. ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు
. ఇబ్రహీంపట్నంలో భారీగా స్పిరిట్, ఖాళీ సీసాలు బట్టబయలు
. జనార్థనరావు గోడౌన్‌గా గుర్తింపు?
. అన్నమయ్య జిల్లాలోనూ దాడులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నకిలీ మద్యం తయారీపై ఎక్సైజ్ పోలీసులు డేగ కన్నువేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక బార్ దగ్గర గల గోడౌన్‌లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్, ఖాళీ మద్యం సీసాలు బయటపడ్డాయి. ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో నాసిరకం మద్యం తయారీకి వాడిన స్పిరిట్ విక్రయించిన వారిపై ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టారు. రిక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్), ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) మిశ్రమం చేసి తయారు చేసిన నకిలీ మద్యాన్ని గుర్తించారు. తయారు చేయడానికి అవసరమైన వందలాది ఖాళీ మద్యం సీసాలు ఉండటంపై అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక అంశాలు ఇబ్రహీంపట్నం మండలంలో వెలుగు చూశాయి. ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో నకిలీ మద్యానికి వాడిన స్పిరిట్ లభ్యమైంది. నకిలీ మద్యం తయారీలో ఈ స్పిరిట్ కీలకంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్థన్‌రావుకు సంబంధించిన గోడౌన్‌లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్పిరిట్ ఖాళీ సీసాలను పోలీసులు సీజ్ చేశారు. వాటితో పాటు కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లను, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లలో లభ్యమైన స్పిరిట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాలకు మద్యం పంపిణీ చేసే క్రమంలో సంబంధిత మెటీరియల్ సిద్ధంగా ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీ కోసం ఆర్‌ఎస్, ఈఎన్‌ఏ స్పిరిట్‌లను వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో స్పిరిట్ విక్రయించిన వారిని గుర్తించి, వారిపై కేసు నమోదుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో బాటిల్ రూ.120 నుంచి రూ.130 ధరకు విక్రయించినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్‌రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన అనుచరుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టుబడిన మద్యం స్పిరిట్ టీడీపీ నేత జనార్థన్‌రావు గోడౌన్ అని, ఆయన వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ మద్యం పేరుతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి తదితరులపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారని, ఇప్పుడు బయటపడిన మద్యం స్పిరిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఏం చెబుతుందని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు రూ.99కే మద్యం విక్రయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి… అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలాఉండగా, ఇబ్రహీపట్నంలోని గోడౌన్‌లోని నకిలీ మద్యం స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోను ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తించారు. అదే జిల్లాలోని పీటీఎం మండలం సోంపల్లె గ్రామంలోని బెల్టు షాపులపై పోలీసులు దాడులు చేపట్టారు.


