మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు
విశాలాంధ్ర-చింతూరు: జార్ఖండ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఎన్‌కౌంటర్ పేరుతో మరో 16 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. రాష్ట్రంలోని చోటా నాగపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంభాది సమీపంలోని సారండా అడవుల్లో గురువారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకార్పులు జరిగాయి. మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు, పతిరామ్ మాంజి అలియాస్ అనల్ దాదాతో పాటు 16 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సీఆర్పీఎఫ్ డీఐజీ అనురంజన్ కిస్పోట్టా, ఐజీ సాకేత్ సింహ్ తెలిపిన వివరాల ప్రకారం… సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో, కోబ్రా 203, 205, 209 దళాలతో పాటు సీఆర్పీఎఫ్, జార్ఖండ్, జాగ్వాల్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం అడవుల్లో బుధవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు దాగి ఉన్న ప్రదేశానికి గురువారం ఉదయం చేరుకోగానే పరస్పర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారని, అందులో రూ.కోటి రివార్డు గల మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజి అలియాస్ అనల్ దాదా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెద్దఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులు తప్పించుకునే అన్ని మార్గాలను కట్టడి చేయడానికి అదనపు భద్రతా దళాలు, బ్యాకప్ బృందాలను ఘటనాస్థలానికి పంపుతున్నట్లు వివరించారు. కాగా, సారండా అడవి మావోయిస్టులకు పట్టుగల ప్రాంతం కావడంతో రెండు నెలల క్రితమే సీఆర్పీఎఫ్, డీఐజీ అనురంజన్ కిస్పోట్టా అధ్వర్యంలో మావోయిస్టుల ఏరివేతకు చైలాసలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జార్ఖండ్, ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భద్రతా దళాలను రప్పించారు. మావోయిస్టుల అంతానికి కేంద్రం విధించిన గడువు సమీపిస్తుండటంతో భద్రతా దళాలు సైతం విచ్చలవిడిగా ఎన్‌కౌంటర్ పేరుతో మావోయిస్టులను కాల్చిచంపుతున్నాయి.
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి
- Advertisement -


