నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం
. పెరగనున్న రవాణా ఖర్చులు
. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం
. క్రిసిల్ నివేదిక వెల్లడి
న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని ప్రభావం రాబోయే నెలల్లో ఆహార, వినియోగ వస్తువుల విభాగాలపై పడే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. దేశంలో మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.7.5 మేర పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రమంగా తమ నష్టాలను తగ్గించుకుంటున్నందున, సమీప భవిష్యత్లో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు లీటరుకు రూ.10 కి చేరువయ్యే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసినట్లు పీటీఐ తెలిపింది. ‘ఈ విస్తృత ప్రభావం అధిక రవాణా ఖర్చుల ద్వారా ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆహార, మÖల ద్రవ్యోల్బణం రెండింటినీ పెంచుతుంది’ అని క్రిసిల్ నివేదిక వివరించింది. ఇంధన ధరలు లీటరుకు రూ.7.5 పెరిగితే, అది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణానికి నేరుగా సుమారు 36 బేసిస్ పాయింట్లు అదనంగా చేర్చగలదు. ఒకవేళ మొత్తం పెరుగుదల లీటరుకు రూ.10 కి చేరితే… దాని ప్రభావం దాదాపు 48 బేసిస్ పాయింట్ల వరకు పెరగవచ్చు. ప్రత్యక్ష ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరగడానికి దారితీసి… ధరల పెరుగుదలకు కారణమవుతుందని క్రిసిల్ హెచ్చరించింది. భారతదేశ సరుకు రవాణాలో రోడ్డు రవాణా వాటా సుమారు 71 శాతం కాగా, నిర్వహణ ఖర్చులలో ఇంధనం వాటా దాదాపు 42 శాతంగా ఉంది. ‘రిటైల్ ఇంధన ధరల పెరుగుదల ఈ రవాణా ఖర్చుల నిర్మాణాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. రాబోయే నెలల్లో సరఫరా గొలుసులన్నింటిలో ధరలపై దాని ప్రభావాన్ని పెంచుతుంది’ అని నివేదిక పేర్కొంది. రవాణా వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడే పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, పండ్లు, పప్ప్పుధాన్యాలు, మసాలా దినుసులు, గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార వర్గాలు అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొంటాయని అంచనా. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ క్షీణించడం రాబోయే త్రైమాసికాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత వేగవంతం చేయగలదని క్రిసిల్ తెలిపింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువుల అధిక వ్యయాలతో పాటు పెరుగుతున్న రవాణా ఖర్చులతో తయారీదారులు సతమతమవుతున్నందున మÖల ద్రవ్యోల్బణానికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయని నివేదిక సూచించింది. వస్త్రాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కలప ఉత్పత్తులు, సిమెంట్, సిరామిక్స్తో సహా నిర్మాణ సామగ్రి వంటి రంగాలు అత్యధిక రవాణా అవసరమయ్యే పరిశ్రమలలో ఉన్నాయి. వీటి వలన వినియోగదారులపై వ్యయ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. రసాయనాలు, బొగ్గు, లోహ సంబంధిత ఉత్పత్తుల తయారీదారులు కూడా అధిక ముడిసరుకు వ్యయాలను ఎదుర్కోవచ్చు. డిమాండ్ పరిస్థితులు సాపేక్షంగా స్థిరంగా ఉండటంతో కంపెనీలు ఈ ఖర్చులను ఎక్కువగా వినియోగదారులపై మోపవచ్చు లేదా తమ లాభాలను కాపాడుకోవడానికి ‘ష్రింక్ఫ్లేషన’ (వస్తువుల పరిమాణం తగ్గినా వాటి ధర మాత్రం మారదు) వ్యూహాలను అనుసరించవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, దుస్తులు, ప్రాసెస్డ్ ఆహార పదార్ధాలు, వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు (ఎఫఎంసీజీ) వంటి అనేక సామూహిక వినియోగ వర్గాలపై సెప్టెంబరు 2025 లో ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపుల ద్వారా ద్రవ్యోల్బణ ప్రభావంలో కొంత భాగాన్ని తగ్గించవచ్చని క్రిసిల్ పేర్కొంది. అయితే నిరంతరం అధికంగా ఉన్న ఇంధన ధరల ప్రభావాన్ని ఈ పన్ను తగ్గింపులు పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ముడి చమురు ధరలు సగటున బ్యారెల్కు సుమారు 112 డాలర్లుగా ఉన్నాయి. ఇది పూర్తి సంవత్సరానికి క్రిసిల్ అంచనా వేసిన బ్యారెల్కు సుమారు 95 డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ. ప్రధాన ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేస్తోంది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశించిన 2-6 శాతం సహన పరిధిలోనే ఉండే అవకాశం ఉంది.
పెరిగిన ఇంధన ధరల వల్ల సరఫరాపై పడే ప్రభావాన్ని ఆర్బీఐ తొలుత పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ గృహ ద్రవ్యోల్బణ అంచనాలను, అలాగే పెరుగుతున్న రవాణా, ముడి సరుకుల ఖర్చులు విస్తృత ధరల ఒత్తిళ్లకు దారితీసే ప్రమాదాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆ నివేదిక పేర్కొంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందనే అంచనాలు, అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో పరిస్థితుల వంటి వాతావరణ సంబంధిత ప్రమాదాలపై కూడా కేంద్ర బ్యాంకు నిశితంగా గమనిస్తుందని భావిస్తున్నారు. ఇవి ఆహార ద్రవ్యోల్బణ అంచనాలను మరింత క్లిష్టతరం చేయగలవు.


