Homeవిశ్లేషణఎడారిని పంట భూమిగా మార్చిన చైనా

ఎడారిని పంట భూమిగా మార్చిన చైనా

- Advertisement -

టి. లక్ష్మీనారాయణ

ఇటీవల నేను చదివిన అనంతపురం అర్ధ-శుష్క ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తల పరిశోధన పత్రం నాకు తీవ్ర ఆందోళన కలిగించింది. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో నేల క్షీణత, ఇసుక ఆక్రమణ, హగరి (వేదవతి) నది ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయానికి ముప్పుగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎడారులను సైతం వ్యవసాయ భూములుగా మార్చిన చైనా అనుభవం మన ఆలోచనలకు పదునుపెట్టాలి. 1990 ఏప్రిల్ 3-9 తేదీలలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎసఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధి బృందంలో సభ్యునిగా నేను ఏఐఎసఎఫ్, నాటి ప్రధాన కార్యదర్శిగా చైనాను సందర్శించే అవకాశం పొందాను. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాలైన చైనా విద్యార్థి యువజన సంఘాల ఆహ్వానంపై సీపీఐ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.రాజా (ఏఐవైఎఫ్, నాటి ప్రధాన కార్యదర్శి), ప్రపంచ శాంతి సంఘం ప్రస్తుత అధ్యక్షులు కా. పల్లబ్ సేన్ గుప్తా(ఐయుఎస్, నాటి ఉపాధ్యక్షులు) తో కలిసి నేను చైనా పర్యటించినప్పుడు అక్కడ వ్యవసాయ ఆధునీకరణ ప్రారంభ దశను ప్రత్యక్షంగా పరిశీలించాను. ఆ సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్నాయి. వ్యవసాయం, పరిశ్రమ, శాస్త్రసాంకేతిక రంగాలను సమన్వయం చేస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టి సారించి, దేశాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తోంది. బీజింగ్ శివార్లలో మేము సందర్శించిన గ్రీన్‌హౌస్ వ్యవసాయ క్షేత్రం ఇప్పటికీ నా జ్ఞాపకాలలో నిలిచిపోయింది. శీతాకాలంలో కూడా కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించింది. ప్లాస్టిక్ కవర్లతో నిర్మించిన సౌర గ్రీన్‌హౌస్‌లు, బిందు సేద్యం, నియంత్రిత సాగు పద్ధతులు అప్పట్లో వినూత్నంగా కనిపించాయి. రైతులు కుటుంబ బాధ్యతా వ్యవస్థలో పంటల ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పొందారు. ప్రభుత్వం మద్దతు, మార్కెట్ సదుపాయాలు, శాస్త్రీయ సలహాలు కలగలిసి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత నేడు గ్రీన్‌హౌస్ వ్యవసాయంలో చైనా ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. ప్రపంచ గ్రీన్‌హౌస్ సాగు విస్తీర్ణంలో సుమారు 60 శాతం చైనాలోనే ఉన్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. చైనా మొత్తం సాగుభూమిలో గ్రీన్‌హౌస్‌ల విస్తీర్ణం శాతపరంగా తక్కువగా ఉన్నప్పటికీ, కూరగాయలు, పండ్లు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. టమోటా, దోసకాయ, క్యాప్సికమ్, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ వంటి పంటల ఉత్పత్తిలో గ్రీన్‌హౌస్ వ్యవస్థలు గణనీయమైన పెరుగుదలకు దోహదపడ్డాయి. నియంత్రిత వాతావరణం కారణంగా నీటి వినియోగం తగ్గడం, తెగుళ్ల ప్రభావం నియంత్రణలో ఉండటం, ఏడాది పొడవునా ఉత్పత్తి సాధ్యమవడం ఈ విధానానికి ప్రధాన బలాలు. నేడు అక్కడ స్మార్ట్ గ్రీన్‌హౌస్‌లు, హైడ్రోపోనిక్స్, ఆటోమేటెడ్ నీటిపారుదల, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో సాగు నిర్వహిస్తున్నారు. పరిమిత భూమిలో అధిక దిగుబడులు సాధిస్తూ ఆహార భద్రతను బలోపేతం చేశారు. చైనా విజయానికి ప్రధాన కారణం దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రపంచ జనాభాలో ఐదో వంతు మంది చైనాలో నివసిస్తున్నప్పటికీ, సాగుభూమి పరిమితంగానే ఉంది. పట్టణీకరణ, నీటి కొరత, నేల క్షీణత, ఎడారీకరణ వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు గ్రీన్‌హౌస్ సాగును వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పరిశోధన, సబ్సిడీలు, గ్రామీణ రుణాలు, మౌలిక సదుపాయాలు, రైతుల శిక్షణకు ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. చైనా అనుభవం మరో ముఖ్యమైన పాఠాన్ని కూడా చెబుతోంది. ఎడారీకరణ, నీటి కొరత, నేల క్షీణత వంటి సమస్యలను కేవలం పర్యావరణ సమస్యలుగా కాకుండా అభివృద్ధి సవాళ్లుగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించింది. “గ్రీన్ గ్రేట్ వాల” కార్యక్రమం ద్వారా కోట్లాది చెట్లను నాటి ఇసుక తుఫానులను నియంత్రించింది. బిందు సేద్యం, సౌరశక్తి వినియోగం, రక్షిత సాగు పద్ధతులు కలిసి ఎడారి ప్రాంతాలలో కొత్త అవకాశాలను సృష్టించాయి. ఒకే భూమిపై సౌరశక్తి ఉత్పత్తి, చేపల పెంపకం, వ్యవసాయాన్ని కలిపి అమలుచేస్తోంది. విశేష ఫలితాలు సాధించింది. జిన్‌జియాంగ్, ఇన్నర్ మంగోలియా, నింగ్జియా, గాన్సు వంటి ప్రాంతాలలో భారీ అటవీకరణ, బిందు సేద్యం, గ్రీన్‌హౌస్ వ్యవసాయం, చేపల పెంపకం, సౌరశక్తి ప్రాజెక్టులను సమన్వయం చేసింది. గతంలో బీడుభూములుగా ఉన్న కొన్ని ప్రాంతాలు నేడు వ్యవసాయ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి.
అనంతపురం కోసం చైనా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
అనంతపురం జిల్లాలో భూ క్షీణత, ఇసుక వలసలు, నీటి కొరత, ఎడారీకరణ హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా అనుభవం ఒక విలువైన పాఠంగా నిలుస్తుంది. శాస్త్రీయ పరిశోధన, నీటి నిర్వహణ, అటవీకరణ, బిందు సేద్యం, రక్షిత సాగు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని సమగ్ర అభివృద్ధి వ్యూహంగా అమలు చేయడం ద్వారా చైనా గణనీయమైన ఫలితాలను సాధించింది. ప్రకృతి పరిమితులు అభివృద్ధికి అడ్డంకులు కావని, సరైన ప్రణాళిక, రాజకీయ సంకల్పం, ప్రభుత్వ పెట్టుబడి, ప్రజల భాగస్వామ్యం ఉంటే కరువు ప్రాంతాలను కూడా సుసంపన్న ప్రాంతాలుగా మార్చవచ్చని చైనా నిరూపించింది. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ ప్రాంతాల భవిష్యత్తును రక్షించడానికి కూడా ఇదే తరహా దీర్ఘకాలిక దృక్పథం, శాస్త్రీయ కార్యాచరణ అత్యవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అంకితభావంతో యుద్ధ ప్రాతిపదికన అమలుచేయాలి. ఎండిపోయిన హగరి నదిని పునరుజ్జీవింపజేయాలి. కరువు ప్రాంతాలను కూడా ఉత్పాదక ప్రాంతాలుగా మార్చడం సాధ్యమేనన్న సంకల్పాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పాలి.
వ్యవసాయ సంస్కరణలు
1978లో డెంగ్ జియావోపింగ్ చైనాలో సంస్కరణల అమలుకు పూనుకున్నారు. ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమయ్యింది. 1990 దశకంలో వేగవంతమైంది. గ్రామీణ కమ్యూన్‌లు గృహ వ్యవసాయ బాధ్యతాయుత వ్యవస్థల వైపు మారాయి. వ్యవసాయ ఆధునీకరణ ఒక జాతీయ ప్రాధాన్యతగా మారింది. మేము వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు భూ యాజమాన్య హక్కు, పంటల సాగు – వ్యవసాయ ఉత్పత్తుల ధరలు – మార్కెటింగ్ సదుపాయాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, వగైరా అంశాల గురించి అడిగి, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశాను. వ్యవసాయ రంగంలో సమగ్రమైన సంస్కరణలు అమలవుతున్నాయని, సమిష్టి వ్యవసాయం స్థానంలో కుటుంబ బాధ్యత వ్యవస్థ అమల్లోకి వచ్చిందని, భూమి, కొన్ని ప్రధానమైన ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం కొనసాగుతున్నదని, ఒప్పంద భూమి (కుటుంబం లీజుకు తీసుకున్న భూమి) లో ఏ పంట పండించాలనే దానిపై రైతులే స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చని, వ్యవసాయ ఉత్పత్తుల్లో సగభాగాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రభుత్వమే విధిగా కొంటుందని, మిగిలిన సగభాగాన్ని సంతల్లో (బహిరంగ మార్కెట్స్) అమ్ముకునే “బహుళ-అంచెల ధరల వ్యవస్థ” అమల్లో ఉన్నదని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వేచ్ఛాయుత రైతు మార్కెట్లను స్థాపించడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తున్నదని చెప్పారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. ఉష్ణోగ్రత , వెలుతురు నియంత్రణ ద్వారా పంటలను పండించే కాలాన్ని పొడిగించడానికి “గ్రీన్ హౌస” సాగు పద్ధతిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. వాటిల్లో బహుళ పంటలు…బహుళ అంతస్తుల్లో సాగు చేస్తున్నట్లు, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు పండిస్తున్నట్లు, వనరుల వినియోగం, ఆహార ఉత్పత్తిలో స్థిరత్వాన్ని సాధించామన్న ధీమా వ్యక్తంచేస్తూ వ్యవసాయదారులు సమాధానాలు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పారని, వాటిల్లో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని, వ్యవసాయ పనులు లేని కాలంలో కొందరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయేతర పనులకు సంబంధించిన ఉపాధి పొందుతుంటామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు