Homeరెండు లైన్ల ప్రసంగం… వాకౌట్

రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్

- Advertisement -

. కర్నాటక గవర్నరు తీరూ అదే
. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి చేసిన రెండు లైన్ల ప్రసంగం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం గెహ్లాత్ రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశంలో తన సంప్రదాయ ప్రసంగాన్ని రెండు ప్రారంభ పంక్తులు మాత్రమే చదివి ముగించారు. సభ్యులను పలకరించిన తర్వాత గవర్నర్… ‘ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జై హింద్, జై కర్నాటక’ అని ఆయన హిందీలో చదివారు. గవర్నర్ తన ప్రసంగాన్ని కుదించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… సభలో ‘సిగ్గు సిగ్గు’ అని నినాదాలు చేశారు. ప్రభుత్వం తయారుచేసిన పూర్తి ప్రసంగాన్ని గవర్నర్ చదవకపోవడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ‘కీలు బొమ్మ’లా వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వర్తించలేదని మండిపడ్డారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతామని సిద్ధరామయ్య అన్నారు. గవర్నర్ ప్రవర్తనపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన అన్నారు. లోక్‌భవన్, సిద్ధరామయ్య ప్రభుత్వం మధ్య ఉద్రిక్త ప్రతిష్టంభన తర్వాత గవర్నర్ కొద్దిసేపు కనిపించారు. ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆరోపణలున్న మొత్తం 11 పేరాలు, జీ రామ్ జీ రద్దు, నిధుల పంపిణీ సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ… వాటిని తొలగించాలని గవర్నర్ కోరారు. అయితే, కర్నాటక ప్రభుత్వం వాటిని తొలగించకపోవడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని రెండు వాక్యాలతోనే ముగించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం ఘర్షణల పరంపరలో ఇది తాజాది. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా, రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోకడలు పెరిగిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలపై పోరాడుతున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల ధోరణులు వీరి విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలు సైతం గవర్నర్ల తీరు రాజ్యాంగ స్ఫూర్తిని దిగజార్చేలా ఉందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కర్నాటక గవర్నర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆగ్రహం కలిగిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు