Homeమోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం

మోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం

- Advertisement -

. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
. మహిళా రక్షణ కేవలం నినాదమే
. ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు
. సైదా సయుద్దిన్ హమీద్, నిషా సిద్ధూ
. ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మోదీ సర్కారు అవలంబిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు అవశ్యమని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎనఎఫఐడబ్ల్యూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా సయుద్దిన్ హమీదు, నిషా సిద్ధూ చెప్పారు. దేశంలో మతవాద రాజకీయాలు ప్రధాన ఆయుధంగా మారాయని, దేశ యువత ఈ రాజకీయ వ్యవస్థ వల్ల అత్యంత ప్రభావితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింస భయంకరస్థాయికి చేరుకుందని, అత్యాచారాలు, గృహహింస, పరువు హత్యలు, సైబర్ వేధింపులు పెరుగుతున్నప్పటికీ… నేరస్తులు శిక్షకు బదులుగా రాజకీయ రక్షణ పొందుతున్నారని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ, పౌరుల హక్కులను వ్యవస్థాగతంగా బలహీనపరిచే దశలోకి ప్రవేశించాయని మండిపడ్డారు. ఈ పరిస్థితి యాదృచ్ఛిక వైఫల్యాల ఫలితం గానీ, పరిపాలనా అజ్ఞానత ఫలితంగానీ కాదన్నారు. ఇది పాలక వర్గం, కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తుల మధ్య లోతైన, ఉద్దేశపూర్వక ఫలితమని నొక్కిచెప్పారు. విజయవాడ ఐఎంఏ హాలులో ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ సమితి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న సమావేశాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎనఎఫఐడబ్ల్యూ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆవరణలో ఎనఎఫఐడబ్ల్యూ పతాకాన్ని నిషా సిద్ధూ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అత్తిలి విమల, పెన్మెత్స దుర్గాభవాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి జాతీయ అధ్యక్షురాలు సైదా సయుద్దిన్ హమీదు, ఆవిష్కరించారు. అనంతరం సమావేశానికి అధ్యక్షవర్గంగా ఎనఎఫఐడబ్ల్యూ నాయకులు డాక్టర్ కొన్నికా రాయ్, డాక్టర్ కె.రజని, శ్యామ్‌శ్రీ బాస్, పెన్మెత్స దుర్గాభవాని, కన్వల్‌సిట్ కౌర్, శక్తిదేవి, పద్మావతి వ్యవహరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు జాతీయ, ప్రాంతీయ సమావేశాలపై చర్చించారు. ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శులు అరుణా సిన్హా, డాక్టర్ బిజు మోల్, డాక్టర్ ఏఆర్ శాంతి, అత్తిలి విమల, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పద్మావతి, కార్యదర్శులు ఎం.యామిని, నదియా, రాష్ట్ర సమితి సభ్యులు ఓర్సు భారతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించారు.
నిషా సిద్ధూ కార్యదర్శి నివేదిక ప్రవేశపెడుతూ…అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రధాన లక్ష్యం ప్రజలను శాశ్వతంగా భయం, ఉన్మాదం, కృత్రిమ గందరగోళంలో బంధించి… తద్వారా వాస్తవ సామాజిక ఆర్థిక ప్రశ్నల చుట్టూ ఏ విధమైన సంఘటిత ప్రతిఘటన ఎదగకుండా చేయడమేనని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఏదొక జాతీయ సమస్యను సృష్టిస్తున్నారని, కొన్నిసార్లు నోట్ల రద్దు వంటి నిర్ణయాలు అసంఘటిత కార్మికులు, పేదల జీవనోపాధులపై నేరుగా దాడి చేయడానికి ఉపయోగించబడ్డాయని గుర్తుచేశారు. మరికొన్ని సార్లు ఎనఆర్సీ, సీఏఏ, కేవైసీ వంటివి అకస్మాత్తుగా అమలు చేసేందుకు ఒడిగడుతున్నాయని తప్ప్పుపట్టారు. యుద్ధోన్మాదం, సరిహద్దు ఉద్రిక్తతలను తరచూ రెచ్చగొడుతూ మతద్వేషాన్ని రాజకీయ ఆయుధంగా వినియోగిస్తున్నారన్నారు. ఇది పరిపాలనా గందరగోళం కాదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ, కార్మికహక్కులు, మహిళల భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలను తెరపైకి రాకుండా చేయడానికి దారి మళ్లింపు వ్యూహమని ఆమె విశ్లేషించారు. ప్రజాస్వామ్యంపై దాడి కేవలం విధానపర నిర్ణయాలకే పరిమితం కాదని, ప్రజాస్వామ్యానికి పునాదైన ఎన్నికల ప్రక్రియనే వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎసఐఆర్ వంటి ప్రక్రియల ద్వారా పేదలు, వలస కార్మికులు, దళితులు, మైనార్టీలు, పెద్ద సంఖ్యలో మహిళల పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగిస్తున్నారని, పత్రాల పేరుతో పౌరసత్వం, ఓటు హక్కును షరతులతో కూడిన, బహిష్కరణాత్మక అంశాలుగా మారుస్తున్నారని ఆందోళన చెందారు. ఇది ఎన్నికల సంస్కరణ ఏమాత్రం కాదన్నారు. వ్యవస్థాగత ఓటు దొంగతనం, ఎన్నికల ఇంజినీరింగ్ చేస్తున్నారన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను బహిరంగంగానే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు, ప్రజా ఉద్యమాలు, కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంస్థలను భయపెట్టడానికి, మౌనం పాటింపజేయడానికి ఉపయోగించే ఆయుధాలుగా అవి మారాయని అన్నారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించిన కార్మిక హక్కులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయబడ్డాయన్నారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అనిశ్చిత ఉద్యోగాలు వస్తున్నాయని, పని గంటలు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సంఘటితమయ్యే హక్కు, సమ్మె హక్కు పరిమితమైందన్నారు. లేబర్ కోడ్ల ప్రభావం మహిళా కార్మికులపై మరింత వినాశకరంగా ఉందన్నారు. సమానత్వం పేరుతో మహిళలను రాత్రి షిఫ్ట్‌లలో, ప్రమాదకర వృత్తుల్లో భద్రతా ఏర్పాట్లు లేకుండా పనిచేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతోపాటు పీపీపీ విధానంతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యల్ని ఆమె తూర్పారబట్టారు. రాజకీయాలు అసమర్థమైనవే కాక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, కార్మిక హక్కులు, మహిళల విముక్తికి ప్రాణాంతకంగా మారాయన్నారు.
మహిళలపై భయంకర హింస: సైదా
ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సైదా సయుద్దిన్ హమీదు మాట్లాడుతూ మహిళలపై హింస భయంకర స్థాయికి చేరుకుందని, అత్యాచారాలు, గృహహింస, పరువు హత్యలు, సైబర్ వేధింపులు పెరుగుతున్నప్పటికీ నేరస్తులు శిక్షకు బదులుగా రాజకీయ రక్షణ పొందుతున్నారని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పలస్తీనాలో జరుగుతున్న మారణకాండపై ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, నేపాల్‌లో దారుణకాండ, ఇటీవల వెనెజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడి ప్రపంచ భద్రతకే ముప్ప్పుగా పరిణమించాయన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం మానవత్వం కాదన్నారు. ప్రజారోగ్య వ్యవస్థలను పటిష్టపరచడం, మహిళలపై గృహహింసను కట్టడి చేయడం, పని చేసే మహిళలకు భద్రత కల్పించడానికి బదులు మూఢనమ్మకాలు, ప్రతీకాత్మక చర్యల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎనఎఫఐడబ్ల్యూ నాయకత్వ పాత్ర అత్యంత కీలకంగా నిలవనుందని నొక్కిచెప్పారు. ఓటు చోరీ, ఎసఐఆర్ ప్రక్రియ, మతమార్పిడి వ్యతిరేక చట్టాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నాలుగు కార్మిక కోడ్లు, నయా-ఉదారవాద విధానాలపై సంయుక్త పోరాటాలు అవసరమని ఆమె స్పష్టంచేశారు. దుర్మార్గ రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రతిఘటనను మరింత తీవ్రతరం చేయాలనే తన సంకల్పాన్ని ఎనఎఫఐడబ్ల్యూ పునరుద్ఘాటిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, నజీర్ తదితరులు అభ్యుదయ గేయాలు ఆలపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు