దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా ప్రజా పోరాటాలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రాత్మక పోరాటాలుగా మారుతున్నాయి. అధికార పార్టీ ఉక్కిర్ఙిక్కిరి అవుతోంది. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పౌర సమాజం చేసిన నిరసన పాలకులకు ముచ్చెమటలు పట్టించింది. ఆ ఒత్తిడి నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతకాలం తమ నిర్ణయాలకు ఎదురేలేదని భావించిన అధికార పక్షం ఆత్మరక్షణలోకి జారుకుంది. ఇప్పుడు “బద్లావ్ జరూరీ హై” (మార్పు అవసరం) అనే నినాదం ఊపందుకుంది. పుష్కర కాలంగా మన దేశంలో అమలవుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలపై సామాన్య ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిబింబమే ఇప్పుడు మన ముందుకు వస్తున్న పోరాటాలు. ఇందులో అంతర్భాగమే ఈ నినాదం. తమ వల్లనే దేశం అనేక రంగాల్లో ముందడుగేసిందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, డిజిటల్ సేవల్లో ప్రగతి సాధించామని, అంతర్జాతీయంగా భారతదేశం ప్రతిష్ఠ పెరిగిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఇదే సమయంలో దేశంలో తీవ్రమైన నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు, సామాజిక అసమానతలు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ రెండు భిన్న దృక్కోణాలను చూస్తున్న ప్రజలు నిజానిజాలను తమ నిజ జీవిత అనుభవాల నుంచి సమీక్షించుకోవడం మొదలుపెట్టారు. పాలకుల మాటల్లోని అసత్యాలను గుర్తిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యో గాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ రాజకీయ చర్చలో ప్రధానంగా ఉంటోందంటే ఇందుకు నిరుద్యోగ సమస్య తీవ్రతే కారణం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షలాది ఉద్యోగాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. నియామక ప్రక్రియలో జాప్యం, పరీక్ష పేపర్ల లీకేజీలు, కోర్టు కేసులు యువత జీవితాలను అస్థిరం చేశాయి. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ నియామకాలు పెరగడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఫలితంగా చదువుకున్న యువతలో నిరాశ, నిస్పృహ పెరిగిపోతున్నాయి. నిరుద్యోగ సమస్య నేటి యువతరం భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ప్రశ్నగా మారింది. ప్రభుత్వ విధానాల కారణంగానే తమకు ఈ దుస్థితి వచ్చిందనే వాస్తవాన్ని గ్రహించి తెగించి పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఇటీవల జంతర్‌మంతర్ వద్ద జరిగిన పోరాటాల్లో నిరుద్యోగ యువత భాగస్వామ్యం ద్వారా వెల్లడైంది. కొన్నేళ్లుగా నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, వంటనూనె, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ఇల్లు నడవడమే కష్టంగా మారుతోంది. అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణమని, ముడిచమురు ధరల పెరుగుదల, యుద్ధాల వలనే ఈ ఇబ్బందులని ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ దేశీయంగా పన్ను భారం, నిల్వలు, సరఫరాపై ప్రభుత్వ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా లేవనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తమ నెలవారీ ఖర్చుల్లో ఆహారం, ఇంధనం కోసం వెచ్చించే ఖర్చు గణనీయంగా పెరిగినట్టు ప్రతి కుటుంబం భావిస్తోంది. ఈ ఖర్చు ప్రతి నెలా పెరుగుతూనే ఉండేసరికి పొదుపు చేసుకునే అవకాశమే లేకుండా అప్పుల ఊబిలోకి జారుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగ పరిస్థితి ఇదే తరహాలో ఉంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు ఉద్యమం చరిత్రలో మైలురాయిగా నిలిచింది. చివరికి ప్రభుత్వం తల వంచి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నా, రైతుల ప్రధాన డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలే దేశంలో అధికం కాబట్టి ఈ ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మరో చర్చనీయాంశం. విమానాశ్రయాలు, ఓడరేవులు, బీమా, బ్యాంకింగ్, రైల్వేలోని కొన్ని సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యం, పెట్టుబడుల ఉపసంహరణ వేగంగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వం దీన్ని నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడిలో పెట్టే సంస్కరణగా, సామర్థ్యాన్ని పెంచే చర్యగా చెబుతున్నా, ప్రజలు తాము దశాబ్దాలుగా కట్టిన పన్నుల ద్వారా రూపొందిన ప్రజా ఆస్తుల అమ్మకంగానే భావిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని, సేవల ధరలు పెరుగుతాయని, సామాజిక బాధ్యత గల రంగాలు నిర్లక్షాయూనికి గురవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నాలుగు కొత్త కార్మిక చట్టాలను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ చట్టాలు వ్యాపారాల్ని సులభతరం చేస్తాయని పాలకులు అంటున్నా, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సంఘాలు పెట్టుకునే హక్కు, పని గంటలు వంటి అంశాలపై ప్రభావం పడుతుందనేది కార్మికవర్గ ఆందోళన. దేశ భవిష్యత్తుకు పునాది అయిన విద్య, వైద్య రంగాల అభివృద్ధి తమకు సంబంధం లేని అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ జీడీపీలో విద్య, ఆరోగ్యానికి కలిపి చేస్తున్న కేటాయింపులు కేవలం 3, 4 శాతం మధ్యన ఉండడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ పాఠ శాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం అనే మాట పాలకుల గొంతు నుంచి వినిపించడమే లేదు. నిత్యం ప్రభుత్వ పాఠశాలల మూసివేత జరుగుతూనే ఉంది. వైద్యరంగం ప్రైవేటు, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి చేరి అతిపెద్ద వ్యాపార రంగంగా మారింది. విద్య, వైద్యం కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి.12 ఏళ్లుగా పేద, ధనిక అంతరం విస్తరించిందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు, వివక్ష సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తి, జీఎస్‌టీ వాటా విడుదల, కేంద్ర నిధుల కేటాయింపు, రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భావప్రకటన స్వేచ్ఛ విషయంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం ర్యాంకు పడిపోయింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులపై దేశద్రోహం, యూఏపీఏ వంటి చట్టాల కింద కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా కొన్ని కార్పొరేట్ సంస్థలకే లాభాల పంట పండుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎన్నికల కమిషన్ సహా అనేక రాజ్యాంగ సంస్థలను పాలకులు తమ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మరికొన్ని దర్యాప్తు సంస్థలను తమకు గిట్టని రాజకీయ పార్టీల నేతలపై ప్రయోగించడం నిత్యకృత్యమైనట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కీలకమైన విదేశాంగ విధానం కూడా విమర్శలకు తావిస్తోంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉండగా, కొత్తగా శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలతోనూ భారత ప్రభావం తగ్గిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ “బద్లావ్ జరూరీ హై” నినాదాన్ని ప్రజల్లోకి తెచ్చింది. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు బదులుగా ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన, రైతు సంక్షేమం, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రత్యామ్నాయ విధానాల అవసరాన్ని నొక్కి చెబుతూ దేశవ్యాప్తంగా చర్చకు పెడుతోంది. ప్రజలంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తే మార్పు తథ్యం.
సెల్ : 9059837847
బద్లావ్ జరూరీ హై! ఎందుకు ?
- Advertisement -


