ముంబై: ఓ వైపు ఐపీఎల్ 2026 సీజన్ సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లోనే మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యే వరకూ ఏ భారత క్రికెటరూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం నిశ్శబ్దంగా మహాసంగ్రామం కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఓ 20 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసమేనని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ మ్యాచుల్లోనూ ప్లేయర్ల ఆటతీరును సెలక్టర్లు దగ్గరుండి గమనిస్తారు. ‘ప్రతి సెలక్టర్ కచ్చితంగా వారానికి ఒక్క మ్యాచ్ అయినా మైదానానికి వెళ్లి చూడాలి. అలాగైతే అందరూ కలిసి వారానికి ఐదు మ్యాచులు కవర్ చేసినట్లు అవుతుంది. ఐపీఎల్‌లో మ్యాచులను గమనించడమంటే రాబోయే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ 2028ను దృష్టిలో ఉంచుకుని మాత్రం కాదు. అలాగని, వన్డే ప్రపంచ కప్ కోసం కొత్తగా స్టార్‌ను వెతికే పనీ లేదు. ఉన్న ప్లేయర్ల ఆటతీరుపై అంచనా వేయాలి. హర్షిత్ రాణా గాయం కారణంగా ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగాడు. మిగిలిన పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య ఆటతీరును సెలక్టర్లు ట్రాక్ చేస్తారు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత అఫ్గానిస్థాన్‌తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదేమీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం కానప్పటికీ… టీమిండియాలో ప్రతి సీనియర్ ఆటగాడు బరిలోకి దిగుతాడని బీసీసీఐ పేర్కొంది. డబ్ల్యూటీసీ నాలుగో సీజన్‌లో భారత్ ఇంకా తొమ్మిది టెస్టులు ఆడనుంది. బుమ్రా, సిరాజ్ సహా ఇతర పేసర్లు బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ‘భారత టెస్టు క్యాప్‌ను ప్రయోగాలకు వేదికగా మార్చాలనుకోవడం లేదు. అందుకోసం ఇండియా టూర్లు ఉన్నాయి. ప్రతి టెస్టులోనూ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్‌ను ఆడించేందుకు సెలక్టర్లు దృష్టిసారించారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తన పదవీకాలాన్ని వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకూ పొడిగించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తమ వద్దకు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని బీసీసీఐ వెల్లడించింది. అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఉంది. ఆ తర్వాత అజిత్‌తో కలిసి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.


