Home‘నిరుద్యోగ రణభేరి’ ఉద్రిక్తం

‘నిరుద్యోగ రణభేరి’ ఉద్రిక్తం

- Advertisement -

నినాదాలతో దద్దరిల్లిన ధర్నాచౌక్
అడ్డుకున్న పోలీసులు… తోపులాటలు…నిరసనలు

. అసెంబ్లీ సమావేశాల్లోనే నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
. ఏఐవైఎఫ్ అల్టిమేటం
. ఇది దగాకోరు ప్రభుత్వం: గుజ్జుల ఈశ్వరయ్య
. మోదీ పాలనలో నిరుద్యోగభారతం: సుఖ్జిందర్ మహేశ్వరి
. హామీలు అమలు చేయకుంటే సీఎం కార్యాలయం ముట్టడి యుగంధర్, రాజేంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొలువుల కోసం కొట్లాడిన యువజన శక్తి…నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అడ్డుకోజూసిన పోలీసులు సైతం యువశక్తి ప్రతిఘటన ముందు తలవంచక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి చేపట్టిన ‘నిరుద్యోగ రణభేరి’తో విజయవాడ ధర్నాచౌక్ దద్దరిల్లింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి…నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. లేని పక్షంలో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తా మని ఏఐవైఎఫ్ నాయకత్వం హెచ్చరించింది. శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఏఐవైఎఫ్ నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి (కొలువుల కోసం కొట్లాడుకుందాం రండి)’కి అన్ని జిల్లాల నుంచి ఏఐవైఎఫ్ శ్రేణులు, నిరుద్యోగ యువత, వలంటీర్లు పెద్దఎత్తున తరలివచ్చి… యువజనులకు ఉపాధి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ దగాకోరు విధానాలను ఎండగట్టారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, వలంటీర్ల హక్కులు వంటి డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేతబట్టి నినదించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గాంధీనగర్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ధర్నాచౌక్ వరకు మహా ప్రదర్శనగా ఏఐవైఎఫ్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరి, రాష్ట్ర అధ్యÅ£ా, ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర సమితి నేతలు, వలంటీర్లు, నిరుద్యోగ యువత భారీగా చేరుకున్నారు. అనంతరం మొజ్జాడ యుగంధర్ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగ రణభేరిలో ఒకవైపు నేతల ప్రసంగాలు, మరోవైపు యువత నినాదాలతో ధర్నా చౌక్ మారుమోగింది. ఈ క్రమంలో ఏఐవైఎఫ్ శ్రేణులు, నిరుద్యోగ యువత ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ అంటూ రోడ్డుపైకి వచ్చి లెనిన్ సెంటర్ వైపు ఉప్పెనలా కదిలారు. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు భారీ బారికేడ్లు అడ్డుగా పెట్టి నిలువరించే ప్రయత్నం చేయడంతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత ఏర్పడింది. తోపులాట, పెనుగులాటలు జరిగాయి. ‘సీఎం డౌన్ డౌన’, ‘యువగళంలో నారా లోకేశ్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’ అన్న నినాదాలు మారుమోగాయి. కొంతమంది ఏఐవైఎఫ్ శ్రేణులు, నిరుద్యోగులు రోడ్డుపై పడిపోయినా…తేరుకుని పైకిలేచి నినాదాలు కొనసాగించారు. పోలీసులు తాళ్లతో వలయం ఏర్పాటు చేసి ముందుకు కదలనీయకుండా ప్రయత్నించినా యువశక్తి ముందు నిలవలేదు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఏఐవైఎఫ్ జాతీయ నాయకుడు సుఖ్జిందర్ మహేశ్వరి, పరుచూరి రాజేంద్రబాబు, యుగంధర్ నేతృత్వంలో యువజనులు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. లెనిన్ సెంటర్ వంతెన ముందు మార్గంలో మరిన్ని బారికేడ్లు ఏర్పాటు చేసినా, వాటిని పక్కకు లాగుతూ… దాటుతూ ఏఐవైఎఫ్ శ్రేణులు ముందుకు సాగడంతో చివరకు పోలీసులు దిగొచ్చి ఉద్యమానికి సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రణభేరితో ధర్నా చౌక్ ప్రాంగణం నుంచి నలుదిక్కులా వెళ్లే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
అంతకుముందు ధర్నాచౌక్‌లో జరిగిన ‘నిరుద్యోగ రణభేరి’లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుతోందన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడు, పవన్ కల్యాణ్‌లు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని… ఇది దగాకోరు ప్రభుత్వమని మండిపడ్డారు. ఉగాది పండుగ రోజున వలంటీర్లకు తీపి కబురు చెబుతామని, ఐదు వేల రూపాయల వేతనం సరిపోదు…పదివేలు ఇస్తామని చేసిన ప్రకటనలు నెరవేరలేదని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతిగా నెలకు మూడువేల రూపాయల ఇస్తామని చెప్పి…రెండేళ్లలో ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యపై జరిగే ప్రతి ఉద్యమంలో సీపీఐ గొంతుకగా నిలుస్తుందని, యువజన హక్కులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరి మాట్లాడుతూ మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పించాయని దుయ్యబట్టారు. బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల్లోను నిరుద్యోగం తాండవిస్తోందన్నారు.
ఈ ఉద్యమం కేవలం హెచ్చరిక మాత్రమే: యుగంధర్, రాజేంద్రబాబు
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భతి, ఉద్యోగాల భర్తీపైన చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం జారీజేశారు. తాము నిరుద్యోగ రణభేరి తలపెట్టాక…విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మీడియాకు లీక్‌లు ఇవ్వడం అర్థరహితమన్నారు. నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ పోరాటం ఆగదని, దగాకోరు ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమాలతో గద్దె దించుతామని మరోసారి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదని, జంబో డీఎస్సీ అంటూ చివరకు మొక్కుబడి డీఎస్సీ ఇచ్చిందని దుయ్యబట్టారు. టెట్ పరీక్షలో ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా ఉండటంతో రెండు లక్షల మందికి పైగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో పనిచేసిన వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేశారన్నారు. ఈ రెండేళ్లపాటు జాబ్ క్యాలెండరు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ ధర్నాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీసు బేరర్లు లంకా గోవిందరాజులు, వై.బాబీ, కొంగర శ్రీనివాసులు, కోన శ్రీనివాసరావు, పోతుల ప్రభాకర్, షేక్ సుభాని, వై.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు నజీర్ బందం అభ్యుదయ గేయాలను ఆలపించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు