సీజేఐపై షూతో దాడికి న్యాయవాది యత్నం
న్యూదిల్లీ: సుప్రీం కోర్టులో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి ప్రయత్నించాడు. అది గమనించిన తోటి లాయర్లు… అతన్ని నిలువరించి పోలీసులకు అప్పగించారు. ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ గవాయ్ కొట్టేశారు. తీర్పు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ఇవాళ ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది ఒకరు ఆయనపైకి షూ విసిరే ప్రయత్నం చేశాడు. అయితే అది సీజేఐ బెంచ్ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. ఆ సమయంలో ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు’ అంటూ నినాదం చేశాడు. తోటి లాయర్లు అతన్ని అడ్డుకుని… కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఈ పరిణామం నుంచి వెంటనే తేరుకున్న జస్టిస్ బీఆర్ గవాయ్.. ‘ఇలాంటి చర్యలు తననేం చేయబోవని, వాదనలు కొనసాగించాలి’ అని కేసు వాదిస్తున్న న్యాయవాదులకు సూచించారు. దాడికి పాల్పడిన న్యాయవాది పేరు కిషోర్ దాస్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు… దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, సీజేఐ బీఆర్ గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‌ని బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది.


