Homeవిశ్లేషణరెండు దేశాల ఏర్పాటు సరైన పరిష్కారం

రెండు దేశాల ఏర్పాటు సరైన పరిష్కారం

- Advertisement -

టి.వి.సుబ్బయ్య

యూదులు`అరబ్‌లు కలిసిమెలిసి పలస్తీనా సమస్య పరిష్కారంకోసం పోరాటాన్ని నిర్వహించేందుకు స్పష్టమైన రాజకీయ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. దాడులను తక్షణం నిలిపి బందీలను, జైలులో ఉన్నవారిని విడుదల చేయడానికి రెండు రాజ్యాల ఏర్పాటు ఆధారంగా పరిష్కారంకోసం డిమాండ్‌ చేస్తున్నారు

దీర్ఘకాలంగా స్వతంత్ర పలస్తీనా కోసం పోరాటం జరుగుతూనే ఉంది. గత రెండు నెలలుగా అమెరికా, నాటో దేశాల అన్ని రకాల సహాయసహకారాలతో ఇజ్రాయిల్‌ పలస్తీనాలో భాగమైనా, గాజాస్ట్రిప్‌ ప్రజలపై క్షిపణులు, బాంబుల దాడులతో గతంలో ఏనాడూలేని మారణకాండ జరుపుతోంది. దాదాపు 65వేల మందిని పిల్లలు, మహిళలు, అనే విచక్షణ లేకుండా హతమార్చారు. అనేక లక్షల మందిని ఇతర నిర్బంధ ప్రాంతాలకు తరలించి హింసిస్తున్నారు. గాజాని పూర్తిగా ధ్వంసం చేశారు. కొన్ని లక్షలమంది మాత్రమే గాజా స్ట్రిప్‌లోని కొద్ది ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరికి ఆహారం, నీరు, ఆరోగ్య సదుపాయాలు, విద్యాలయాలు, అందుబాటులో లేవు. గాజాను పూర్తిగా ఖాళీచేయించి ఆ ప్రాంతాన్ని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు అప్పగించేందుకు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు సిద్ధపడ్డాడు. ట్రంప్‌ ఆ ప్రాంతంలో రిసార్టులు కట్టుకుని ఊరేగుదామనుకుంటున్నాడు. ఈ దారుణ పరిస్థితులపైన ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి అడెల్‌ అమీర్‌ 2025, జులై 20 వ తేదీన జో హదెరీచ్‌ దినపత్రికలో రాసిన వ్యాసంలోని ముఖ్య అంశాల సారాంశమిది.
గాజా ప్రాంతంలో క్రూరమైన మారణకాండను ఇజ్రాయిల్‌ జరపడం మరింత పెరిగింది. ఇజ్రాయిల్‌పలస్తీనా మధ్య అంతర్జాతీయ న్యాయచట్టం ప్రకారం రెండుదేశాల ఏర్పాటు మాత్రమే సరైన పరిష్కారమవుతుంది. పశ్చిమాసియాలో వివిధ దేశాలమధ్య సాయుధ సంఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని ఘర్షణల్లోనూ పలస్తీనాపైన క్రూరమైన దాడులే అతిపెద్ద సమస్య. ఇంతవరకు గాజా స్ట్రిప్‌లో 75శాతం ప్రాంతం ధ్వంసమైపోయింది. పలస్తీనా సమస్య పరిష్కారం రోజురోజుకూ కష్టతరమైంది. సమస్య ఎంతో క్లిష్టతరంగా ఉంది. శాంతియుతంగా పరిష్కారం జరగడానికి ట్రంప్‌, నాటో దేశాలు సహకరించాలి. అయితే ఈ ధోరణి తొలి నుంచీ లేదు. ఇజ్రాయిల్‌ సమాజంలో పశుత్వం, క్రూరత్వానికి మితవాద ప్రభుత్వం పాల్పడుతోంది. పలస్తీనాలోని మరో భాగం వెస్ట్‌ బ్యాంకు, పొరుగునున్న సిరియాపైన కూడా ఇజ్రాయిల్‌ దాడులకు సిద్ధమవుతోంది. పలస్తీనా సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌ కూడా పలస్తీనాకు తోడ్పాటు ప్రకటించింది. పలస్తీనాకు మౌలికమైన, న్యాయమైన హక్కు ఉంది. స్వయం నిర్ణయ అధికారంతో స్వతంత్ర దేశంగా మనుగడసాగించే హక్కు పలస్తీనాకు ఉంది. పలస్తీనాకు సహజ సిద్ధంగా ఉన్నహక్కును పరిరక్షించేందుకు వివిధరకాల ప్రతిపాదనలు ఇజ్రాయిల్‌ ముందు ఉంచారు. ఇజ్రాయిల్‌కు గల గూఢమైన ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి. పలస్తీనా ప్రజలపైన ఇజ్రాయిల్‌ విజయం పొందాలని శతవిధాలుగా దాడులు సాగిస్తోంది. గాజా స్ట్రిప్‌ నుంచి అక్కడున్న 23లక్షలమందిని ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయిల్‌ నిర్ణయించింది. ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని అణచివేసి రెండు రాజ్యాలు ఏర్పాటు చేయడమే న్యాయమైన పరిష్కారమవుతుందని కొన్ని దేశాలు బహిరంగంగానే ప్రకటించాయి. పలస్తీనా స్వతంత్రదేశంగా ఏర్పాటు జరిగితే అంతర్జాతీయ న్యాయమైనదిగా పరిగణిస్తారు. 1947 నవంబరులో విభజన ప్రణాళిక (ఇజ్రాయిల్‌, పలస్తీనాగా రెండు రాజ్యాల ఏర్పాటు) ఆధారంగా మాత్రమే పరిష్కారం సాధ్యమవుతుంది. 1967జూన్‌ 4వ తేదీన నిర్ధారించిన సరిహద్దుల లోపల స్వతంత్ర పలస్తీనా నెలకొల్పేందుకు 1947 నవంబరులో రూపొందించిన ప్రణాళికలో భాగంగా సమస్య పరిష్కారమవుతుంది. ఈ పరిష్కారాన్ని పలస్తీనా ప్రజలు, ఆ దేశ చరిత్రాత్మక నాయకత్వం అంగీకరించాయి. పదేపదే రెండు రాజ్యాల స్థాపన పరిష్కారానికి అంగీకారం కుదిరినప్పటికీ ఆచరణలో అమలు జరగలేదు. ఏ మాత్రం వాస్తవంకాని ప్రతిపాదనలను వెల్లడిచేస్తున్నారు. ఈ ప్రతిపాదన పలస్తీనా ప్రజల జాతీయ హక్కులను పరిరక్షించేదికాదు. ఇప్పటికైనా ఈ విధ్వంసకాండను నిలిపివేసి రెండు రాజ్యాలను స్థాపించే పరిష్కారాన్ని ఆలోచించాలని కొన్ని దేశాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలను ఇజ్రాయిల్‌ ప్రజలు, పలస్తీనా ప్రజలు ఆమోదిస్తారా? గతంలోనే కుదిరిన రెండు దేశాల స్థాపన డిమాండ్‌ను ఇప్పటికైనా ఇజ్రాయిల్‌ కానీ, దాని స్నేహ దేశాలు కానీ అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో పలస్తీనా కోసం ఏర్పడిన అలీన ఉద్యమానికి సహకరించిన దేశాలు నేడు పలస్తీనా ప్రజల పరిరక్షణకోసం ముందుకు రావడంలేదు. బలమైన దేశాలు ముందుకు వచ్చి ఐక్యరాజ్యసమితిలో తీర్మానం పెట్టి సమస్య పరిష్కారానికి అంగీకారాన్ని పొందవలసిన సమయం ఇదే. ఇప్పటికే పలస్తీనా ప్రజలు భారీగా ధనప్రాణాలను కోల్పోయారు. ఇజ్రాయిల్‌ క్రూరమైన చర్యలకు పాల్పడేంతగా శక్తిని సాధించింది. ఇజ్రాయిల్‌ ఖాళీ అయిన గాజాప్రాంతంలో నివాసానికి తగిన గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బాధ్యత కూడా ఇజ్రాయిల్‌పైన ఉంది. పరిష్కారం కుదిర్చేందుకుగాను కెనిసెట్‌లో లాబీయింగ్‌ గ్రూపు మంగళవారం నుంచి చర్చలు జరుపుతోంది. గాజాను తిరిగి పలస్తీనా ప్రజలకు అప్పగించే ప్రతిపాదనతో ఈ చర్చలు జరుగుతున్నాయి. లాబీయింగ్‌ గ్రూపు మొదటిసారి సమావేశం కావడం ఇదే. ఇజ్రాయిల్‌ సమాజంలో మితవాద ప్రభుత్వానికి ఈ మారణకాండను వ్యతిరేకిస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలకు మధ్య పోరాటం జరుగుతోంది. 2023 నవంబరులో టెల్‌అవీవ్‌లో మాకీ, హదేశ్‌ల నాయకత్వంలో వందలాది ప్రదర్శనలు జరిగాయి. తక్షణం గాజాపై దాడులు నిలిపివేసి పరిష్కారం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. శాంతి భాగస్వామ్యంతో నిరసన ఉద్యమాలు చేస్తున్న గ్రూపులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమ గ్రూపులు శాంతియుతశక్తులు కలిసి ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. యూదులుఅరబ్‌లు కలిసిమెలిసి పలస్తీనా సమస్య పరిష్కారంకోసం పోరాటాన్ని నిర్వహించేందుకు స్పష్టమైన రాజకీయ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. దాడులను తక్షణం నిలిపి బందీలను, జైలులో ఉన్నవారిని విడుదల చేయడానికి రెండు రాజ్యాల ఏర్పాటు ఆధారంగా పరిష్కారంకోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌`పలస్తీనా మధ్య శాంతి, జాతీయ, పౌర సమానత్వం కోసం నిర్దిష్టమైన ప్రతిపాదనతో అరబ్‌, యూదుల భాగస్వామ్యంతో పరిష్కారం కోసం ప్రచారం సాగించాలని నిర్ణయించారు. దాడులకు, అన్నిరకాల ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా, మైనారిటీలుగా ఉన్న అరబ్‌ పౌరులు జాతీయ కూటమిగా పోరాటం సాగించనున్నారు. పలస్తీనా ప్రజలకు సొంత దేశంలో నివసించే హక్కు ఉన్నది. కెన్నెసెట్‌లో జరుగుతున్న చర్చలలో పాల్గొన్న దేశాలు ఏవేవో ఇంకా స్పష్టంకాలేదు. యూదు ప్రజలకు మద్దతుతెలియజేసే ఎంకే అయమన్‌ ఒడెశ్‌ (కెన్నెసెట్‌) ను చర్చల నుంచి బహిష్కరించాలని ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ బహిష్కరణకు ఇజ్రాయిల్‌లోని యూదు ప్రజలు కూడా మద్దతు తెలియజేశారు. అలాగే ఇజ్రాయిల్‌లో శాంతిని కోరుకునే యూదులు, ప్రతిపక్షంలోని భారీ గ్రూపులు సైతం అరబ్‌లకు తోడ్పాటు ప్రకటించారు. శాంతి భాగస్వామ్య సభ్యులు ఇజ్రాయిల్‌ ఫాసిజానికి వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పోరాడనున్నారు. ఈ పోరాటం ఉధృతమైతేనే, నెతన్యాహు దారికివచ్చి పలస్తీనా ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించవచ్చునని ఆశిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు