- కిలో రూ.3 మించని వైనం
- గుజ్జు పరిశ్రమల సిండికేట్
- సమీక్షలకే పరిమితమైన పాలకులు
- ఆందోళనలో మామిడి రైతు
విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం 3 రూపాయలకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల (పల్ప్ ఇండస్టీస్) నిర్వాహకులు సిండికేట్గా మారడంతోనే రైతులకు ఈ దుస్థితి దాపురించింది. కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించి తోతాపురికి కిలోకు రూ.8 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా… పరిశ్రమల యాజమాన్యాలు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. పాలకులు మాత్రం ఏసీ గదుల సమీక్షలకే పరిమితమై కాలం గడుపుతుండటంతో, క్షేత్రస్థాయిలో మామిడి రైతు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగవుతోంది. గతేడాది జిల్లాలో 6 లక్షల టన్నుల దిగుబడి రాగా… ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల దిగుబడి 5 లక్షల టన్నులకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సాగు ఖర్చు దాదాపు రూ.35 వేల వరకు అవుతోంది. గతేడాది ఎకరాకు 6 టన్నుల దిగుబడి రాగా… ఈ ఏడాది అది 4 నుంచి 5 టన్నులకు పడిపోయింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, దిగుబడి తగ్గిన తరుణంలో కిలో మామిడికి కనీసం రూ.10 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. అలాంటిది మార్కెట్ ధరలు చూస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవు. మామిడిని తోట నుంచి తరలించాలంటే టన్నుకు రూ.2,500 వరకు రవాణా ఖర్చవు తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 గుజ్జు పరిశ్రమలు ఉండగా… ప్రస్తుతం 33 పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. ఇవి కూడా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకపోవడంతో రైతులు పరిశ్రమల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కో రైతు సగటున రెండు రోజుల పాటు ఫ్యాక్టరీల ముందే నిరీక్షిస్తున్నాడు. మరోవైపు గుజ్జు పరిశ్రమల వారు కొనుగోలు చేసిన మామిడికి నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. చేతిలో పైసలు లేక, అప్పలవాళ్ల ఒత్తిడి భరించలేక రైతులు విధిలేక తక్కువ ధరకైనా స్థానిక ర్యాంపులను ఆశ్రయిస్తున్నారు. దీనిని అదనుగా తీసుకుంటున్న ర్యాంపుల నిర్వాహకులు ధరలను రూ.3కి పడేసి రైతుల రక్తాన్ని పిండుకుంటున్నారు.
పాలకుల మాట నీటిమూటలేనా?
గత ఏడాది తోతాపురికి కిలోకు రూ.12 మద్దతు ధరగా నిర్ణయించారు. ఇందులో పరిశ్రమల వారు రూ.8 చెల్లించాలని, మిగిలిన రూ.4లు ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ గుజ్జు పరిశ్రమల వారు సీఎం మాటను సైతం ఖాతరు చేయకుండా కిలోకు రూ.5 నుండి రూ.6 మాత్రమే చెల్లించారు. గతేడాది ప్రభుత్వం రూ.187 కోట్లు సబ్సిడీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలామంది రైతులకు ఆ సబ్సిడీ బకాయిలు అందలేదు. ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గినందున, తాము బ్రతకాలంటే కిలోకు రూ.12 నుండి రూ.16 వరకు ధర చెల్లించాలని తోతాపురి రైతులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. చెమటోడ్చి పండించిన పంటను రోడ్లపై పారబోయలేక, పరిశ్రమల సిండికేట్ మాయాజాలంలో చిక్కుకుని కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కేవలం కాగితపు సమీక్షలు పక్కనబెట్టి కళ్లు తెరవాలి. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని, ఈ ఏడాది కిలోకు రూ.16 మద్దతు ధర దక్కేలా చూడాలని, బకాయి ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేసి మామిడి రైతును ఆదుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.


