ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించాలి
ప్రపంచానికి ఖతార్ ప్రధాని పిలుపు
దోహా: ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించాలని, ఇజ్రాయిల్‌ను శిక్షించాలని ఖాతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జస్సిమ్ అల్ థాని పిలుపునిచ్చారు. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ సభ్యులపై ఇజ్రాయిల్ దాడిని ఖండిరచారు. ఇదే అంశమై సోమవారం అరబ్, ఇస్లామిక్ నాయకుల ఐక్యతను ప్రతిబింబించేలా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఖతార్ ప్రధాని మాట్లాడుతూ ఇజ్రాయిల్ జవాబుదారీ తనాన్ని డిమాండ్ చేశారు. ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించేందుకు, అన్ని నేరాలకుగాను ఇజ్రాయిల్‌ను శిక్షించేందుకు సమయం ఆసన్నమైందని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజా సమూల వినాశనంలో ఇజ్రాయిల్ ఫలించబోదన్నారు. అంతర్జాతీయ సమాజం మౌనం వహిస్తుం డటం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయలేకపోవడమే ఇజ్రాయిల్‌కు బలాన్ని స్తోందని ఖాతార్ ప్రధాని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని కోరారు. కాగా, ఖతార్‌పై ఇజ్రాయిల్ దాడి జరపడం మీద ఈ సమావేశం ముసాయిదా తీర్మానం చేసినట్లు ఖాతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ వెల్లడిరచారు. ఇజ్రాయిల్ దురాక్రమణ పలస్తీనాకు పరిమితం కాదని, ప్రాదేశికంగా విస్తరిస్తు న్నదని టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్ అన్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అరబ్, ఇస్లామిక్ దేశాలు ఏకం కావడం అత్యవసరమని ఆయనన్నారు. సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్, పలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
నెతన్యాహూ… ఖతార్ జోలికి వెళ్లొద్దు: ట్రంప్
ఖతార్ జోలికి వెళ్లొద్దని ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. అది తమ మిత్రదేశమని, ఖాతార్ ప్రధాని అద్భుతమైన వ్యక్తి అని అన్నారు. హమాస్‌పై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు కానీ ఖతార్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు.


