Homeసంపాదకీయంపది రోజుల్లో నాల్గోసారి బాదుడు

పది రోజుల్లో నాల్గోసారి బాదుడు

- Advertisement -

తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగానే ధరలు పెరుగుతున్న కొద్దీ జనం పెరిగే ధరలకు అలవాటు పడిపోతారు. పది రోజుల సమయంలో పెట్రోల్, డీసెల్ ధరలు సోమవారం నాలుగోసారి పెరిగాయి. అయినా ప్రజల నుంచి ఇసుమంత నిరసన కూడా లేదు. పైగా అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం సమసిపోనప్పుడు ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతుంది అని జనం వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. పెట్రోల్, డీసెల్ ధరలు పెంచడంలో ప్రభుత్వం తప్పేమీ లేదు అనే వారు కూడా ఉన్నారు. ధరలు పెరిగినా బతుకు బండి నడవాలిగా అంటున్నారు. ఇతర ధరలతో పాటు పెట్రోల్, డీసెల్ ధరలు పైకెగ బాకడం సూర్యోదయ, సూర్యాస్తమయాలంత మామూలు అయి పోయింది. చిన్నపాటి నిరసన తెలియజేయడానికి కూడా ప్రజలు భయ పడ్తున్నారు. ఎంతగా భయపడ్తున్నారంటే సినీనటుడు ఆమిర్ ఖాన్ లాంటి వారు “మహంగాయీ డాయెన్ ” అనే పాటను ఎక్స్ (మునుపు ట్విట్టర్)లో షేర్ చేసి తరవాత భయపడి ఉపసంహరించుకున్నట్టు న్నారు. అందులో “హర్ మహీనా ఉఛ్లే పెట్రోల” (ప్రతి నెలా ఎగుస్తున్న పెట్రోల్) అన్న వాక్యాలు ఉంటాయి. ఉపసంహరించుకోవడానికి కారణం ఏమిటో ఆమిర్ ఖాన్ చెప్పలేదు. కానీ ఆయన ఎప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ప్రధానమంత్రి మోదీ దాకా బీజేపీ బడా నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతుంటారు. ఇక సామాన్య జనం భయపడడంలో ఆశ్చర్యం ఏముంది. మన్మోహన్‌సింగ్ హయాంలో 2008లో పెట్రోల్ ధర పెంచితే ఇదే బీజేపీ నానా గోల చేసింది. నిరసన ప్రదర్శనలకు దిగేవారు. మహంగాయీ డాయెన్ పాట పాడుతూ రోడ్ల మీద నృత్యం చేసేవారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది కనక జనం సాహసించారు. ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉన్నప్పుడు జనం నోరు తెరవడానికి అవకాశమే లేదు. మే 15న పెట్రోల్, డీసెల్ ధరలు లీటరుకు మూడేసి రూపాయలు, మే 19న లీటర్‌కు 90 పైసలు, మే 23న 87 పెట్రోల్ 87 పైసలు, డీసెల్ 91 పైసలు పెంచారు. సోమవారం ఏకంగా లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.2.61, డీసెల్ రూ.2.71 పెంచేశారు. అయినా జనం కిమ్మనడం లేదు. పదే పదే ధరలు పెంచడంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం లేదు. పగలో, రాత్రో పెంచరు. పొద్దున్నే ఏ ఆరింటికో, ఆరున్నరకో పెంచుతారు. అంటే ధర పెరిగినట్టు పెంచిన రోజు పత్రికల్లో రాదు. వాహనదార్లు బయటకు వెళ్తూ పెట్రోల్ పోయించడానికి వెళ్తే కానీ ధర పెరిగినట్టు తెలియదు. “ప్రజలకు బాధ లేదని కాదు. కానీ బండబారిపోయారు” అనే వారు ప్రసిద్ధ రచయిత బెర్ట్రండ్ రస్సెల్. నొప్పి కూడా నెమ్మదిగా అలవాటైపోతుంది. అస్తమానం పెట్రోల్, డీసెల్ ధరలు పెంచకుండా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అంటున్న వారు అంతర్జాతీయ పరిస్థితిని విశ్లేషించి మారుమాట్లాడడం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రజల తెలివిడి పెరుగుతున్నందుకు సంతోషిద్దాం. దిగజారుతున్న పరిస్థితులు, అనునిత్యం పడే ధరల భారానికి జనం అలవాటు పడిపోవడం ఆధునిక సమాజ లక్షణం. తమ భావోద్వేగాలను ఎలా అణచిపెట్టుకోవాలో నేర్చుకున్నారు. ఇతరుల బాధ అయితే జనానికి పట్టడమే లేదు. ధరలు భారం మోస్తున్నప్పటికీ నిరసన తెలియజేయడానికి జనం హడలిపోతున్నారు. ధరలతో పాటు వేతనాలు పెరగడం లేదు. కొత్త ఉద్యోగాలూ రావడం లేదు. అయినా జనానికి చీమకుట్టినట్టయినా లేదు. ఒకవేళ ఉన్నా బయటికి చెప్పుకునే ధైర్యం లేదు. రోడ్డెక్కి నిరసన తెలియజేస్తే ఏం జరుగుతుందో జనానికి బాగా తెలుసు, నీట్ పరీక్ష ప్రశ్నపత్రం ముందే బయటపడ్డందుకు నిరసన తెలియజేసిన లక్షలాది మంది విద్యార్థులను పాకిస్తానీయులని బీజేపీ వారు నిందించిన ఉదంతం జనానికి తెలుసుగా! రైతులు దిల్లీ పొలిమేరల్లో ఆందోళన దిగినప్పుడు వారిని తీవ్రవాదులు అన్న విషయం ప్రజలకు గుర్తు లేదనుకోలేం కదా! అప్పులు తీసుకుని చెల్లించని వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది కనక ఆ లోటును ఎదుర్కోవడానికి కొన్ని నిధులు పక్కన పెట్టుకోవాలని సాక్షాత్తు రిజర్వూ అన్ని బ్యాంకులను ఆదేశించింది. జనం తమ రోజువారీ ఖర్చులు భరించడానికి నగలు తాకట్టు పెడ్తున్నారు. వేదాంత్ అనే ఓ సీబీఎసఈ విద్యార్థికి భౌతికశాస్త్రంలో తాను అనుకున్న దానికన్నా తక్కువ మార్కులు వచ్చాయి. ఆయన తాను రాసిన జవాబు పత్రాన్ని చూపించాలని అభ్యర్థించారు. చూపించనైతే చూపించారు కాని అది ఆయనది కాదు. ఇదేమిటి అని అడిగినందుకు ఆ విద్యార్థి పాకిస్థానీ అని ముద్ర వేశారు. ఇంతగా బెదరగొడ్తుంటే జనం నోరెలా తెరుస్తారు? ఓ ప్రభూ మీరు ధరలు పెంచుతూ ఉండండి. మేం మీకు అండగా ఉంటాం అని జనం వీధులకెక్కి నినాదాలు చేసే రోజులు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాకు మార్గం సుగమం కావొచ్చునని సోమవారం వార్తలొచ్చాయి. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గొచ్చు. కానీ ప్రభుత్వం పెట్రోల్, డీసెల్ ధర తగ్గిస్తుందన్న భరోసా లేదు. ఎందుకంటే పెట్రోల్, డీసెల్ వ్యాపారులు, కంపెనీలు బాగా నష్టపోతున్నాయని ప్రభుత్వమే కంటతడి పెట్టుకుంటోంది. పశ్చిమాసియా పరిస్థితి దృష్ట్యా ఇంధనం, రసాయనిక ఎరువులు, విదేశీ మారక ద్రవ్య నిలవలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు.అయితే జనాన్ని భయపెట్టకండి అని కూడా అంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయని భరోసా ఇస్తున్నారు. దీని ఆంతర్యం ఆమెకే తెలియాలి. మన్మోహన్‌సింగ్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి అని చెప్తే బీజేపీ నాయకులు ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షం ఆ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. విదేశీ ఒత్తిడులను ఎదుర్కుంటూనే అభివృద్ధి సాధించే రీతిలో విధానాలు రూపొందిస్తున్నాం అన్న నిర్మలా సీతారామన్ మాట నమ్మాల్సిందేగా! చమురు కంపెనీలకు ప్రతి రోజూ వెయ్యి కోట్ల రూపాయల నష్టం వస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌పురి అంటున్నారు.ఇంకో వేపు ప్రభుత్వరంగ చమురు కంపెనీల నికర లాభం 41 శాతం పెరిగిందంటున్నారు. ఈ రెండు వార్తల్లో ఏది నమ్మాలో జనమే తేల్చుకోవాలి. మరి పది రోజులకన్నా తక్కువ సమయంలో పెట్రోల్, డీసెల్ ధరలు ఇంతగా పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది. పెట్రోల్ లీటరు 500 కైనా కొంటాం బీజేపీకి ఓటేస్తాం అన్న జనం దండిగా ఉన్న దేశం మనది!!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు