గుర్తింపు సంక్షోభంలో సామాన్యుడు : పౌరసత్వ పరీక్షల వలయంలో దేశం ఇటీవల ఒక వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. మాతృభూమిలోనే తనకు కన్నుమూయాలని ఉందని ఆమె బాపట్ల జిల్లా అధికార యంత్రాంగానికి చేసుకున్న వినతిలో పేర్కొన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని ఆమె కలెక్టర్ వద్ద ప్రమాణం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అందరినీ అభినందించాల్సిందే. అదే సమయంలో అదే జిల్లాకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడే సందర్భంలో “ఈ దేశంలో తరతరాలుగా జీవిస్తున్న వారికే పౌరసత్వం ఉందో లేదో తెలియడం లేదు. జనం గుర్తింపు సంక్షోభంలో ఉన్నారు. ఎస్‌ఐఆర్ పేరిట జరుగుతున్న తంతులో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. ఏ గుర్తింపు కార్డు పనిచేస్తుందో, ఏది పనిచేయదో తెలియక జనం సందిగ్థంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ వృద్ధురాలు భారత పౌరసత్వం అడగడం ఒకింత విచిత్రమే” అని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పింది ముమ్మాటికీ వాస్తవం. ఆయన మాటల్లోని ప్రతి అక్షరమూ నిజమే. ప్రభుత్వం మారిన ప్రతిసారీ విధానాలు మారుతున్నాయి. అది ఫాసిస్టు ప్రభుత్వమైనా, ఇంకే తరహా ప్రభుత్వమైనా? ఇటీవల జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయమైన రాజ్యాంగ పీఠికను తొలగించింది. సెక్యులర్ (లౌకిక), సెక్యులరిజం (లౌకిక వాదం) ప్రస్తావనను తీసివేసింది. సరికొత్త జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా సవరించిన సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పాఠ్యాంశంగా చేర్చి ఎన్‌సీఈఆర్‌టీ సంచలనం సృష్టించింది. ఈ ప్రక్రియ ద్వారా లక్షల మంది యువ ఓటర్లు ఎన్నికల జాబితాలో చేరినట్లు ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ : ఇండియా అండ్ బియాండ్’ అనే అధ్యాయంలో పేర్కొంది. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, బెదిరింపులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘాన్ని ప్రశంసించింది. ఇది నిజమేనా? పైగా పుస్తకంలో ‘స్టేట్ అండ్ సొసైటీ అప్ టు 1000 సీఈ’ అనే అధ్యాయంలో వేద నాగరికతలో మహిళలకు ఉన్నతస్థానం లభించిందని ప్రస్తావన చేశారు. అంతేకాదు, మనుస్మృతిలో సరైన జీవన విధానం, సామాజిక తరగతులు, పాలన గురించి వివరించిన ఓ పద్యాన్ని కూడా చేర్చారు. గతంలో 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై ఒక అధ్యాయాన్ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు నుంచి విమర్శలు చవిచూసిన ఎన్‌సీఈఆర్‌టీ ఈసారి 9వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థను నిష్పాక్షిక, స్వతంత్ర సంస్థగా అభివర్ణించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నాలన్నీ దాని లక్ష్యం ఏమిటో చెప్పకనే చెపుతున్నాయి. దేశాన్ని ఏ దిశగా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) కు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 14న మూడో దశ సవరణ ప్రక్రియ మొదలైంది. గత ఏడాది జూన్ 24న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘సర్’ ప్రక్రియతో ఏకంగా 65 లక్షల ఓట్లను తొలగించారు. అక్టోబరు 27న ప్రారంభమైన రెండో దశలో ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఏకంగా 10.2 శాతం ఓట్లను కుదించారు. ‘సర్’కు ముందు 50.99 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఆ తర్వాత 45.81 కోట్లకు తగ్గింది. అంటే మొత్తంగా 5.18 కోట్లకు పైగా పేర్లను తొలగించారని తేలింది. మూడో దశ పూర్తయ్యాక ఈ సంఖ్య పెరుగుతుంది. అంటే వీరంతా విదేశీయులా ? దేశ పౌరసత్వం లేని వాళ్లా ? ఏ గుర్తింపుకార్డూ లేని వాళ్లా? ఒక దేశంలో నివసించే పౌరుడికి ప్రాథమికమైన అవసరం ఏమిటి? తాను ఆ దేశ పౌరుడినని నిరూపించుకునే ‘గుర్తింపు’. నేడు భారతదేశంలో సగటు పౌరుడు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన ఏ గుర్తింపు కార్డూ తుది ప్రమాణం కాదంటూ ప్రభుత్వ ప్రతినిధులే ప్రకటిస్తుండటం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న ఆధార్, నేడు ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాల పేరుతో సాగుతున్న ఈ ప్రక్రియలు పౌరులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. వీటికి తోడు, “పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు” అని విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ దేశంలో అసలు తామెవరమనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తేలా చేశాయి. భారతదేశంలో గుర్తింపు కార్డుల చరిత్ర ప్రహసనంగా మారింది. దశాబ్దాల క్రితం రేషన్‌కార్డును ప్రామాణికంగా భావించారు. ఆ తర్వాత ఓటరు గుర్తింపు కార్డు ఆ తర్వాత పాన్ కార్డు, డైవింగ్ లైసెన్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే, దేశంలో ప్రతి ఒక్కరి వేలిముద్రలు, కంటిపాపల స్కానింగ్ సేకరించి ‘ఆధార్’ కార్డును ప్రవేశపెట్టారు. “ఆధార్ ఉంటేనే అన్నీ” అన్న చందంగా ప్రభుత్వ పథకాల నుండి బ్యాంకు ఖాతాల వరకు ప్రతిదానికీ దీనిని ముడిపెట్టారు. సామాన్యులు గంటల తరబడి క్యూలలో నిలబడి, బయోమెట్రిక్ సమస్యలను ఎదుర్కొంటూ ఆధార్ కార్డులు సాధించుకున్నారు. తీరా ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆధార్ కేవలం ఒక నివాస ధ్రువీకరణ మాత్రమేనని, అది పౌరసత్వానికి నిదర్శనం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన ఎస్‌ఐఆర్ (సర్) నమోదు కార్యక్రమం సామాన్యుడి పాలిట శాపంగా మారింది. పాత పత్రాలను, తాత ముత్తాతల కాలం నాటి ఆధారాలను వెలికితీయాలని అధికారులు నిబంధనలు విధిస్తుండటంతో, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, నిరక్షరాస్యులు ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ గందరగోళం ఇలా ఉండగానే, విదేశాంగశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విదేశాలకు వెళ్లేందుకు, అంతర్జాతీయంగా భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందేందుకు అత్యున్నత ప్రమాణంగా భావించే ‘పాస్‌పోర్ట్’ కూడా పౌరసత్వానికి పూర్తి గ్యారెంటీ కాదని ఆయన పేర్కొనడం కలకలం రేపింది. ప్రభుత్వమే అన్ని రకాల తనిఖీలు చేసి, నేర చరిత్రను పరిశీలించి జారీ చేసే పాస్‌పోర్టుకే విలువ లేకపోతే, ఇక సామాన్యుడు ఏ పత్రాన్ని నమ్ముకోవాలి? ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పౌరులందరినీ అనుమానితులుగా చూసే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దేశంలోనే పుట్టి, ఇక్కడే పన్నులు కడుతూ, ఇక్కడి ఎన్నికల్లో ఓటు వేస్తున్న సగటు జీవికి “ఇది నా దేశమేనా?” అనే వేదన కలగడం సహజం. దేశ రక్షణ, అంతర్గత భద్రత ముఖ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ ప్రక్రియ పౌరులలో అభద్రతా భావాన్ని నింపేలా ఉండకూడదు. ఈ గుర్తింపు ప్రక్రియల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది సామాన్యులు, పేదలు, వలస కార్మికులే. వరదలు, అగ్నిప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంతోమంది పేదలు తమ సర్టిఫికెట్లను కోల్పోతుంటారు. అలాంటి వారిని పాత పత్రాలు అడగడం ఎంతవరకు న్యాయం? ఒక్కో చిన్న తప్ప సవరణ కోసం (పేరు స్పెల్లింగ్, పుట్టిన తేదీ వంటివి) ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, మీసేవ కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తోంది. దినసరి కూలీలు తమ పనిని వదులుకుని ఈ కేంద్రాల వద్ద నిలబడటం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. దీనికి తోడు దళారుల దోపిడీ అదనం. ప్రభుత్వం ఒక వ్యవస్థను ప్రవేశపెట్టేటప్పుడు దానికి తగిన మౌలిక వసతులను, సరళమైన నిబంధనలను రూపొందించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా, ప్రజలపై నిబంధనల భారాన్ని మోపడం వల్ల వ్యవస్థపై నమ్మకం సడలిపోతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గుర్తింపు కార్డుల ప్రాధాన్యతలు మారడం, పౌరులను నిరూపించుకోమనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశపౌరులను అనుమానపు నీడలో ఉంచడం ఏ ప్రభుత్వానికి తగదు. వారి హక్కులకు భంగమిది. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో, అన్ని రకాల డేటాను ఒకే చోటకు చేర్చి పౌరుడికి సులువైన పద్ధతిలో గుర్తింపును ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఎస్‌ఐఆర్ వంటి కార్యక్రమాల్లో ఉన్న సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకమైన, సరళమైన విధానాన్ని అవలంబించాలి. ప్రజలకు తమ దేశంలో తాము సురక్షితంగా ఉన్నామనే ‘నమ్మకాన్ని’ కలిగించడమే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. గుర్తింపు కార్డుల పేరుతో సాగుతున్న ఈ సంక్షోభానికి తక్షణమే తెరదించాల్సిన అవసరం ఉంది.


