ఏకే శ్రీవాత్సవ
బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న ఎన్నికలలో యువనాయకులు కీలకపాత్ర పోషించనున్నారు. 243 మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో పోలింగ్ జరగనున్నది. ప్రస్తుతం 132 సీట్లతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఎన్డీయే ప్రధాన భాగస్వాములు బీజేపీ 78, జనతాదళ్ (యునైటెడ్) 45మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాయి. ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటన 110 సీట్లను కలిగివుంది. రానున్న ఎన్నికలలో ఎన్డీయేకు ఇండియా ఐక్యసంఘటన బలమైన పోటీదారుగా ఉన్నది. లాలు ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జేడీ 75 సీట్లతో బీజేపీకి అతి సమీపంలో ఉంది. రానున్న ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలను ఆర్‌జేడీ తలక్రిందులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానితో 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అంతగా రాణించలేదు. రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకర్షణ క్షీణించిందని ఇప్పటికే భయపడుతున్న బీజేపీ ఈ ఎన్నికలలో ఎలాగైనా సంతృప్తికర ఫలితాలను సాధించేందుకు ఇప్పటి నుంచే సర్వశక్తులు ఒడ్డుతోంది.
బీహార్ రాజకీయ దృశ్యంలో కనిపించే ఒక ఆసక్తికరమైన దృగ్విషయం యువ నాయకుల ప్రవేశం. ఆర్‌జేడీకి చెందిన తేజస్వీ యాదవ్ (35), లోక్‌జనశక్తి పార్టీ (రాంవిలాస్ పాశ్వాన్) నేత చిరాగ్ పాశ్వాన్ (42), ఎన్నికల వ్యూహకర్త, నూతనంగా జనసూరజ్‌పార్టీ (జేఎస్‌పీ)ని ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిశోర్ (48) యువత, కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఈ నాయకులు కీలకంగా మారారు. బీహార్ రాజకీయాలలో గత కొన్ని దశాబ్దాలుగా లాలు ప్రసాద్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆసక్తికరంగా, నితీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ (49) కూడా ఇటీవలి నెలల్లో తన ఉనికిని చాటుకున్నాడు, అయినప్పటికీ తన తండ్రి ప్రాముఖ్యతను ఆయన సూచిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన నితీశ్ కుమార్ రాజకీయ వారసుడు కాబోతున్నారనే సందేశం ఎవరికీ అర్థం కాలేదు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు, మనుగడ సాగించడంలో బీహార్ మద్దతు చాలా కీలకం. బీజేపీకి దక్షిణ భారతదేశం ఎన్నడూ బలమైన కోటగాలేదు. నేడు కూడా అదే పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవిని ఆశించే వ్యక్తిననే ముద్రను ఏనాడు పోనివ్వలేదు. హిందీ భాష ఎక్కువగా మాట్లాడే బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశం నుంచి మద్దతు లభిస్తుండటం వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ బీజేపీకి బలమైన కోట అయినప్పటికీ, బీహార్ రాజకీయాలు కాషాయ పార్టీకి అంతగా మద్దతు ఇవ్వడం లేదు. బీజేపీ, ఆర్‌జేడీ మధ్య పోటాపోటీగా ఉన్న సీట్ల సంఖ్య ఇందుకు స్పష్టమైన సూచిక. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే బీహార్‌లో బీజేపీ గతంలో కంటే మెరుగ్గా రాణించి తీరాలి.
బీహార్ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే అధికారం చేపట్టేందుకు ఏ ఒక్క పార్టీకి ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీరాదని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, ఎన్నికల అనంతర రాజకీయ పొత్తులే ఏకైక ఎంపిక. నితీశ్ కుమార్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆపారమైన చతురతను ప్రదర్శించారు, తనకు అనుకూలంగా ఉండేవిధంగా రెండు వైపులా పొత్తులు ఏర్పరచుకున్నారు, ఏ సందర్భంలోనైనా తానే అధికారంలో ఉండేలా చూసుకున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పోలిస్తే బీజేపీకి అత్యధిక సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ, బీహార్‌లో బీజేపీి తన ముఖ్యమంత్రిని నియమించుకోలేకపోయింది. ఇది నితీశ్ కుమార్‌ను ఒక చాకచక్యమైన, బలీయమైన రాజకీయ నాయకుడిగా చేస్తోంది, ఆయనను బీజేపీ మాత్రమే విశ్వసించగలదు గత కొన్ని సంవత్సరాలుగా వారి భాగస్వామ్యం ఈ విషయాన్ని నొక్కి చెపుతోంది. ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న కుయుక్తుల్లో భాగంగా బీజేపీ ఎన్నికల ముందు దిల్లీలో అనుసరించిన ఎత్తుగడలనే ఇక్కడ కూడా అనుసరించవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను అరెస్టు చేసి జైళ్లో పెట్టవచ్చునని ఆందోళన చెందుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టడం తమకు అనుకూలంగా మారిందని భావించిన బీజేపీ ఇప్పుడు బీహార్‌లో కూడా అదే వ్యూహం అనుసరించేందుకు పావులు కదుపుతోంది. అయితే, బీహార్‌లో ఈ వ్యూహాన్ని పునరావృతం చేయడం వల్ల బీజేపీకి ఎదురుదెబ్బ తగలవచ్చు, ఎందుకంటే కేజ్రీవాల్ లాగా బీజేపీ, మోదీపై తేజస్వి విమర్శలు చేయడంలో అంత కఠినంగా లేడు. తేజస్వికి సానుభూతి కూడా లభించవచ్చు, ఈ వ్యూహం వల్ల బీజేపీకి అవకాశాలు 50-50 శాతం ఉండవచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలలో జరిగినట్లుగా బీహార్‌లో కూడా బీజేపీ తన యువ నాయకులకు ప్రాధాన్యతనివ్వాలి. వృద్ధ నేతలపైనే ఆధారపడటం అగ్ర నాయకత్వ అభద్రతాభావమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.