. నవంబరు 6, 11న పోలింగ్…14న ఓట్ల లెక్కింపు
. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
. ఏడు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
న్యూదిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తెలిపింది. నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సోమవారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి… ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీలు తదితర వివరాలను వెల్లడిరచారు. ‘‘బీహార్ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. తొలి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 10న, రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ 13వ తేదీన రానుంది. తొలి విడత ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఈనెల 17 కాగా, రెండో దశ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 20. నామినేషన్ల పరిశీలన 18, 21 తేదీల్లో జరుగుతాయి. నామినేషన్ల ఉపసంహరణకు తొలి విడతకు చివరి తేదీ 20 అక్టోబర్, రెండో విడతకు 23 అక్టోబర్. తొలి విడత ఎన్నికలు నవంబర్ 6న గురువారం జరగనుండగా, రెండో విడత 11 నవంబర్ మంగళవారం జరుగుతాయి. లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16 వరకు ముగుస్తుంది’’ అని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 17 నూతన సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వినియోగిస్తున్నామని, 250 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అశ్వికదళాలతో గస్తీ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించామని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 10న తొలి విడత నోటిఫికేషన్, 13న రెండో విడత నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. కాగా 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉపఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడిరచారు.
ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు స్వీకరిస్తాం…
బీహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై జ్ఞానేశ్ కుమార్ స్పందిం చారు ‘‘ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు ఒకటిన విడుదల చేశాం. దానిని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశాం. అభ్యం తరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించాం. ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం’’ అని తెలిపారు.
8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, జార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్‌లోని తర్న్‌తారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని జ్ఞానేశ్‌కుమార్ పేర్కొన్నారు.
బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు… 7.42 కోట్ల మంది ఓటర్లు
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అందులో ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు- 38, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లు- 2 ఉన్నాయి. మొత్తంగా 7.42 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.50 కోట్లు ఉన్నారు. బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22లోపు ముగియనుంది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు ఈసీ ఇంతకుముందు తెలిపింది. ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నితీశ్ ఎన్డీయేను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాగట్బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. 2024 జనవరిలో మహాఘట్బంధన్‌ను వీడిన జేడీయూ…మళ్లీ ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నితీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా ఐక్యసంఘటన మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. కాగా, బీహార్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది.


