్తున్నారంటేనే ప్రజలు, రైతులు భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది’ అని సీఎం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అల్లర్ల వల్ల తమ పంట దెబ్బతిందని అనేకమంది రైతులు తనకు స్వయంగా సందేశాలు పంపారని వెల్లడించారు. ‘దిశ’ అనేది చట్టరూపమే దాల్చలేదని, కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును తిరస్కరించి వెనక్కు పంపినా విచ్చలవిడిగా వాహనాలు, పోలీసు స్టేషన్లంటూ గత ప్రభుత్వంలో పెద్ద డ్రామా ఆడారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం డీఎస్‌సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించిందనే అసూయతోనే ప్రతిపక్షం కుట్రలకు తెరలేపిందని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వంపై కేసులు వేసి కోర్టులకు వెళ్తే అక్కడ కూడా వారికి చీవాట్లు పడ్డాయని, అయినా బుద్ధి మార్చుకోకుండా డీఎస్‌సీపై ధర్నాలు చేస్తూ యాగీ చేస్తున్నారని విమర్శించారు. ‘వైసీపీ నాయకులకు హారిCంటల్, వర్టికల్ రిజర్వేషన్ల గురించి కనీస అవగాహన లేదు. ఈ రిజర్వేషన్ల అమలు తీరుపై ప్రజలకు, ఉద్యోగార్థులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో స్పష్టంగా వివరించాలి. వైసీపీ దుష్ప్రచారాన్ని ఎక్కడికకక్కడ తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. తాము ఆర్థిక శాఖపై అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేస్తే… అందులోని అంశాలు తప్పని ఒక్క వైసీపీ నేత ధైర్యంగా చెప్పలేకపోయారని గుర్తుచేశారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. సమావేశాల ఎజెండాను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. నాలుగు రోజుల సమావేశాలు నిర్వహించిన అనంతరం, తిరిగి డిసెంబరులో ప్రభుత్వం పూర్తిస్థాయి సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
దాదాపు 12 ఏళ్లుగా నలుగుతున్న అగ్రిగోల్డ్ వ్యవహారంపై కేబినెట్‌లో అత్యంత సుదీర్ఘంగా చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులు 11 రాష్ట్రాల్లో ఉన్నారని, దశాబ్దాల నాటి వారి బాధలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సబ్ కమిటీ అత్యంత జాగ్రత్తగా, వేగంగా వ్యవహరించి శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కేవలం భూముల వేలం ద్వారా సరైన మార్కెట్ ధర వచ్చేలా చూడటంతో పాటు, వేలంతో మాత్రమే ఆగకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా తీవ్రంగా పరిశీలించి బాధితులకు వీలైనంత త్వరగా పూర్తి న్యాయం చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల తాగునీటి తిప్పలు తీర్చేలా వెలుగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల తేడా లేకుండా ఆక్వా రైతులకు రూ.1,100 కోట్ల విద్యుత్ రాయితీలు అందించామని తెలిపారు. ఆక్వా ఫీడ్ ఎగుమతి సుంకాన్ని 50 శాతం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని, నేరుగా సముద్రం మీదుగా విమానాలు ల్యాండ్ అయ్యేలా అత్యాధునిక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘దుబాయ్ ఐ వీల్’ (250 మీటర్లు) కంటే పెద్దదిగా అమరావతి రాజధానిలో ‘ఐ వీల్’ ప్రాజెక్టును త్వరలోనే తీసుకువస్తున్నామని చెబుతూ అమరావతి ఐకాన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. సాంకేతిక రంగానికి సరికొత్త దిశ చూపించేలా వచ్చే ఏడాది జనవరిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర గిరిజన సాంస్కృతిక నృత్యానికి మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో ‘గిన్నిస్ రికార్డు’ రావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలలో ‘స్వర్ణాంధ్ర-2047’, ‘వికసిత భారత్’ అనే రెండు ప్రధాన లక్ష్యాలు స్పష్టంగా ప్రతిబింబించేలా పాలన సాగాలని మంత్రులకు, అధికారులకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు