రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సెల్: 9440222117
అచ్చియబుట్టిందిబూమికి బలుశబ్బ రైణా దానెమ్మ సోణిది సూడెం
పచ్చినూకలు నేలాబడితె దీనబ్బడేలు బిచ్చచేశిడిశ బిరుదుబంట్ల //అచ్చియ//
మందలు గదిలె పడమటిశీమ కెగబడి కందువేశిరిగా శెక్కర్రూక్కుపండేశ
అందులో సాంకోలేకమ్మేశిరే బిడల కుందనంబుపైడి కూట్నీళ్లకెలబాయె //అచ్చియ//
శెట్టుమీదపచ్చులట్టు తలేలేశ సుట్టుదొంగలు వగ తట్టగ్గిదేవర
గట్టిగా బీదోల్లకుకలబందేగా కూడు బట్టమరకేడ దిప్పటి యాడమాసులకు //అచ్చియ//
ఆలు మొగుడు గూడేదదివోరో బగుదెగి చం సాలావుడకాడించే సప్పంనారాఝ్జాలు
sTÖలో నాయేనుగోపాలుని దయసెత కాలవరుసము గురిశ కరువుదెలిశగాక //అచ్చియ//
సారంగపాణి క్రీ.శ.19వ శతాబ్దం నాటి కవి. ఆయన తాళ్లపాక అన్నమాచార్యులు లాగే పదకవి. రాయలసీమ లోని కార్వేటినగరవాసి. కార్వేటినగరంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. సారంగపాణి కృష్ణభక్తుడు. అన్నమయ్య పదాలు వేంకటేశ్వరుని సంబోధిస్తూ ఉన్నట్లుగా సారంగపాణి పదాలన్నీ వేణుగోపాలుని సంబోధిస్తూ ఉంటాయి. ఆయన భక్తుడైనా, ఆయన పదాలు భగవంతుని ఉద్దేశించి చెప్పినవే అయినా, పదాలలో పందొమ్మిదో శతాబ్దంనాటి సమాజమే ప్రతిఫలిస్తుంది. తన కాలపు సమాజంలోని సాంఘికాం శాలనే వర్ణిస్తూ, చివర్లో వేణుగోపాలునితో ముడిపెట్టి పదాన్ని ముగిస్తాడు. సామాజిక సమస్యలను చిత్రించి దానికి పరిష్కారం స్వామి అనుగ్రహం అని చెప్పడం ఆయన పద్ధతి. భక్త కవుల పద్ధతే అది. సారంగపాణి రాయలసీమ కవి గనుక, ఆయన సమకాలీన సమాజ చిత్రణేచేశాడు గనుక, ఆయన పదాలలో సాధారణాంశాలతోపాటు, రాయలసీమ నిర్దిష్టాంశాలు కూడా ప్రతిబింబించాయి. రాయలసీమ పందొమ్మిదో శతాబ్దం నాటికే తీవ్రమై కరువు ప్రాంతంగా మారిపోయింది. ప్రతి రెండేళ్లకే ఒకసారి కరువు రాయలసీమ తలుపు తట్టడం అప్పటికే మొదలైంది. సారంగపాణి పదాలలో రాయలసీమ కరువు కూడా వర్ణితమైంది. అలాంటి ఒకపదమే “అచ్చియవచ్చింది” అనేది. అచ్చియ అంటే అక్షయ అని. అక్షయనామ సంవత్సరంలో వచ్చిన కరువును ఈ పదంలో వర్ణించాడు సారంగపాణి.
ఈ అక్షయనామ సంవత్సరం పందొమ్మిదో శతాబ్దంలో 1806 లో ఒకసారి, 1886 లో ఒకసారి వచ్చింది. సారంగపాణి 1800 వ సంవత్సరంలో పుట్టినట్లు సాహిత్య చరిత్రకారులు చెబుతున్నారు. అది నిజమైతే 1806 నాటికి ఆయన ఆరేళ్ల చిన్నవాడు. బుడిబుడి నడకలు నడుస్తూ ఉంటాడు. 1866 నాటికి ఆయన బాగా పెద్దవాడు అయ్యాడు. పుష్కలమైన జీవితానుభవం వచ్చి ఉంటుంది. కరువును అర్థం చేసుకోగల పరిస్థితి ఉంటుంది. అందువలన ఈ పదం లోని అక్షయనామ సంవత్సరం 1866 నాటిది అని చెప్ప వచ్చు. వలస పాలనకాలంలో 187072 మధ్య రాయల సీమను పీల్చిపిప్పి చేసిన ధాతకరువుకన్నా ముందటి కరువు అక్షయకరువు. ధాత కరువు, పెద్ద కరువు (187678) వంటి మహా కరువులకు ముందు వచ్చినది అక్షయకరువు. ఈ పదంలో వర్ణించిన కరువును చదువుతుంటే గగుర్పాటు కలుగుతుంది. ఇంక తర్వాత వచ్చిన కరువులు మరెంత భయంకరమైనవో ననిపిస్తుంది.
“ఎంతమంచిధాతకరువొచ్చెరన్నా” అనే పాటలో అక్షయకరువు పాటలోని కష్టాలు మరింత తీవ్రమైనట్లు వర్ణించారు జానపదులు. రాయలసీమలో పిలిస్తే పలికేది కరువు అని ‘శ్రీసాధన’ పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యులన్నారని అంటారు.
సారంగపాణి వర్ణించిన కరువు నాటికి భారతదేశంలో వలసపాలన స్థిరపడింది. ఆధునిక విద్యావ్యవస్థ వచ్చింది. భారతీయులు వలసపాలనను వ్యతిరేకించడం కూడా మొదలయింది. వలస పాలకులు రాజకీయంగా దేశాన్ని ఆక్రమించుకోవడమేగాక, దేశ ప్రజల మీద తమ ఆర్థిక సాంస్కృతిక ప్రభావం చూపడం బలపడుతున్నాయి. సంఘసంస్కరణోద్యమం కొనసాగుతున్నది. ఆ సమయంలో వచ్చిన ఒకానొక కరువును సారంగపాణి వర్ణించాడు. ఈ పదంలో కవి వర్ణించిన కరువు ఇది. అక్షయనామ సంవత్సరం వచ్చింది. వస్తూవస్తూ చెడ్డ కరువును వెంటబెట్టుకుని చచ్చింది. ఇలాంటి కరువును ఇంతకుముందు ఎప్ప్పుడూ చూడలేదు. పచ్చినూకల్ని నేలమీద చల్లితే అది పెద్ద రైతలను కూడా బిచ్చగాళ్లను చేసేసింది. పశువులకు మేతలేక, వాటిని పడమటి గడ్డకు తోలుకుపోయారు. కందిపంట వేస్తే అది కరువుకు ఎండిపోయింది. పేదవాళ్లు బిడ్డల్నిచాకలేక జరుగుబాటున్న వాళ్లకు అమ్ముకున్నారు. పడిబంగారాన్ని కూటినీళ్లకు (అతి తక్కువధరకు) అమ్ముకున్నారు. దీనికి తోడు దొంగతనాలు, అగ్నిప్రమాదాలు. కటిక పేదవాళ్లకు కలబందే దిక్కై పోయింది. ఆడవాళ్లకు ఎంతగా మాసిపోయినా కట్టుకున్నే గుడ్డలే దిక్కు. మారుగుడ్డలు లేవు. ఆఖరికి భార్యాభర్తలు ఆనందించడమే అరుదైపోయింది. చప్పన్నారు దేశాలూ ఈ కరువులో అవస్థలు పడ్డాయి. ఈ లోపల వేణుగోపాల స్వామి దయ వల్ల వర్షం కురిసింది. అప్ప్పుడు జనానికి కరువంటే ఏమిటో తెలిసింది.
ప్రాచీన తెలుగు కవుల్లో బహుశా ఆఖరికవి సారంగపాణి. 1899లో కట్టమంచి రామలింగారెడ్డి “ముసలమ్మ మరణం” కావ్యం రాశారు. అది అధిక వర్షపాతం వర్ణన చేసింది. అయితే కథ 16వ శతాబ్దం నాటిది. సారంగపాణి పదం వచ్చిన తొంభైయేళ్లకు విద్వాన్ విశ్వం “1956లో పెన్నేటిపాట” రాశారు ఇదీ కరువు కావ్యమే. సారంగపాణి పదంలో వస్తువుఎంత స్థానికమో, భాష కూడా అంతే స్థానికం. వాడుక భాష తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించక ముందే సంప్రదాయ కవిత్వం వాడుకభాషలో ఉండడం విశేషం. అన్నమయ్య పదాలలోనూ వాడుక భాష ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనల ‘జాను తెనుగు’ సంప్రదాయానికి చెందిన ఆఖరు కవి సారంగపాణి. బలుశబ్బర అంటే చాలా చెడ్డది అని అర్థం. ఐణా అంటే అయినా, దానెమ్మ సోణి, దీనెబ్బడాల అనేవి తిట్టు మాటలు. నిష్టూరపు మాటలు. అబ్బకు ఆలి అబ్బడాలి. దీనెమ్మ అనేదానికి మరోరూపం. సాంకోలేక అంటే చాకలేక, పోషించలేక. బిరుదు బంట్లు అంటే పెద్దవాళ్లు. కూట్నీళ్లు కూటి నీళ్లు అంటే చాలా తక్కువ ధర. తలేలేశ అంటే తలలు వేలాడేసింది అని అర్థం. ఆడమాసి అంటే ఆడమనిషి, స్త్రీ. కొన్నింటిలో రూపాలు అర్థం కావలసే ఉంది.
ఈ కరువు పదంలో కరువు వలన పంటలూ, పశువులకు వచ్చిన బాధలు ఒక పార్శ్వమైతే, మానవ సంబంధాలకు వచ్చిన కష్టం మరో పార్శ్వం. భూమిలో విత్తనాలు కరువులో మొలకెత్తక రైతులు నష్టపోవడం, పశువులకు మేతలేక వేరే ప్రాంతానికి తోలుకుపోవడం, కందిపంట కూడా ఎండిపోవడం, బంగారును తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం` వంటివి భౌతిక ఆర్థిక సమస్యలు, బిడ్డలను చాకలేక అమ్ముకోవడం, ఆడవాళ్లకు మారుకోక లేకపోవడం, తినడానికి తిండి లేక పేదలు కలబందనే తినవలసి రావడం వంటివి కరువు సృష్టించిన తీవ్రమైన సమస్యలు. అన్నిటికన్నా కఠినమైన బాధ భార్యాభర్తలకు ఏకాంత జీవితం లేకపోవడం. ప్రపంచీ కరణ పడకటింటిలోకి కూడా వచ్చిందంటారు కుప్పిలి పద్మ ఒక్కకథలో. ప్రపంచీకరణ కన్నా శతాబ్దం క్రితమే కరువు రాయలసీమ పడకటింట్లోకి వచ్చిన వాస్తవం ఈ కరువుపదంలో కనిపిస్తుంది. కరువుదొంగల్ని సృష్టించడం, వేసవిలో అగ్నిప్రమాదాలు జరగడం అదనపు సమస్యలు. “పెన్నేటి పాట” లో వరసకరువుల వల్ల ధనికుడైన రైతు నారపరెడ్డి, అప్ప్పులు పెరిగిపోయి, వాటిని తీర్చలేక ఉన్నదంతా అమ్మేస్తాడు. అప్ప్పుడు నారపరెడ్డి నారప్ప అయ్యాడు. ఈ కరువు పదం బిరుదుబంట్లను కూడా బిచ్చగాళ్లు అయిపోయినట్లు చెబుతుంది. ఆర్థికస్థితి సాంఘికహోదాకు గల సంబంధం ఇలాఉంటుంది. కరువుతో జనం విలవిలలాడుతుండగా ఆఖరికివర్షం కురిసింది. అది వేణుగోపాలస్వామి దయ అంటాడు కవి. శాస్త్రీయదృష్టితో చూస్తే కరువు ప్రకృతి పరిణామమే. మానవ తప్పిదం కూడా కారణం అవుతుంది. వాన కురవడం కూడా ప్రకృతి పరిణామమే. అందులో ఏ ఇతర శక్తి ప్రమేయం ఉండదు. కవి భక్తుడుగనుక సహజంగా కురిసిన వాన స్వామి దయగా భావించాడు. కరువువలన బాధపడిన వాళ్లంతా భక్తులేకదా! వాళ్లకు కష్టమెందుకు రావాలి?
కాల వర్షం కురిసింది అన్నకవి వెంటనే కరువు తెలిసింది అనడం చమత్కారంగా ఉంది. కరువుతీరా అనుభవించినాక వర్షం వచ్చినప్ప్పుడు జనానికి వర్షమంటే ఏమిటో తెలిసింది అనంటే సహజంగా ఉండేది. సారంగపాణి ఈ వరుసను ముందు వెనుక చేశాడు. జనం వానలో తడుస్తూ ఇన్నాళ్లూ పడిన కరువు కష్టాలను తలచుకున్నారని కవి హృదయంగా అర్థం చేసుకోవాలి. అన్నమయ్య, ధూర్జటి, శ్రీకృష్ణదేవరాయలు వంటి పూర్వ కవులు కొంత కరువును, కొంత వేసవి ప్రభావాన్నీ వర్ణించారుగానీ, సారంగపాణి పదం మాత్రం కఠినమైన కరువునే చిత్రించింది. దీని తర్వాత కొన్ని జానపద గేయాలు రాయలసీమ కరువును చిత్రించాయి. ఇది ఆధునిక కాలంలో ‘పెన్నేటిపాట’, ‘రాయలసీమ రైతు’ వంటి కావ్యాలకు, ‘గంజికోసరం’ వంటి కథలకు మÖలాలున్నాయి. రాయలసీమ కరువు తెగిపోని దారం వంటిది.


