. కార్మిక సంఘాల ఐక్యవేదిక మెరుపు ఆందోళన
. లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ నినాదాలు
. పోలీసులు, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం
. కేంద్ర మంత్రికి, అధికారులకు వినతి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రికి కేంద్ర కార్మిక సంఘాల నుంచి ఊహించని నిరసన సెగ ఎదురైంది. విజయవాడ రింగ్ రోడ్డులోని నోవోటెల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరంధాంజే రెండు రోజులుగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర కార్మిక సంఘాల నేతలు బుధవారం ఒక్కసారిగా నోవోటెల్ లోకి వెళ్లి మెరుపు ఆందోళన దిగారు. ఈ ఆందోళనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం నినాదాలతో మారుమ్రోగింది. కేంద్ర ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ నినదించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, కార్మిక సంఘాల నాయకుల మధ్య తోపులాటతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తాము కేంద్ర మంత్రిని, అధికారులను కలవాల్సిందేనంటూ కార్మిక సంఘాల నేతలు పట్టుపట్టారు. తుదకు పోలీసులు, అధికారులు అంగీకరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రికి, అధికారులకు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ తదితర కార్మిక సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న హక్కులను, చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడం సమంజసం కాదని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మేలు జరుగుతుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కార్మిక శాఖ విభాగం పచ్చి అబద్ధాలు వల్లించడాన్ని తప్ప్పుపట్టారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికులకు ఏం మేలు జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. 1886లో కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలలో తీర్మానించారని, వాటితో పాటు కనీస వేతనాలు రోజుకు కార్మికుడికి రూ.178 సరిపోతుందని ప్రభుత్వం సెలవిచ్చిందని, అంటే నెలకు రూ.4,600 ఎలా సరిపోతుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు… అన్ని హక్కులను కాలరాసి కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేసేలా కార్మికులను బానిసలుగా మార్చడానికి ఈ లేబర్ కోడ్లు ఉపయోగపడతాయని అన్నారు. వీటన్నిటిని నిరసిస్తూ ఫిబ్రవరి 12 న సార్వత్రిక సమ్మెకు ఒకపక్క కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ నాగేశ్వరావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 10 గంటలు అమలు చేస్తూ ఉత్తర్వులు తేవడాన్ని తప్ప్పుపట్టారు. కార్పొరేట్లకు సేవ చేసే, కార్మికుల జీవితాలపై మట్టికొడుతున్నారని మండిపడ్డారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు కె.పోలారి మాట్లాడుతూ బ్రిటీశ్ హయాంలో సాధించుకున్న హక్కులను, చట్టాలను నేటి బీజేపీ ప్రభుత్వం కాలరాయటం దుర్మార్గమన్నారు. ఏఐయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ బీజేపీకి వత్తాసు పలికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాల తరహాగా మట్టికొట్టుకు పోవటం ఖాయమన్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి భద్రత లేకుండా కార్మికులకు వెట్టిచాకిరీ మిగిల్చారని, కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తమ విధానాలు బహిర్గతమయ్యాయని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ నిరసనలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్‌బాబు, ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి సాంబశివరావు, మెడికల్ కాంట్రాక్్ట ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట ప్రకాశ్, సివిల్ సప్లయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, గుంటూరు దాసు, బిల్డింగ్ వర్కర్్స యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చీర్ల రామస్వామి, బేవర శ్రీనివాస్, చల్లా వెంకటరమణ, ఆర్.ప్రభుదాసు, కొట్టు రమణ, శ్రీరామచంద్రమూర్తి, శివారెడ్డి, రామకృష్ణ, వేముల రాంబాబు, వాసు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ఇఫ్టూ నాయకులు పద్మ, శ్రీను పాల్గొన్నారు.


