Homeవీడని సందిగ్ధం

వీడని సందిగ్ధం

- Advertisement -

సీఎం ఆదేశించినా కదలని పదోన్నతుల ఫైలు
. అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు
. 3 వేల మందికి పైగా ఎదురుచూపులు

విశాలాంధ్ర-సచివాలయం: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారంటూ ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున హడావుడి చేశారు. రోజులు తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ పదోన్నతులపై ఆర్టీసీలో స్పందన లేదు. రాష్ట్రంలోని పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల జాబితా నాలుగు నెలల క్రితమే అధికారులు రూపొందించారు. వీరిలో డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌ కేడర్‌ ఉద్యోగులు మూడు వేల మంది. వీరి పదోన్నతి కోసం అవసరమైన వివరాలు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపగా… ఆర్థికశాఖ నుంచి అనుమతి రావడంతో సీఎంఓకి ఉద్యోగుల పదోన్నతి ఫైలు చేరింది. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా పదోన్నతులు ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు పదోన్నతుల ఫైలు ముందకు కదలడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశించినా… ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం పట్టించకోవడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో ఏ నిబంధనల మేరకు పదోన్నతులు ఇవ్వాలనే అంశంపై స్పష్టత కొరవడటంతో పదోన్నతులు ఇవ్వడం అధికారులు ఆపేశారు. పదోన్నతులు నిలిచిపోవడంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసు కొచ్చాయి. అనేకమార్లు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించడమే కాక ప్రభుత్వంలోని పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేశాయి. గత ఆరేళ్లుగా పదోన్నతులు లేకుండానే అనేకమంది ఉద్యోగులు పదవీ విరమణచేస్తున్నారు. మరికొందరు పదవీ విరమణకు చేరువలో ఉన్నారు. కనీసం పదవీ విరమణ లోపు ఒక్క పదోన్నతైనా దక్కితే చాలంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల స్థాయిలో ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. అయితే ఒక్కసారి మూడు వేల మందికి పదోన్నతులు ఇస్తే ఉద్యో గుల కొరత ఏర్పడొచ్చనే ఆలోచనే పదోన్నతుల్లో జాప్యానికి కారణంగా భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఖాళీల వివరాలను ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వంపారు. కనీసం 10వేల పోస్టులను భర్తీ చేస్తే ఆర్టీసీ నిర్వహణ మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఖాళీల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు ద్వారా అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయని చెబుతున్నారు. ఆర్టీసీలో ఉన్నప్పుడే పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగేదని…ఖాళీల ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారుల నిర్ణయంతో పదోన్నతులు ఇచ్చేవని, ప్రభుత్వంలో విలీనం తర్వాతనే సమస్య ఎదురువుతోం దని ఉద్యోగులు అంటున్నారు. గతంలో ఆర్టీసీపాలనా సౌలభ్యం కోసం డివిజన్ల విధానం తీసు కొచ్చారు. ఉద్యోగులు ఆర్టీసీలోనే ఉన్నప్పుడు డివిజన్‌ సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతులు ఇచ్చే వారు. దీంతో పట్టణ ప్రాంతాల డివిజన్లు, రూరల్‌ డివిజన్లలో పదోన్నతుల ప్రక్రియ వేర్వేరుగా ఉండేది. కొన్ని చోట్ల జూనియర్‌ ఉద్యోగులు పదోన్నతులు పొందితే గ్రామీణ ప్రాంతాల్లోని డివిజన్ల పరిధిలో పని చేసే ఉద్యోగులు సీనియర్లు అయినప్పటికీ పదోన్నతులు వచ్చేవి కావు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగులు విలీనమైందున ఉమ్మడి జిల్లాల ప్రాతిపది కన సీనియారిటీ జాబితా రూపొందించాల్సి ఉందని ఉద్యో గులు చెబుతున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.
ఏళ్ల తరబడి జరుగుతున్న పదోన్నతుల జాప్యంపై ఇటీవల ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఉద్యోగ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆర్టీసీ పదోన్నతులకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ పదోన్నతుల ప్రక్రియ మొదలు కాలేదు. అయితే కొందరు అధికారులకు ఇష్టం లేక పాత డివిజన్ల విధానంలో చేయాలనే ఆలోచన వల్లే పదోన్నతులకు బ్రేక్‌ పడేందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని పదోన్నతుల ప్రక్రియను ముగించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు